శిరీష హత్య అందుకే జరిగింది.. అసలు గుట్టు విప్పిన పోలీసులు
ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన కీలక విషయాలను ఏసీపీ శ్యామ్ సుందర్ వెల్లడించారు.
By: Tupaki Desk | 5 March 2025 11:01 PM ISTహైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన నర్సు శిరీష హత్య కేసులో పోలీసులు కీలక ముందడుగు వేశారు. చాదర్‌ఘాట్ పోలీసులు ఈ ఘటనలో ప్రధాన నిందితులైన శిరీష భర్త వినయ్ కుమార్, సరిత, నిహాల్ కుమార్‌ను అరెస్టు చేసి, మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన కీలక విషయాలను ఏసీపీ శ్యామ్ సుందర్ వెల్లడించారు.
- హత్యకు గల కారణాలు ఇవీ
2016లో సరిత, శిరీష కలిసి సన్‌రైజ్ ఆస్పత్రిలో పనిచేస్తుండగా పరిచయం ఏర్పడింది. శిరీష అనాధ అని తెలుసుకున్న సరిత, తన తమ్ముడు వినయ్ కుమార్‌తో ఆమె వివాహం జరిపించింది. అయితే, శిరీష ఉద్యోగ మార్పులు చేస్తూ 2024లో హయత్‌నగర్‌లోని వివేర్ ఆస్పత్రిలో చేరింది. ఫిబ్రవరి 28న సరితకు తెలియకుండా ఆమె ఆ ఉద్యోగం కూడా వదిలేసింది. ఈ విషయం తెలిసి సరిత కోపంతో ఆమెతో వాగ్వాదానికి దిగింది.
ఈ గొడవ సమయంలో శిరీష "నీ సంబంధాలు అన్నీ నాకు తెలుసు, అందరికీ చెప్తాను" అంటూ హెచ్చరించడంతో సరిత మరింత ఆగ్రహానికి గురైంది. మరుసటి రోజు శిరీష క్షమాపణ చెప్పినా, సరిత ఆగ్రహాన్ని దించుకోలేదు.
- హత్యకు కుట్ర
సరితకు మత్తుమందులు వాడే అలవాటు ఉండేది. శిరీష నిద్ర పట్టడం లేదని చెప్పి కొంత మత్తుమందు ఇవ్వమని సరితను కోరింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న సరిత, మత్తుమందు ఎక్కువ మోతాదులో ఇచ్చింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన శిరీషపై దిండుతో ఒత్తిడి చేసి, గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. అనంతరం, తన అక్క కొడుకు నిహాల్ సహాయంతో సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేసింది.
- పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
శిరీష మేనమామ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శిరీష మృతదేహాన్ని దోమలపెంట తరలించే సమయంలో వినయ్ కుమార్‌కు కాల్ చేసి అంబులెన్స్‌ను వెనక్కి రప్పించారు. పోస్టుమార్టం రిపోర్టులో శిరీషను గొంతు నులిమి హత్య చేసినట్టు తేలింది. విచారణలో సరిత హత్యను అంగీకరించగా, నిందితులైన వినయ్ కుమార్, నిహాల్ కుమార్ కూడా ఇందులో ప్రమేయం ఉన్నట్లు వెల్లడైంది. హత్యకు ఉపయోగించిన దిండు, బెడ్ షీట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసు పూర్తిగా ఒక సినిమాటిక్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నప్పటికీ, విచారణలో పోలీసులు ఛేధించి నిందితులు పట్టుబడ్డారు.