దళపతి విజయ్ ఇంటి పై చెప్పు.. భగ్గుమన్న తమిళనాడు
తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు దళపతి విజయ్ ఇంటిపై ఒక యువకుడు చెప్పు విసరిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
By: Tupaki Desk | 27 Feb 2025 7:08 AM GMTతమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు దళపతి విజయ్ ఇంటిపై ఒక యువకుడు చెప్పు విసరిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటన అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు ఆరాతీస్తున్నారు.
-టీవీకే ప్రత్యేక సమావేశం
టీవీకే పార్టీ ఆవిర్భవించి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం మహాబలిపురం సమీపంలోని పూంజేరి గ్రామంలోని రిసార్ట్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా కార్యదర్శులు, 2,500 మంది ముఖ్య నిర్వాహకులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో తమిళ హక్కులు, భాషా అభిమానం, రాజకీయ మార్పులు, మత సామరస్యం వంటి అంశాలపై నేతలు ప్రతిజ్ఞ చేశారు. ఇటీవల వీసీకే పార్టీని వీడి టీవీకేలో చేరిన ఆదవ అర్జునన్ మాట్లాడుతూ డీఎంకే కూటమికి భవిష్యత్‌లో దెబ్బ తగలనుందని, విజయ్‌ను ఇకపై దళపతి కాక తలైవా అని పిలుద్దామని సూచించారు. విజయ్ కూడా 2026లో తమ పార్టీ గెలుపు తథ్యమని, రాష్ట్ర ప్రజల మద్దతుతో మరో చరిత్రను సృష్టించనున్నట్లు ధీమా వ్యక్తం చేశారు.
- విజయ్ ఇంటిపై చెప్పు విసరిన ఘటన
ఈ సభ జరుగుతున్న సమయంలో, నీలాంగరైలో ఉన్న విజయ్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తి అకస్మాత్తుగా చెప్పు విసిరాడు. ఈ ఘటనను గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ, ఆ యువకుడు అక్కడి నుంచి పరారీ అయ్యాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొందరు అతను మానసిక సమస్యలు ఉన్న వ్యక్తి కావొచ్చని అనుకుంటున్నప్పటికీ, విజయ్ అభిమానులు మాత్రం దీని వెనుక రాజకీయ కుట్ర ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఈ ఘటనపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
-భగ్గుమన్న అభిమానులు
విజయ్ అభిమానులు ఈ ఘటనపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరోపై కావాలనే కుట్ర పన్ని, అతని ఇంటిపై దాడి జరిగిందని భావిస్తున్నారు. పోలీసుల ద్వారా సత్వర న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. విజయ్ రాజకీయంగా బలపడుతుండటంతో, కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటన మరింత ముదిరే అవకాశం ఉండటంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ ఘటన వెనుక ఉన్న అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.