Begin typing your search above and press return to search.

యూకే ప్రధానికి అలా షాకిచ్చిన సొంత పార్టీ ఎంపీ!

అవును... యూకే ప్రధాని రిషి సునాక్‌ కు మరో సవాల్‌ ఎదురైంది. సొంత పార్టీ ఎంపీయే ఆయనకు వ్యతిరేకంగా "అవిశ్వాస" లేఖను సమర్పించారు.

By:  Tupaki Desk   |   14 Nov 2023 6:58 AM GMT
యూకే ప్రధానికి అలా షాకిచ్చిన సొంత పార్టీ ఎంపీ!
X

యునైటెడ్ కింగ్ డం ప్రధానమంత్రి, భారతీయ సంతతికి చెందిన రిషి సునక్‌ కు తాజాగా ఒక సవాల్ ఎదురైంది. ఆయనపై మొట్టమొదటి సారి ఓ ఎంపీ అవిశ్వాస లేఖ సమర్పించారు. బ్రిటన్ దేశ హోంశాఖ మంత్రి సుయిల్లా బ్రెవర్మాన్ ను మంత్రి పదవి నుంచి తొలగించాక, సోమవారం తన కేబినెట్ ను పునర్ వ్యవస్థీకరించారు. ఈ నేపథ్యంలో ప్రధాని రిషి సునక్ పై టోరీ ఎంపీ ఆండ్రియా జెన్‌ కిన్స్‌ అవిశ్వాస లేఖను సమర్పించారు.

అవును... యూకే ప్రధాని రిషి సునాక్‌ కు మరో సవాల్‌ ఎదురైంది. సొంత పార్టీ ఎంపీయే ఆయనకు వ్యతిరేకంగా "అవిశ్వాస" లేఖను సమర్పించారు. కేబినెట్‌ లో మార్పులు చేసిన గంటల వ్యవధిలోనే నో కాన్ఫిడెన్స్ లెటర్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో టోరీ ఎంపీ ఆండ్రియా జెన్‌ కిన్స్‌.. హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ వ్యవహరాలను చూసే 1922 కమిటీ ఛైర్మన్‌ గ్రాహం బ్రాడీకి అవిశ్వాస లేఖను సమర్పించారు.

అనంతరం ఆమె ఈ విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రజలకు తెలిపారు. ఇందులో భాగంగా... "జరిగింది చాలు. నా అవిశ్వాస లేఖను 1922 కమిటీ ఛైర్మన్‌ కు సమర్పించాను. రిషి సునాక్‌ ను పదవి నుంచి దింపి.. ఆయన స్థానంలో నిజమైన కన్జర్వేటివ్‌ పార్టీ నేతను ఎన్నుకునే సమయం వచ్చింది" అని రాస్తూ అవిశ్వాస లేఖను పోస్ట్ చే శారు.

ఇదే సమయంలో... రిషి సునాక్‌ తన కేబినెట్‌ లో నిజాలు మాట్లాడే ఏకైక వ్యక్తి సువెల్లా బ్రెవర్మాన్ పై వేటు వేశారని, దాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. రిషి సునాక్‌ దిగిపోవాల్సిన సమయం ఆసన్నమైందని, ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస లేఖలు సమర్పించాలని ఈ సందర్భంగా ఆమె తోటి టోరీ ఎంపీలను ఆమె అభ్యర్థించారు.

అయితే మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కు నమ్మిన వ్యక్తిగా పేరున్న ఆండ్రియా జెన్‌ కిన్స్‌.. కేబినెట్‌ నుంచి సువెల్లా బ్రేవర్మన్‌ ను తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది సరైన చర్య కాదని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ "అవిశ్వాస" లేఖను హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ వ్యవహరాలను చూసే 1922 కమిటీ ఛైర్మన్‌ కు సమర్పించారు.

కాగా... రిషి సునాక్‌ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ఆయనపై అవిశ్వాస లేఖ రావడం ఇదే తొలిసారి. అయితే, ఆమె ఒక్కరే లేఖ సమర్పించడం వల్ల ఇప్పుడే ఆయన అవిశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఆ పార్టీకి చెందిన మొత్తం ఎంపీల్లో కనీసం 15శాతం మంది లేఖలు పంపితే అప్పుడు రిషి సునాక్ నాయకత్వంపై విశ్వాస పరీక్ష ఓటింగ్ నిర్వహిస్తారు.