చెన్నైలో డాక్టర్ దుర్మార్గం.. చంపేసి.. వాసన రాకుండా ఏసీ వేసి మరీ!
ఒక డాక్టర్ దుర్మారం గురించి తెలిస్తే నోట మాట రాదంతే. ఇలా కూడా చేస్తారా? అన్నట్లుగా ఉండే ఈ ఉదంతం చెన్నైలో చోటు చేసుకుంది.
By: Tupaki Desk | 1 Feb 2025 11:30 AM GMTఒక డాక్టర్ దుర్మారం గురించి తెలిస్తే నోట మాట రాదంతే. ఇలా కూడా చేస్తారా? అన్నట్లుగా ఉండే ఈ ఉదంతం చెన్నైలో చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో పెరుగుతున్న కొత్త తరహా నేరాలు కొత్త భయాలకు తెర తీస్తున్నాయని చెప్పాలి. చెన్నైలోని తిరుముల్లైవాయల్ లోని ఒక అపార్టుమెంట్ లో ఉంటున్న తండ్రి,కూతుళ్ల మృతదేహాల మిస్టరీకి సంబంధించి ఒక వైద్యుడ్ని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా వెలుగు చూసిన వివరాల్ని చూస్తే.. షాక్ కు గురి కావాల్సిందే.
70 ఏళ్ల శంకర్.. ఆయన కుమార్తె 37 ఏళ్ల సింథియా చెన్నైలో ఉంటారు. అయితే.. శంకర్ కిడ్నీసమస్యతో బాధ పడుతుండేవారు. ఇదిలా ఉండగా ఆయన కుమార్తె సింథియాకు ఆన్ లైన్ లో పరిచమయ్యారు డాక్టర్ శ్యాముల్. దీంతో.. తన తండ్రికి చికిత్స చేయాలని కోరగా.. అతను అంగీకరించారు. అయితే.. శ్యాముల్ వేలూరులో ఉండేవాడు. దీంతో.. ప్రతిసారి వేలూరు నుంచి వచ్చి చికిత్స చేయటం ఇబ్బందిగా మారటంతో వారిని అపార్టుమెంట్ లో ఉంచి తానే వచ్చి వైద్యం చేస్తుండేవాడు.
చికిత్స పొందుతున్న శంకర్.. గత సెప్టెంబరు 6న చికిత్స పొందుతూ మరణించాడు. తండ్రి మరణం తట్టుకోలేని సింథియా డాక్టర్ శ్యామూల్ ను ప్రశ్నించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్తా పెరగటం.. సింథియాను నెట్టేయటంతో ఆమె తలకు గాయమై.. మరణించింది. దీంతో షాక్ కు గురైన డాక్టర్ శ్యామూల్ తండ్రీ కూతుళ్ల డెడ్ బాడీలను ఒక గదిలో ఉంచి తాళం వేసి వెళ్లారు. దుర్వాసన రాకుండా ఉండేందుకు ఏసీ వేసి కాంచీపురం వెళ్లాడు. వారానికి రెండుసార్లు వచ్చి.. కెమికల్స్ చల్లి వెళ్లేవాడు. ఈ విషయం బయటకు వస్తే కాంచీపురంలో గుండె కు సర్జరీ చేసుకున్న తల్లికి ప్రమాదం జరుగుతుందని ఐదునెలలుగా తండ్రికూతుళ్ల మరణాల్ని దాచి ఉంచాడు.
ఇటీవల కరెంట్ పోవటం.. శంకర్ ఇంటి నుంచి భయంకరమైన దుర్వాసన రావటంతో అపార్టుమెంట్ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాళం పగలకొట్టి లోపలకు వెళ్లిన వారంతా కుళ్లిపోయి.. ఆస్తిపంజరాలుగా ఉన్న తండ్రీకూతుళ్లు కనిపించారు. ఈ క్రమంలో డాక్టర్ శ్యామూల్ ను అదుపులోకి తీసుకొన్న పోలీసులు 12 గంటల పాటు విచారించగా.. అన్ని వివరాల్ని వెల్లడించారు. శంకర్ బంధువులకు వాట్సాప్ కాల్ చేయటం.. మిస్డ్ కాల్స్ చేస్తూ మేనేజ్ చేసినట్లుగా గుర్తించారు. ఈ ఉదంతంలో డాక్టర్ ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ వ్యవహారం తెలిసిన వారంతా విస్తుపోతున్నారు.