గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్ ఘటన... పోలీసులు కీలక ప్రకటన!
ఈ నేపథ్యంలో గురువారం రాత్రి నుంచి విద్యార్థినులు కాలేజీ యాజమాన్యానికి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు చేశారు.
By: Tupaki Desk | 31 Aug 2024 3:48 AM GMTకృష్ణాజిల్లా గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కాలేజీలోని అమ్మాయిల హాస్టల్ బాత్ రూమ్ లలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసి వీడియోలు తీశారన్న వార్త తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి నుంచి విద్యార్థినులు కాలేజీ యాజమాన్యానికి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు చేశారు.
ఈ విషయం ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ నేపథ్యంలో హాస్టల్ లో సీక్రెట్ కెమెరాలను కనిపెట్టేవరకూ తాము లోపలికి వెళ్లలేమంటూ విద్యార్థినులు బైఠాయించి, ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో... మేనేజ్మెంట్ సరిగా రెస్పాండ్ అవ్వలేదంటూ విద్యార్థినులు, వారి తల్లితండ్రులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు.
ఈ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యవహారంపై స్పందించి.. ఓ మహిళా సీఐ ఆధ్వర్యంలో టెక్నికల్ టీమ్ ని నియమించి విచారణకు ఆదేశించారు. ఇదే సమయంలో వార్డెన్ పైనా చర్యలకు ఆదేశించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో... పోలీసులు ఓ కీలక ప్రకటన చేశారు. దీంతో... విద్యార్థినులు ఆందోళన విరమించారు!
అవును... గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ లో రహస్య కెమెరాల ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుడివాడ సీఐ, టెక్నికల్ డిపార్ట్మెంట్ ఎస్సై, మరో ముగ్గురు కానిస్టేబుళ్లతో కమిటీ వేశారు. ఇదే సమయంలో... ఆరోపణలు వచ్చిన విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోపక్క విద్యార్థినులు, వారి తల్లితండ్రులు, కళాశాల సిబ్బంది సమక్షంలోనే గర్ల్స్ హాస్టల్ మొత్తం తనిఖీ చేసింది పోలీసు టీమ్. ఎలక్ట్రానిక్ డివైస్ లను గుర్తించే పరికరాలతో బాత్ రూమ్ లతో పాటు హాస్టల్ లోనూ అణువణువూ గాలించారు. ఈ తనిఖీలు సుమారు 4 గంటలకు పైగా సాగాయి. అనంతరం.. ఇక్కడ రహస్య కెమెరాలు లభించలేదని పోలీసులు తెలిపారు.
ఇలా తమ సమక్షంలోనే తనిఖీలు జరగడంపట్ల సంతృప్తి వ్యక్తం చేసిన విద్యార్థినులు ఆందోళన విరమించారు. ఈ విషయాలపై స్పందించిన చంద్రబాబు... ఎలాంటి కెమెరాలు లభించలేదని వెల్లడించారు. అయినప్పటికీ దర్యాప్తు కొనసాగిస్తూ సమగ్ర విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థినిలు, వారి తల్లితండ్రులు అప్రమత్తంగా, ధైర్యంగా ఉండాలని సూచించారు.