Begin typing your search above and press return to search.

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజురోజుకూ మలుపు తిరుగుతోంది. కేసు దర్యాప్తు ప్రారంభం నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి.

By:  Tupaki Desk   |   30 Nov 2024 11:06 AM GMT
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం
X

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజురోజుకూ మలుపు తిరుగుతోంది. కేసు దర్యాప్తు ప్రారంభం నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాలో తలదాచుకున్నారు. తాజాగా.. ఈ కేసులోని నిందితుల పట్ల కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

ఫోన్ ట్యాపింగ్ అంశం వెలుగులోకి వచ్చిన రోజే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారు. చికిత్స కోసం అని వెళ్లిన ఆయన.. అప్పటి నుంచి అక్కడే ఉండిపోయారు. ఇప్పటికే ఆయనకు తెలంగాణ పోలీసులు నోటీసులు సైతం మెయిల్ ద్వారా పంపించారు. కానీ.. ఆయన మాత్రం తిరిగి రావడం లేదు. అంతేకాకుండా అక్కడే ఉండిపోయే ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు.

ఇదే క్రమంలో ఇప్పటికే ప్రభాకర్ రావు అమెరికా నుంచి గ్రీన్‌కార్డు సైతం పొందారు. అమెరికాలో స్థిరపడిన తన కుటుంబసభ్యుల ద్వారా గ్రీన్‌కార్డు పొందారు. దీంతో ఆయనకు అక్కడే శాశ్వతంగ ఉండే వెసులుబాటు లభించింది. ఈ పరిణామంతోనే ట్యాపింగ్ కేసు విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో తెలియక తెలంగాణ పోలీసులు సతమతం అయ్యారు. ఇక తాజాగా.. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ అమెరికా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను తెలంగాణ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో కీలక స్థానంలో తాను పనిచేశానని పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో తాను బాధపడుతున్నానని తెలిపారు. ప్రస్తుతానికి ఫ్లోరిడాలో తన కుమారుడి వద్ద ఉంటున్నట్లు పిటిషన్‌లో వివరించారు. అలాగే.. తన పాస్‌పోర్టును రద్దు చేయొద్దని భారత ప్రభుత్వాన్ని వేడుకున్నారు. తనను తెలంగాణ ప్రభుత్వం వేధిస్తోందని పేర్కొన్నారు. దాంతో ఈ కేసు కాస్త మరో మలుపు తిరిగింది.

ఈ కేసులో ఇప్పటికే నలుగురు పోలీసులు నిందితులుగా అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. కీలక నిందితులుగా ఉన్న ప్రభాకర్‌రావు ఫ్లోరిడాలో ఉన్నారు. మరో నిందితుడు శ్రవణ్ రావు చికాగోలు ఉన్నారు. వీరిని ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఈ కేసు నుంచి ఎవరూ తప్పించుకోకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభాకర్‌రావుతో పాటు శ్రవణ్ రావు పాస్‌పోర్టులను కేంద్రం సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పాస్‌పోర్టులను కూడా రద్దు చేసింది.