Begin typing your search above and press return to search.

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం!

టర్నర్‌ మద్యపానం కోసం ఫుడ్‌ కోర్ట్‌లో ఉన్నాడని, తన వద్దకు వచ్చిన వ్యక్తుల గుంపును చూసి, వారు తనను కొట్టడానికే వచ్చారని భావించి ఆత్మరక్షణ కోసం తన ఆయుధంతో కాల్పులు జరిపాడని పోలీసులు వెల్లడించారు.

By:  Tupaki Desk   |   16 Oct 2023 9:49 AM GMT
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం!
X

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. టెక్సాస్‌ స్టేట్‌ ఫెయిర్‌ ఇందుకు వేదికైంది. ఒక షూటర్‌ టెక్సాస్‌ స్టేట్‌ ఫెయిర్‌ కు హాజరైన ప్రజలే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన అమెరికా కాలమానం ప్రకారం శనివారం రాత్రి 7.45 గంటలకు చోటు చేసుకుంది.

22 ఏళ్ల కామెరాన్‌ టర్నర్‌ అనే అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫెయిర్‌ పార్క్‌ టవర్‌ బిల్డింగ్‌ లోని ఫుడ్‌ కోర్ట్‌ వద్ద కాల్పులు జరిగాయి.

టర్నర్‌ మద్యపానం కోసం ఫుడ్‌ కోర్ట్‌లో ఉన్నాడని, తన వద్దకు వచ్చిన వ్యక్తుల గుంపును చూసి, వారు తనను కొట్టడానికే వచ్చారని భావించి ఆత్మరక్షణ కోసం తన ఆయుధంతో కాల్పులు జరిపాడని పోలీసులు వెల్లడించారు.

ఆ తర్వాత అతను ఫుడ్‌ కోర్ట్‌ నుండి బయటకు పరుగెత్తాడని తెలిపారు.

నిందితుడు కాల్పులు జరుపుతుండటంతో టెక్సాస్‌ స్టేట్‌ ఫెయిర్‌ కు హాజరయిన ప్రజలు భయాందోళనలతో పారిపోతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. కాల్పులతో అంతా గలాటాగా మారడంతో ఈ స్టేట్‌ ఫెయిర్‌ కు హాజరయిన కుటుంబాలు తమ పిల్లల కోసం ఆందోళనగా వెతుక్కోవడం ఈ వీడియోల్లో కనిపిస్తోంది.

కాగా ఒక వ్యక్తిని కాల్చిచంపిన టర్నర్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కాల్పుల్లో మరో ముగ్గురికి గాయాలైనా వారికి ప్రాణాపాయం లేదని చెబుతున్నారు. ఈ ముగ్గురిలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు.

కాగా ఈ ఘటన పట్ల టెక్సాస్‌ స్టేట్‌ ఫెయిర్‌ మేనేజ్మెంట్‌ తీవ్ర విచారణం వ్యక్తం చేసింది. అన్ని ప్రదర్శనలు, ఆకర్షణలు, కచేరీలు షెడ్యూల్‌ ప్రకారం కొనసాగుతాయని వెల్లడించింది.

షూటింగ్‌ సమయంలో చాలా మంది భారతీయ వ్యక్తులు ఉన్నారని కూడా ఆ ఫెయిర్‌ లో ఉన్నట్టు తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోల్లో భారతీయులు కూడా కనిపిస్తుండటం ఇందుకు నిదర్శనం.