Begin typing your search above and press return to search.

చదివినంతనే వికారం..అయినా తప్పదు.. ఎంత ఘోరమంటే?

చదివినంతనే వికారంతో ఒళ్లంతా ఉక్కిరిబిక్కిరి కావటం ఖాయం. అసలు ఆ ఊహనే భరించలేని పరిస్థితి.

By:  Tupaki Desk   |   4 April 2024 5:30 AM GMT
చదివినంతనే వికారం..అయినా తప్పదు.. ఎంత ఘోరమంటే?
X

చదివినంతనే వికారంతో ఒళ్లంతా ఉక్కిరిబిక్కిరి కావటం ఖాయం. అసలు ఆ ఊహనే భరించలేని పరిస్థితి. అలాంటిది ఏకంగా పది రోజుల పాటు ఆ ఊళ్లోకి అలాంటి నీళ్లు తాగునీరుగా సరఫరా కావటానికి మించిన ఘోరం ఇంకేం ఉంటుంది? అధికారుల నిర్లక్ష్యంతో పాటు.. ఇలాంటి ఉదంతమే మూడేళ్ల క్రితం చోటు చేసుకొని సంచలనంగా మారింది. మరి.. ఈ మూడేళ్లలో అలాంటి ఘోర ఘటన మరోసారి జరగకుండా ఉండటానికి గత ప్రభుత్వం ఏం చేసింది? అధికారులు ఏం చేస్తున్నారు? అలాంటి ప్రశ్నలు వెల్లువెత్తుతున్న పరిస్థితి.

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ మునిసిపాలిటీ పరిధి విజయవిహార్ కాలనీ ఒకటో వార్డు దగ్గరి వాటర్ ట్యాంకర్ లో 15 కోతుల కళేబరాల్ని గుర్తించారు. మూడేళ్ల క్రితం ఇదే తరహాలో పెద్ద ఎత్తున కోతులు వాటర్ ట్యాంకర్ లో పడిపోయి చచ్చిపోవటం.. ఆ నీరే ఊరికి సరఫరా కావటం తెలిసిందే. తాజాగా అలాంటి పరిస్థితే రిపీట్ కావటం గమనార్హం. విజయ్ విహార్ పక్కనే ఐదువేల లీటర్ సామర్థ్యం ఉన్న ట్యాంకు ద్వారా 150 ఇళ్లకు తాగునీరు సరఫరా చేస్తుంటారు.

పది రోజులుగా కుళాయి నీటిలో వెంట్రుకలు.. చిన్న చిన్న మాంసపు ముక్కలు వస్తున్నాయి. దీంతో బుధవారం కొందరు యువకులు ట్యాంకు వద్దకు వెళ్లి చూడగా.. పైన మూత లేదన్న విషయాన్ని గుర్తించారు. వెంటనే.. దాన్ని పరిశీలించగా.. 15 కోతుల కళేబరాలు అందులో ఉన్నట్లుగా గుర్తించి షాక్ తిన్నారు. దీంతో మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. గతంలోనూ ఇదే వాటర్ ట్యాంకర్ లో కోతులు పడి చనిపోవటం.. అప్పట్లోనూ అలానే జరిగింది.

అయితే.. వాటర్ సప్లయ్ విభాగం వారు ప్రతి నెలకోసారి బ్లీచింగ్ తో ట్యాంకర్ ను శుభ్రం చేయాల్సి ఉంది. మరి.. ఆ పనే చేసి ఉంటే.. కోతుల కళేబరాల్ని గుర్తించే వారు కదా? అలా ఎందుకు జరగలేదన్నది ప్రశ్న. అంతేకాదు.. వాటర్ ట్యాంకర్ పైన ఉండే మూత తొలగించి ఉంటే.. దాన్ని సరి చేయాల్సిన అవసరం ఉంది కదా? ఆ పనులేమీ మున్సిపల్ సిబ్బంది ఎందుకు చేయనట్లు? అన్నది ప్రశ్న. ఏమైనా ఈ ఘోరంపై సంబంధిత అధికారులు స్పందించి.. ఎవరి నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందో.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. అయితే.. ఈ ఉదంతంపై అధికారుల వివరణ పొంతన లేనట్లుగా.. అసలేమీ జరగలేదన్నట్లుగా ఉండటం గమనార్హం.