బిగ్ అలర్ట్... నార్కోటిక్ పేరు చెప్పి నాలుగంచెల్లో నయా మోసం!
అవును... కాదేదీ ఆన్ లైన్ మోసానికి అనర్హం అనేది తెలిసిన విషయమే.
By: Tupaki Desk | 15 May 2024 7:39 AM GMTకాదేదీ ఆన్ లైన్ మోసాలకు అనర్హం అని అంటుంటారు కాస్త అవగాహన ఉన్నవారు! ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా బ్యాంక్ అకౌంట్ క్షణాల్లో ఖాళీ అయిపోద్దని చెబుతుంటారు అనుభవం ఉన్నవారు! ఈ క్రమంలో ఇప్పటికే ఈకేవైసీ, ఆధార్ లింక్ అప్ డేట్, ఆన్ లైన్ లో లాటరీ, లోన్ యాప్స్, వర్క్ ఫ్రం హోమ్... మొదలైన కారణాలు ఆన్ లైన్ మోసాలకు అడ్డాగా మారిన పరిస్థితి! ఈ సమయంలో ఈ జాబితాలోకి కొత్తగా వచ్చి చేరింది నార్కోటిక్ పోలీస్ ఫోన్!!
అవును... కాదేదీ ఆన్ లైన్ మోసానికి అనర్హం అనేది తెలిసిన విషయమే. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. బ్యాంక్ అకౌంట్ పూర్తిగా ఖాళీ అయిపోవడంతో పాటు.. సరికొత్త సమస్యలు చుట్టుముడుతుంటాయి. ఈ సమయంలో తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ కొత్త ఆన్ లైన్ మోసం తెరపైకి వచ్చింది. నాలుగు అంచెల్లో జరిగే ఈ నయా మోసం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.
వివరాళ్లోకి వెళ్తే... ముందుగా ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేస్తాడు. మీ పేరు, ఆధార్ నంబరుపై వచ్చిన కొరియర్ లో డ్రగ్స్ ఉన్నాయని.. నార్కోటిక్ పోలీసులు గుర్తించారని భయపెడతాడు. ఇదే సమయంలో నార్కోటిక్ పోలీసులు ఫోన్ చేస్తే వివరాలు చెప్పండని హెచ్చరించి కాల్ కట్ చేస్తాడు. ఇక రెండో స్టెప్ లో... ఆ కాల్ కట్ అయిన కాసేపటికి వాట్సప్ లో ఓ వీడియో కాల్ వస్తుంది. పోలీసు దుస్తులతో కనిపించే వ్యక్తి తాను నార్కోటిక్ ఏసీపీ అని పరిచయం చేసుకుంటాడు.
ముంబై నుంచి ఇతర రాష్ట్రాలకు మీ పేరుపై కొన్ని వస్తువులు కొరియర్ అవుతున్నాయని.. వాటిలో డ్రగ్స్ ఉన్నాయని.. తమ విచారణలో ఆ విషయం తేలిందని చెబుతాడు. ఈ సమయంలో మీరు సహకరిస్తే విచారణంతా రహస్యంగా, సామరస్యంగా జరుగుతోందని నమ్మబలుకుతాడు. సహకరించకుంటే మీతోపాటు కుటుంబ సభ్యులనూ విచారణకు పిలుస్తామని, కేసులో అరెస్టు చేస్తామని బెదిరింపులు మొదలుపెడతాడు.
ఆ తర్వాత మూడో స్టేప్ మొదలవుతుంది. ఇందులో భాగంగా మీ పూర్తి పేరు.. చిరునామా.. ఆధార్.. బ్యాంకు వివరాలు తెలుసుకుంటాడు. అనంతరం ఓ యాప్ లింక్ పంపి, దానిని క్లిక్ చేసి వివరాలు నమోదు చేయమని సూచిస్తాడు. అనంతరం మీ పేరుపై రూ.5 లక్షలు రుణం వచ్చేలా చేసి, ఆ నగదు మీ వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో జమయేలా చేస్తాడు. అలా ఖాతాలోకి వచ్చిన నగదును ఓ లింక్ ద్వారా అతడి ఖాతాకు బదిలీ చేయమంటాడు.
అక్కడితో అతడి పెర్ఫార్మెన్స్ ఆగదు. ఆ సమయంలో లోన్ యాప్ ద్వారా ఖాతాలోకి వచ్చిన రూ.5 లక్షలతోపాటు.. అప్పటికే మీ ఖాతాలో ఉన్న మిగతా మొత్తం సొమ్ములు అతడి ఖాతాకు బదిలీ అయ్యేలా ప్లాన్ చేస్తాడు. కట్ చేస్తే... బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ అవుతుంది. మీరు నిరపరాధిగా తేలితే.. మీ అమౌంట్ మొత్తం తిరిగి ఇవ్వబడుతుందని స్పష్టం చేస్తాడు.
రాజానగరానికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీరుకు, రాజమండ్రి సిటీకి చెందిన ఓ వైద్యురాలికి ఇలానే ఫోన్ లు వచ్చాయి. స్క్రిప్ట్ అంతా ఇలానే జరిగింది! ఫలితంగా... ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నుంచి రూ.7 లక్షలు, ఆ వైద్యురాలి నుంచి రూ.6.67 లక్షలు దోచుకున్నారని తెలుస్తుంది!
తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...!:
ఎవరికైనా ఇలాంటి బెదిరింపులు ఎదురైతే... ధైర్యంగా మాట్లాడాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో కేసు ఏదైనా... పోలీసులు ఇంటికి వచ్చిగానీ.. మరెక్కడైనా నేరుగా నిందితులను అదుపులోకి తీసుకుంటారే తప్ప, వీడియో కాల్స్ చేసి బెదిరించరనే విషయం గ్రహించాలని చెబుతున్నారు.
ఇదే సమయంలో ఇలాంటి సమస్యలు ఎదురైతే, మోసపోయమని గ్రహిస్తే వెంటనే సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న నగదు హోల్డ్ చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇదే క్రమంలో... ఆన్ లైన్ మోసం జరిగిన 48 గంటల్లోగా నష్టపోయిన నగదు రూ.15 వేలు పైన ఉంటే టోల్ ఫ్రీ నంబరు 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.