దారుణం... పిల్లలకు గంజాయి ఇచ్చి దారుణాలు!
ఇదంతా గత ప్రభుత్వం పనే అని నేటి ప్రభుత్వ పెద్దలు అంటే.. అధికారంలోకి వచ్చి 7 నెలలు అయినా ఈ తరహా మాటలు ఏమిటో అని పాత ప్రభుత్వ శ్రేణులు స్పందిస్తున్నాయి.
By: Tupaki Desk | 19 Jan 2025 8:30 AM GMTగంజాయి విచ్చల విడిగా వ్యాపించిందని.. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా యువత దీనికి బానిసవుతున్నారనే కథనాలు నిత్యం వినిపిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. ఇదంతా గత ప్రభుత్వం పనే అని నేటి ప్రభుత్వ పెద్దలు అంటే.. అధికారంలోకి వచ్చి 7 నెలలు అయినా ఈ తరహా మాటలు ఏమిటో అని పాత ప్రభుత్వ శ్రేణులు స్పందిస్తున్నాయి.
ఇక.. గంజాయిని అరికట్టడం కోసం ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నట్లు ఏపీ హోంమంత్రి అనిత చెబుతున్నారు. ఏది ఏమైనా... ఆరోపణలు, ప్రత్యారోపణల సంగతి అలా ఉంచితే... తాజాగా ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. పల్నాడు జిల్లాలో పిల్లలకు గంజాయి అలవాటు చేసి, వారితో దొంగతనాలు చేయిస్తున్న దారుణం వెలుగులోకి వచ్చింది.
అవును... తనను గంజాయికి మత్తులోకి దించి.. దొంగతనాలు చేయిస్తున్నారని.. చేయను అని అంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని.. పోలీసులకు చెప్పినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఇటీవల నరసరావుపేటకు చెందిన ఓ బాలుడు మీడియా ఎదుట వాపోయిన సంగతి తెలిసిందే. దీంతో.. ఒక్కసారిగా ఈ విషయం వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా స్పందించిన ఆ బాలుడి తల్లి కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... నరసరావుపేట టౌన్ కి చెందిన షారూఖ్, ఫారుఖ్ లతో పాటు రాధిక అనే ఓ మహిళ ఈ పనులకు పాల్పడుతున్నారని.. ఈ క్రమంలోనే తన కుమారుడికి గంజాయి అలవాటు చేశారని.. ఆ మత్తులో చోరీలు చేయిస్తున్నారని వాపోయారు.
ఇదే సమయంలో తన కుమారుడితో పాటు మరో 10 - 15 మంది మైనర్లనూ ఈ రొంపిలోకి దింపారని ఆమె తెలిపారు. ఈ క్రమంలో విజయవాడలోని జువైనల్ హోమ్ లో మూడు నెలల జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తన కుమారుడిని మళ్లీ ఆ రొంపిలోకి లాగుతున్నారని.. దొంగతనాలు చేయాలని బలవంతం చేస్తున్నారని వెల్లడించారు!
ఈ సమయంలో... గతంలో జరిగిందేదో జరిగింది, ఇకపై తమను వదిలేయాలని కోరినప్పటికీ కనికరించడం లేదని.. చంపుతామని బెదిరిస్తున్నారని.. దీనిపై పోలీసులు పట్టించుకోలేదని.. అందుకే ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లూ ఆమె తెలిపారు. దీంతో.. ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది.