Begin typing your search above and press return to search.

చెక్కపెట్టేలో శవాన్ని పంపిన కేసు... తెరపైకి ఒక్కొక్కటిగా షాకింగ్ విషయాలు!

ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించిన చిక్కుముడులు ఒక్కొక్కటిగా వీడుతున్నాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   25 Dec 2024 9:41 AM GMT
చెక్కపెట్టేలో శవాన్ని పంపిన  కేసు... తెరపైకి ఒక్కొక్కటిగా షాకింగ్  విషయాలు!
X

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రమంలోని తులసి అనే మహిళ ఇంటికి చెక్కపెట్టెలో శవాన్ని పంపిన కేసు తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించిన చిక్కుముడులు ఒక్కొక్కటిగా వీడుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో మృతుడి భార్య కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... చెక్కపెట్టేలో శవాన్ని పంపిన కేసులో ఒక్కో చిక్కుముడి వీడుతుందని అంటున్నారు. ఇప్పటికే ఆ మృతదేహం కాళ్ల గ్రామానికి చెందిన బర్రె పర్లయ్యదేనని గుర్తించగా.. నిందితుడిగా భావిస్తున్న తులసి మరిది శ్రీధర్ వర్మ పోలీసులకు చిక్కాడని.. దీంతో, ప్రస్తుతం అతడిని రహస్యంగా విచారిస్తున్నారని అంటున్నారు.

మరోపక్క గ్రామంలో వివాదరహితుడిగా, అందరితో కలుపుగోలుగా ఉండే పర్లయ్యను హత్య చేయడాన్ని గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. అమాయకుడిని అన్యాయంగా చంపేశాడంటూ వర్మపై ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. మరోపక్క.. వర్మ ఇంట్లో మరో చెక్కపెట్టే ఉండటం తీవ్ర సంచలనంగా మారిందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో స్పందించిన మృతుడు పర్లయ్య భార్య ఈశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... అనుమానిత నిందితుడు శ్రీధర్ వర్మ ఏదో కుట్ర పన్నాడని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్న తన భర్తను వర్మ తన కుట్రలో భాగంగా హత్య చేశాడని వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో... తన భర్త తాగుడుకు బానిసయ్యాడని.. దొరికిన పని చేసుకుంటూ వచ్చిన డబ్బులతో మద్యం తాగుతాడని తెలిపారు. ఈ క్రమంలో ఎవరి జోలికీ వెళ్లని తన భర్తను హత్య చేసిన వర్మను కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసులను కోరారు!

మరోపక్క... తన వదిన సాగి తులసిని ఆస్తి కోసమే బెదిరించడానికైతే ఒక వ్యక్తిని చంపి చెక్కపెట్టెలో శవాన్ని పంపాల్సిన అవసరం ఏముందని? పైగా.. దీని కోసం ఆ కుటుంబంతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని ఎందుకు హత్య చేసినట్లు? అనే విషయాలపై పోలీసులు కూపీ లాగుతున్నారని అంటున్నారు!