మహిళా డాక్టర్ పై దారుణ అత్యాచారంలో బిగ్ ట్విస్ట్!
ఎంబీబీఎస్ పూర్తి చేసిన బాధితురాలు ప్రస్తుతం ఎండీఎస్ రెండో సంవత్సరం చదువుతోంది.
By: Tupaki Desk | 12 Aug 2024 12:30 PM GMTపశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలోని ఆర్జీ కార్ వైద్య కళాశాల ఆస్పత్రిలో కొద్ది రోజుల క్రితం జూనియర్ మహిళా డాక్టర్ ను గుర్తు తెలియని దుండగుడు దారుణంగా అత్యాచారం చేసి చంపేసిన సంగతి తెలిసిందే. నైట్ డ్యూటీ విధుల్లో ఉన్న ఆమెను చితకబాది అత్యాచారం చేసినట్టు వెల్లడైంది. బాధితురాలు కళ్లు, పెదవులు, చెవి, మర్మాంగాలు, కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. ఈ భాగాల్లో తీవ్ర రక్తసావ్రం అయినట్టు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది.
ఎంబీబీఎస్ పూర్తి చేసిన బాధితురాలు ప్రస్తుతం ఎండీఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. ఇందులో భాగంగా తెల్లవారుజామున 2–3 గంటల సమయంలో విధుల్లో ఉండగా అత్యాచారానికి, హత్యకు గురైంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ ను అట్టుడికిస్తోంది. పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడిని అనుమానితుడిగా మాత్రమే అరెస్టు చేశారు.
జూనియర్ డాక్టర్ పై అత్యాచారం కేవలం పశ్చిమ బెంగాల్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా దుమారం రేపింది. అఖిల భారత జూనియర్ వైద్యుల సంఘం తమ సేవలను నిలిపేసింది. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చింది. నిందితుడిని ఉరి తీయాలని.. నైట్ డ్యూటీ విధుల్లో ఉంటున్న తమకు సరైన భద్రత కల్పించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు వైద్య సేవల్లో పాల్గొనబోమని తేల్చిచెప్పింది.
మరోవైపు తాను వ్యక్తిగతంగా ఉరిశిక్షకు వ్యతిరేకమైనప్పటికీ ఈ కేసులో తీవ్రత దృష్ట్యా నిందితుడికి ఉరిశిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు.
జూనియర్ వైద్యుల సమ్మె అంతకంతకూ తీవ్రరూపం దాల్చుతుండటంతో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ తన పదవికి రాజీనామా చేశారు. అత్యాచారం తర్వాత ఆమెను అవమానిస్తూ ప్రిన్సిపాల్ మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి. దీంతో కాలేజీ వైద్య విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు మండిపడ్డారు. ప్రిన్సిపాల్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు తాను బాధితురాలికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థుల డిమాండ్ నేపథ్యంలో ప్రిన్సిపాల్ గా ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కొందరు విద్యార్థులు తనను పదవి నుంచి దిగిపోయేలా విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. నిందితుడికి కఠిన శిక్ష పడాలని తాను కూడా కోరుకుంటున్నానన్నారు. సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేయడం బాధ కలిగిస్తుందన్నారు. తనకు కూడా పిల్లలున్నారని.. మరణించిన జూనియర్ డాక్టర్ తన కుమార్తె లాంటిదని తెలిపారు.