ఐప్యాక్ ప్యాకప్.. ఇక దీనిదే హవా!
ఆంధ్రప్రదేశ్ లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ రుషిరాజ్ సింగ్ నేతృత్వంలోని ఐప్యాక్ సేవలను పొందిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 6 July 2024 10:08 AM GMTఆంధ్రప్రదేశ్ లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ రుషిరాజ్ సింగ్ నేతృత్వంలోని ఐప్యాక్ సేవలను పొందిన సంగతి తెలిసిందే. అలాగే టీడీపీ కూడా షో టైమ్ కన్సల్టెన్సీ అధినేత రాబిన్ శర్మ సేవలను వినియోగించుకుంది. అయితే తమ టాస్కుల్లో షో టైమ్ విజయం సాధించగా.. ఐప్యాక్ ఓడిపోయింది. తాము సేవలు అందించిన వైసీపీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో ఏపీ నుంచి ఐప్యాక్ ప్యాకప్ చెప్పేసిందని తెలుస్తోంది.
ఈ క్రమంలో తమ వ్యూహాల ద్వారా టీడీపీకి విజయం సాధించి పెట్టిన రాబిన్ శర్మ బృందాన్ని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు కొనసాగించే ఉద్దేశంతో ఉన్నారని తెలుస్తోంది. ఈ మేరకు రాబిన్ శర్మ నేతృత్వంలోని షో టైమ్ సంస్థకు కీలక బాధ్యతలు అప్పగించినట్టు టాక్ నడుస్తోంది.
ఈ ఎన్నికల్లో టీడీపీకి సేవలు అందజేసిన రాబిన్ శర్మ కూడా గతంలో ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ఐప్యాక్ లో పనిచేశారు. ఆ తర్వాత ఆ సంస్థ నుంచి బయటపడిన రాబిన్ శర్మ సొంతంగా షో టైమ్ కన్సలెన్ట్సీని నెలకొల్పారు. ఈ సంస్థ తాజా ఎన్నికల్లో టీడీపీకి సేవలు అందించింది.
తమ వ్యూహాలతో టీడీపీకి విజయం సాధించిపెట్టిన రాబిన్ శర్మకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది నవంబరులో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాబిన్ శర్మ సేవలను పొందాలని మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నిర్ణయించుకుంది.
మరోవైపు తమకు ఏపీలో విజయం సాధించిపెట్టిన షో టైమ్ కన్సల్టెన్సీని కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో టీడీపీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ కార్యకర్తలు, నాయకుల మధ్య సమన్వయం, పార్టీ పరంగా ఎదురయ్యే సమస్యలు, పార్టీకి, ప్రభుత్వానికి మధ్య అనుసంధానం, ప్రభుత్వ పథకాలపైన ప్రజల అభిప్రాయాల సేకరణ తదితర బాధ్యతలను షో టైమ్ కు చంద్రబాబు అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ అంశాలపై ఎప్పటికప్పుడు నివేదికలను చంద్రబాబుకు సమర్పించాల్సి ఉంటుంది.
రాబిన్ శర్మ మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో శివసేనకు సేవలు అందజేయడానికి అక్కడకు వెళ్లారని తెలుస్తోంది. అయితే ఆయన తర్వాత శంతను షో టైమ్ లో కీలక బాధ్యతలు చూస్తున్నారు. ఇప్పుడు ఏపీలో టీడీపీకి శంతను సారథ్యంలో షో టైమ్ గ్రూప్ సేవలు అందిస్తుందని తెలుస్తోంది.
2019లో తాను అధికారంలోకి రావడానికి సహకరించిన ఐప్యాక్ ను తర్వాత ఐదేళ్లు కూడా జగన్ కొనసాగించారు. ఐప్యాక్ నుంచి ప్రశాంత్ కిశోర్ తప్పుకున్నా దాన్ని రుషిరాజ్ సింగ్ నడిపారు. అయితే ఎన్నికల్లో దారుణ పరాజయంతో జగన్ ఐప్యాక్ ను వదులుకున్నారని తెలుస్తోంది. దీంతో ఏపీ నుంచి ఐప్యాక్ బిచాణా ఎత్తేసిందని అంటున్నారు. ఇప్పుడు ఇక అంతా ఏపీలో ‘షో టైమ్’ దే హవా!!