Begin typing your search above and press return to search.

డిన్నర్ చేసి వెళుతున్న నటిపై దాడి..!

ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో గార్డెన్ సిటీ బెంగళూరుకు కొత్త తిప్పలు ఎదురవుతున్నాయి.

By:  Tupaki Desk   |   20 April 2024 4:51 AM GMT
డిన్నర్ చేసి వెళుతున్న నటిపై దాడి..!
X

ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో గార్డెన్ సిటీ బెంగళూరుకు కొత్త తిప్పలు ఎదురవుతున్నాయి. నీటి ఎద్దడి కారణంగా బెంగళూరు సిటీ ఇమేజ్ ఎంతలా డ్యామేజ్ అయ్యిందన్న సంగతి తెలిసిందే. కొద్ది నెలలుగా శాంతిభద్రతల విషయంలోనూ గార్డెన్ సిటీ మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పవర్లోకి వచ్చిన తర్వాత బెంగళూరు సిటీ ప్రభ మసకబారినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇది సరిపోనట్లుగా చోటు చేసుకునే కొన్ని ఉదంతాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి.

తాజాగా అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. తన భర్తతో కలిసి వెళుతున్న సినీ నటిపై కొందరు దుండగులు దాడిచేసిన వైనం సంచలనంగా మారింది. నటి హర్షిక పుణచ్చ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు.. ఆ సందర్భంగా పోలీసులపై ఆమె చేసిన విమర్శలు ఇబ్బందికరంగా మారాయి. తాజాగా తన భర్త భువన్ తో కలిసి పులకేశినగర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక రెస్టారెంట్ కు డిన్నర్ కు వెళ్లినట్లుగా పేర్కొన్నారు.

తాను తన భర్తతో డిన్నర్ ముగించి ఇంటికి వెళుతున్న క్రమంలో.. గుర్తు తెలియని దుండగులు కొందరు తమపై దాడి చేశారని.. తన గొలుసును దోచుకునే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కంప్లైంట్ ను ఆమె పోలీస్ స్టేషన్ లో ఇచ్చారు. అయితే.. తనపై జరిగిన దాడికి సంబంధించిన అంశాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో వారు సరిగా స్పందించలేదని.. ఆలస్యం చేశారన్నది ఆమె ఆరోపణ.

మసీదు రోడ్డులోని ఒక రెస్టారెంట్ కు తాను డిన్నర్ కు వెళ్లిన సందర్భంగా దాడి ఘటన జరిగినట్లుగా పేర్కొన్నారు. ఒక సెలబ్రిటీ విషయంలో కర్ణాటక పోలీసులు ప్రదర్శించిన అలసత్వాన్ని పలువురు తప్పు పడుతున్నారు. సెలబ్రిటీ విషయంలోనే ఇలా ఉంటే.. సామాన్యుల సంగతేంటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ తీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందన్న మాట వినిపిస్తోంది.