Begin typing your search above and press return to search.

బావమరిది ఆస్తి కోసం సుపారీ ఇచ్చి చంపేసిన బావ

దారుణ ఉదంతం ఒకటి హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   15 Sep 2024 1:30 PM GMT
బావమరిది ఆస్తి కోసం సుపారీ ఇచ్చి చంపేసిన బావ
X

దారుణ ఉదంతం ఒకటి హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది. బావమరిది ఆస్తి మీద కన్నేసిన బావ.. సుపారీ ఇచ్చి మరీ చంపించిన వైనం షాకింగ్ గా మారింది. ఆన్ లైన్ బెట్టింగ్ లకు బానిసై.. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఒకరు.. తనకున్న ఆర్థిక కష్టాల నుంచి తప్పించుకోవటానికి అత్తింటి ఆస్తిపై కన్నేయటమేకాదు.. అడ్డుగా ఉన్నాడని బావమరిది సుపారీ ఇచ్చి మరీ చంపించిన వైనం సంచలనంగా మారింది. అంతేకాదు.. కిరాయి హంతకులతో హత్య చేయించి.. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయితే.. నేరం చేసినోడు తప్పించుకోలేడన్న సహజ సూత్రానికి తగ్గట్లే.. హత్యకు పాల్పడిన ఉదంతంలో పోలీసుల చేతికి చిక్కాడు.

ఏపీలోని నెల్లూరు జిల్లా కావలికి చెందిన ప్రకాశం అనే వ్యక్తికి అమూల్య అనే కుమార్తె.. యశ్వంత్ అనే కుమారుడు ఉన్నారు. తన కుమార్తె అమూల్యను నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీకాంత్ కు ఇచ్చి 2017లో పెళ్లి చేశాడు. కొండాపూర్ లో పీజీ నిర్వహించే శ్రీకాంత్ బెట్టింగ్ లకు బానిస అయ్యాడు. రూ.4 కోట్ల వరకు అప్పుల పాలయ్యాడు. ఆర్థిక సమస్యల నుంచి తప్పించుకోవటానికి అత్తింటి వారి ఆస్తి మీద కన్నేశాడు.

ఆస్తి మొత్తం తనకు దక్కాలంటే అడ్డుగా ఉన్న బావమరిది యశ్వంత్ ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు.బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్న అతడ్నిహైదరాబాద్ పంపమని అత్తమామలకు చెప్పాడు. హాస్టల్ నిర్వహణతో పాటు.. జాబ్ వెతుక్కోవటానికి బాగుంటుందనిచెప్పాడు. అందుకు సరేనన్న వారు.. తమ కొడుకు యశ్వంత్ ను హైదరాబాద్ కు పంపారు. శ్రీకాంత్ కు చెందిన హాస్టల్ లో ఉన్న యశ్వంత్.. జాబ్ ట్రయల్స్ లో ఉన్నాడు.

తన ప్లాన్ లో భాగంగా యశ్వంత్ చెడు సావాసాలు చేస్తున్నాడని.. గంజాయికి బానిస అయినట్లుగా తప్పుడు మాటలు చెప్పి అత్తమామల్ని నమ్మించాడు. హత్యకు నాలుగు రోజుల ముందు కూడా యశ్వంత్ గురించి చెడుగా చెప్పాడు. బావమరిదిని అడ్డు తొలిగించుకోవటానికి కర్ణాటకు చెందిన ఆనంద్.. ఏపీలోని కడప జిల్లాకు చెందిన వెంకటేశ్ తో రూ.10 లక్షలకు బేరం మాట్లాడుకున్నాడు. ఇందులో భాగంగా రూ.90వేలు అడ్వాన్సుగా ఇచ్చాడు.

తమ ప్లాన్ లో భాగంగా హాస్టల్ సీసీ కెమేరాలు ఆఫ్ చేసి.. రూంలో గాఢ నిద్రలో ఉన్న యశ్వంత్ మెడకు చున్నీ వేసి ఊపిరి ఆడకుండా చంపేశారు. అనంతరం ఫ్యాన్కు ఉరి వేసి ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. పోలీసులను.. కుటుంబ సభ్యులను తన ప్లాన్ లో భాగంగా తప్పు దారిలోకి వెళ్లేలా చేశాడు. తమ సంప్రదాయానికి విరుద్ధంగా యశ్వంత్ డెడ్ బాడీని దహనం చేయాలని పట్టుబట్టాడు. దీంతో.. శ్రీకాంత్ పై కుటుంబ సభ్యులకు సందేహం వచ్చింది.

మరోవైపు పోస్టుమార్టం రిపోర్టులో యశ్వంత్ మెడపై గాయాలు ఉన్నట్లుగా వివరాలు వచ్చాయి. దీంతో సందేహం వచ్చిన పోలీసులు సాంకేతిక ఆధారాల్ని సేకరించటం షురూ చేశారు. సీసీకెమేరాలు.. కాల్ డేటాను పరిశీలించగా అనుమానం బలపడింది. ఇదే సమయంలో యశ్వంత్ తండ్రి తన కొడుకు మరణంపై అనుమానాల్ని వ్యక్తం చేస్తూ ఫిర్యాదు ఇచ్చారు. దీంతో.. శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. చివరకు అసలు నిజాన్ని చెప్పేశాడు. దీంతో.. హత్యకు సహకరించిన మరో ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. ఆస్తి కోసం సొంత బావమరిదిని చంపేసిన ఉదంతం గుండెను మెలిపెట్టేసేలా మారింది.