బిగుస్తున్న ఉచ్చు... మల్లారెడ్డి అరెస్ట్ తప్పదా?
అవును... ఓ భూకబ్జా కేసులో బీఆరెస్స్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగ్ షాక్ తగిలిందని తెలుస్తుంది.
By: Tupaki Desk | 13 Jun 2024 6:04 AM GMTతెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆరెస్స్ నేతలు, మాజీ మంత్రుల్లో మల్లారెడ్డి టాపిక్ అత్యంత చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ప్రధానంగా మల్లారెడ్డిపై అనేక భూకబ్జా ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో... కాంగ్రెస్ ప్రభుత్వపై ఆ విషయాలపై కాస్త సీరియస్ గానే రియాక్ట్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా... తాజాగా ఓ భూకబ్జా కేసులో ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగ్ షాక్ తగిలిందని తెలుస్తుంది.
అవును... ఓ భూకబ్జా కేసులో బీఆరెస్స్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగ్ షాక్ తగిలిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... మేడ్చల్ జిల్లా సుచిత్రలో మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు కబ్జా చేసినట్లు పోలీసులు నిర్ధారించారని అంటున్నారు. సుచిత్రలోని సర్వే నెంబర్ 82లో వివాదాస్పద భూమిపై హైకోర్టు ఆదేశాలున్నాప్పటికీ సుమారు 33 గుంటల సర్కార్ భూమిని మల్లారెడ్డి & కో కబ్జా చేసినట్లు గుర్తించారని తెలుస్తుంది.
ఈ మేరకు హైకోర్టులో పోలీసులు నివేదిక సమర్పించారని అంటున్నారు. దీంతో... సర్కార్ భూమికి రక్షణ కల్పించాలని హైకోర్టు సూచించింది! దీంతో... ఈ భూకబ్జా కేసు విషయంలో మల్లారెడ్డి అరెస్ట్ తప్పదా అనే చర్చ నెలకొంది. ఈ విషయంలో ప్రభుత్వం, అధికారులు వెనక్కి తగ్గే అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు. మరి ఏమి జరగబోతుందనేది వేచి చూడాలి!
కాగా ఈ ఏడాది మార్చి 18న మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కుత్బుల్లాపూర్ లో అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సుచిత్ర పరిధిలోని సరే నెంబర్ 82లో తనది, తన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్థలాన్ని కొందరు కబ్జాచేశారని మల్లారెడ్డి ఆరోపించారు. తన స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేశారని ఆరోపించారు.
ఈ సమయంలో ఆ స్థలం దగ్గరకు వెళ్లిన మల్లారెడ్డి ఆ ఫెన్సింగ్ ను తొలగించే ప్రయత్నం చేయగా... పోలీసులతో వాగ్వాదం జరిగింది. ఫెన్సింగ్ వేసిన స్థలం మల్లారెడ్డిది కాదని కోర్టు తీర్పు చెప్పినప్పటికీ దాన్ని తిరిగి ఆక్రమించాలని చూడటం చట్టవిరుద్దమని పోలీసులు వారించారు. అయినా వినకుండా మల్లారెడ్డి ఘర్షణకు దిగారంటూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.