ప్రియురాలు చేసిన పనికి ప్రియుడి గుండె ఆగింది!
ఢిల్లీకి చెందిన ఒక ప్రేమజంటకు సంబంధించిన ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
By: Tupaki Desk | 21 Oct 2024 11:30 AM GMTప్రేమికుల మధ్య ఉండాల్సిన పరస్పర నమ్మకం.. విశ్వాసం కంటే అపనమ్మకం.. అపార్థాలు అంతకంతకూ ఎక్కువ అయిపోతున్న రోజులివి. ప్రేమ తీరు పూర్తిగా మారిన ఈ రోజుల్లో ప్రేమికుల తీరు ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాని అనిశ్చితి. ఇప్పుడు అలాంటి ఇద్దరు ప్రేమికుల తీరుతో ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఢిల్లీకి చెందిన ఒక ప్రేమజంటకు సంబంధించిన ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
ప్రేమికుల్లో ఒకరు లా చదువుతున్న విద్యార్థిని కాగా అతడు (అరుణ్ నందా) జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. యువతిది ఢిల్లీలోని జగత్ పురి ప్రాంతానికి చెందిన అమ్మాయి.. కారణం ఏమిటన్నది బయటకు రాలేదు కానీ.. ఆమె తన మణికట్టు నరాల్ని పదునైన కత్తితో కోసుకొని.. దానికి సంబంధించిన వీడియోను ప్రియుడికి వాట్సాప్ చేసింది. దీంతో కంగారు పడిన అరుణ్ ఆమె వద్దకు వెళ్లి.. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
చికిత్స పొందుతున్న దశలో.. యువతి పరిస్థితిని చూసిన అరుణ్.. ఒక్కసారిగా స్ప్రహ కోల్పోయాడు. వెంటనే అతడ్ని పరీక్షించిన వైద్యులు.. అతను మరణించినట్లుగా ప్రకటించారు. శనివారం జరిగిన ఈ ఉదంతం ఆదివారం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ విషాద ఘటన గురించి ఆనంద్ విహార్ పోలీసులు వెల్లడించారు. గుండె ఆగి అతడి మరణం చోటుచేసుకొని ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత మరణానికి కారణంపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. మరోవైపు.. ఆసుపత్రితో చికిత్స పొందుతున్న యువతి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రియుడి పరిస్థితి గురించి ఆమెకు సమాచారం ఇవ్వలేదు.