Begin typing your search above and press return to search.

ఢిల్లీ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లోకి వరద.. చనిపోయింది తెలంగాణ అమ్మాయి!

సోని, శ్రేయా యాదవ్ (25), నెవిన్ డాల్విన్ (28) ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీస్ సర్కిల్ లో శిక్షణ పొందుతున్నారు.

By:  Tupaki Desk   |   28 July 2024 10:54 AM GMT
ఢిల్లీ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లోకి వరద.. చనిపోయింది తెలంగాణ అమ్మాయి!
X

విధి అంటే ఇదేనేమో..? దేశ అత్యున్నత సర్వీసులైన సివిల్స్ కు సన్నద్ధం అయ్యేందుకు ఎక్కడెక్కడినుంచో వచ్చిన ముగ్గురు విద్యార్థుల ప్రాణాలు అనూహ్యంగా గాలిలో కలిశాయి. అది కూడా కోచింగ్ సెంటర్లోనే కావడం మరింత విషాదకరంగా మారింది. అందులోనూ తెలంగాణకు చెందిన యువతి ఉండడం కలచివేస్తోంది. అనూహ్యంగా వరద పోటెత్తడం ఏమిటి..? అత్యున్నత సర్వీస్ లక్ష్యంగా.. ఉన్నత స్థాయి జీవితంపై ఎన్నో ఆశలతో కోచింగ్ కు వచ్చిన ముగ్గురి ప్రాణాలు పోవడం ఏమిటి..? సెంట్రల్‌ ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్‌ స్టడీ సెంటర్‌ లో శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన అందరినీ విస్మయపరుస్తోంది. చనిపోయిన ముగ్గురిలో తన్యా సోనీ (25) తెలంగాణకు చెందిన యువతిగా తేలింది.


ఇంతకూ ఏం జరిగింది..?

సోని, శ్రేయా యాదవ్ (25), నెవిన్ డాల్విన్ (28) ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీస్ సర్కిల్ లో శిక్షణ పొందుతున్నారు. శనివారం రాత్రి ఆకస్మిక వర్షంతో వరద పోటెత్తింది. డ్రెయిన్‌ ఉప్పొంగి కోచింగ్‌ సెంటర్‌ బేస్‌ మెంట్‌ ను నీరు ముంచెత్తింది. అగ్నిమాపక శాఖ ఐదు ఫైరింజన్లతో సహాయక చర్యలు చేపట్టింది. కొన్ని గంటల తర్వాత తానియా, శ్రేయ, నవీన్‌ మృతదేహాలు బయటపడ్డాయి. ఆదివారం ఈ ఘటనపై ఆగ్రహంతో విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ స్నేహితులు చనిపోయారంటూ ఆరోపించారు. చిన్నపాటి వర్షాలకే వరదలు ముంచెత్తుతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. తమ డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని 12 రోజుల క్రితమే కౌన్సిలర్‌ కు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. వెంటనే చర్యలు తీసుకుని ఉంటే ఇలా జరిగి ఉండేది కాదన్నారు. దుర్ఘటన నేపథ్యంలో రావూస్ స్టడీ సర్కిల్‌ యజమాని, కో ఆర్డినేటర్‌ ను పోలీసులు అరెస్టు చేశారు.

ప్రమాదం కాదు.. నిర్లక్ష్యం

ఐఏఎస్ అకాడమీలో జరిగిన ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇది ప్రమాదం కాదని.. అధికారుల నిర్లక్ష్యం అని అంటున్నారు. ఢిల్లీ ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ కూడా ఇదే తీరున ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, స్టడీ సర్కిల్ భవనం బేస్‌ మెంట్‌ లో ముగ్గురు విద్యార్థులే ఉన్నారా?? ఇంకా ఎవరైనా ఉన్నారా అనే అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. ఆందోళనకు దిగిన విద్యార్థులు ఎంపీ స్వాతీ మలీవాల్‌ పై మండిపడ్డారు. గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. కాగా, ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ మాట్లాడుతూ.. చట్టాలకు విరుద్ధంగా బేస్‌ మెంట్లలో కోచింగ్‌ సెంటర్లు నిర్వహిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఢిల్లీలో డ్రెయిన్‌ లను శుభ్రం చేయాలని పదేపదే చెబుతున్నా స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని బీజేపీ అధికార ప్రతినిధి మంజీందర్ సింగ్ సిర్సా ధ్వజమెత్తారు.