Begin typing your search above and press return to search.

వివేక్ కు షాక్.. విశాఖ ఇండస్ట్రీస్ నుంచి రూ.100 కోట్లు బదిలీ

100కోట్ల నగదు బదిలీ అయినట్లుగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తులో తేలటం సంచలనంగా మారింది.

By:  Tupaki Desk   |   23 Nov 2023 5:36 AM GMT
వివేక్ కు షాక్.. విశాఖ ఇండస్ట్రీస్ నుంచి రూ.100 కోట్లు బదిలీ
X

తెలంగాణ సీనియర్ నేత అనే కంటే బలమైన పారిశ్రామికవేత్త.. ఆ మాటకు వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కు సైతం అప్పు ఇచ్చిన పెద్ద మనిషి జి. వివేక్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట్లో కాంగ్రెస్ తర్వాత బీజేపీలోకి దూకిన ఆయన.. తాజా ఎన్నికల వేళ కమలం పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి రావటం తెలిసిందే. బలమైన వ్యాపారాలు.. మీడియా సంస్థను నిర్వహిస్తున్న ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా చెన్నూరు నుంచి పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయనకు చెందిన విశాఖ ఇండస్ట్రీస్ ద్వారా రూ.100కోట్ల నగదు బదిలీ అయినట్లుగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తులో తేలటం సంచలనంగా మారింది.

తన రాజకీయ ప్రత్యర్థులపై ఈడీ.. ఐటీ.. సీబీఐలను ప్రయోగిస్తుందంటూ తరచూ విమర్శలు ఎదుర్కొనే మోడీ సర్కారు.. తాజాగా తమ పార్టీ నుంచి వెళ్లిపోయి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న వివేక్ ను టార్గెట్ చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటివేళలోనే.. గతంలో ఎప్పుడూ లేని రీతిలో వివేక్ పై సంచలన ఆరోపణలు వెలువడుతున్నాయి. విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థకు ఈ సొమ్ము తరలింపులో ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లుగా ప్రాథమిక విచారణలో గుర్తించినట్లుగా చెబుతున్నారు.

ఈ ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్.. రామగుండం.. మంచిర్యాలలోని వివేక్ కు చెందిన ఇళ్లు.. ఆఫీసులపై ఈడీ టీంలు తనిఖీలు నిర్వహించాయి. ఈ సందర్భంగా విశాఖ ఇండస్ట్రీస్ కు చెందిన లావాదేవీల్ని పరిశీలించారు. విజిలెన్స్ సెక్యూరిటీ సంస్థ తమ వ్యాపార కార్యకలాపాల కోసం విశాఖ ఇండస్ట్రీస్ నుంచి రూ.20 లక్షల ఆదాయాన్ని పొందినట్లుగా గుర్తించారు. అయితే.. విశాఖ ఇండస్ట్రీస్ తో సదరు సంస్థకు వాస్తవ వ్యాపార లావాదేవీలు లేవన్న విషయాన్ని దర్యాప్తులో వెల్లడైనట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. విజిలెన్స్ సెక్యూరిటీ సంస్థ సైతం వివేక్ కంట్రోల్ లో ఉన్నట్లుగా వెల్లడైంది.

అంతేకాదు.. విజిలెన్స్ సెక్యూరిటీస్ సంస్థకు యశ్వంత్ రియల్టర్స్ మాత్రసంస్థ అన్న కొత్త విషయం బయటకు రావటంతో పాటు.. ఈ సంస్థలో ఒక విదేశీయుడి పేరు మీద అధిక శాతం వాటాలు ఉన్నట్లుగా గుర్తించారు. విదేశీ సంస్థలో విజిలెన్స్ సెక్యూరిటీస్ ను విలీనం చేయటంలో ఫెమా ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. విజిలెన్స్ సంస్థ పేర్కొన్న అడ్రస్ లో దాని ఉనికి లేదని గుర్తించారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కుంభకోణంపై ఈడీ చేపట్టిన దర్యాప్తులో వివేక్ సంస్థకు చెందిన లింకులు అనూహ్యంగా బహిర్గతమైనట్లుగా చెబుతున్నారు. వివేక్ సోదరుడు వినోద్ కు చెందిన ఒక ఇంటిని ఆయన సోదరుడు వివేక్ తన విశాఖ ఇండస్ట్రీస్ కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లుగా తేల్చారు. రానున్న రోజుల్లో మరిన్ని అంశాలు బయటకు వస్తాయంటున్నారు.