అమ్మాయిలకు 9, అబ్బాయిలకు 15 ఏళ్లు... వివాహ వయస్సులపై బిల్లు!
సాధారణంగా అమ్మాయిలకు 18 ఏళ్లు దాటే వరకూ పెళ్లి చేయకూడదని అంటారు.
By: Tupaki Desk | 9 Aug 2024 9:57 AM GMTసాధారణంగా అమ్మాయిలకు 18 ఏళ్లు దాటే వరకూ పెళ్లి చేయకూడదని అంటారు. ఈ నిబంధన వల్ల ఆమెకు అప్పటికీ కనీస విద్యార్థతలు సంపాదించే అవకాశం ఉండటంతోపాటు.. వివాహ అనంతరం గర్భం దాల్చడానికి కూడా ఆమె వయసు, ఆరోగ్యం సహకరిస్తాయని చెబుతారు. అయితే తాజాగా అమ్మాయిల వివాహ వయసు 9 ఏళ్లకు కుదిస్తూ బిల్లు తెరపైకి వచ్చింది.
అత్యంత దారుణమైన, ఘోరమైన విషయం తాజాగా తెరపైకి వచ్చింది. దేశంలోని బాలికల పెళ్లి వయసు కు సంబంధించి పార్లమెంట్ లో ఇరాక్ ప్రభుత్వం ఓ బిల్లును ప్రతిపాదించింది. దీని ప్రకారం అమ్మాయిల వివాహ వయసును 9 ఏళ్లకు కుదించాలని ఆ బిల్లులో ప్రతిపాదించారు. దీంతో... ఈ బిల్లుపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
అవును... తాజాగా ఇరాక్ న్యాయ మంత్రిత్వ శాఖ పార్లమెంట్ లో ఓ బిల్లు ప్రవేశపెట్టింది. దీని ప్రకారం అమ్మాయిల వివాహ వయసును 9 సంవత్సరాలకు కుదించాలని ప్రతిపాదించారు. పర్సనల్ స్టేటస్ లా ను సవరించే ఉద్దేశ్యంతో దీన్ని తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. దీంతో... ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వివాదాస్పద బిల్లుగా దీనిపై చర్చ నడుస్తుంది.
వాస్తవానికి ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఆ దేశంలో అమ్మాయిల వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది. అయితే తాజాగా ప్రవేశపెట్టిన బిల్లు గనుక పార్లమెంట్ లో పాసైతే.. ఇకపై ఆ దేశంలో అమ్మాయిలు 9 ఏళ్లకు, అబ్బాయిలు 15 ఏళ్లకు వివాహం చేసుకొవడానికి చట్టపరంగా ఎలాంటి అడ్డంకీ ఉండదన్నమాట. దీంతో బాల్యవివాహాలు విపరీతంగా పెరుగుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే మహిళా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది బాలికల విద్య, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా... యూనిసెఫ్ గణాంకాల ప్రకరం ఇరాక్ లో ఇప్పటికే సుమారు 28% మంది బాలికలకు 18ఏళ్ల లోపే పెళ్లిళ్లవుతున్న పరిస్థితి. ఇక ఈ బిల్లు గనుక పాసైతే పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుందని చెబుతున్నారు.