Begin typing your search above and press return to search.

అటు ఒలింపిక్స్.. ఇటు రాజకీయాలు.. బిహార్ బీజేపీ మహిళా ఎమ్మెల్యే!

అంతేకాదు.. ఈమె ఏకంగా ప్రపంచ క్రీడా సంగ్రామం అయిన ఒలింపిక్స్ లోనూ పాల్గొంటున్నారు.

By:  Tupaki Desk   |   27 July 2024 11:25 AM GMT
అటు ఒలింపిక్స్.. ఇటు రాజకీయాలు.. బిహార్ బీజేపీ మహిళా ఎమ్మెల్యే!
X

భారత దేశంలో రాజకీయాలు, క్రీడలకు దగ్గరి సంబంధం ఉంటుంది. క్రీడల్లో రిటైరైన ఎందరో రాజకీయాల్లోకి వచ్చిన ఉదంతాలున్నాయి. అయితే, రాజకీయ నాయకులు క్రీడాకారులుగా ఉన్న సందర్భాలు మాత్రం లేవు. ఈ రికార్డును బ్రేక్ చేశారు బిహార్ కు చెందిన మహిళా ఎమ్మెల్యే. అంతేకాదు.. ఈమె ఏకంగా ప్రపంచ క్రీడా సంగ్రామం అయిన ఒలింపిక్స్ లోనూ పాల్గొంటున్నారు. తద్వారా ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘనతను అందుకున్నారు.

రాజకీయ కుటుంబం నుంచి

శ్రేయసి సింగ్.. బిహార్‌కి చెందిన ఎమ్మెల్యే. జముయ్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అయితే, ఈమె ప్రొఫెషనల్ షూటింగ్ క్రీడాకారిణి. మెరుగైన ప్రతిభ కనబర్చిన వారికి క్రీడల్లో అందించే అత్యుత్తమ అవార్డు ‘అర్జున’ గ్రహీత కూడా. కాగా, శ్రేయసి.. డబుల్‌ ట్రాప్‌ విభాగంలో 2014లో గ్లాస్గోలో జరిగిన కామన్‌ వెల్త్‌ గేమ్స్‌ లో రజతం నెగ్గింది. 2018లో గోల్డ్‌ కోస్ట్‌ లో జరిగిన పోటీల్లో స్వర్ణం గెలిచింది. కాగా, ఈమె స్వస్థలం గిదౌర్‌. ఢిల్లీలోని హన్స్‌ రాజ్‌ కాలేజీ నుంచి ఆర్ట్స్‌ లో డిగ్రీ పూర్తి చేశారు. ఫరీదాబాద్‌ లోని మానవ్‌ రచనా యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు. అయితే, 2020లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సిటింగ్‌ ఎమ్మెల్యే విజయ్‌ ప్రకాష్‌ పై 41 వేల ఓట్ల ఆధిక్యంతో నెగ్గారు. శ్రేయసి తండ్రి దిగ్విజయ్‌ సింగ్‌ మాజీ ఎంపీ. తల్లి పుతుల్‌ సింగ్‌ ప్రస్తుతం బంకా నియోజకవర్గ ఎంపీ. అమ్మానాన్న రాజకీయాల్లో ఉండడంతో శ్రేయసి కూడా అటే అడుగేశారు. అయితే, పూర్తిగా రాజకీయ కుటుంబం కాదు.. శ్రేయసి తాత కుమార్‌ సెరేందర్‌ సింగ్, తండ్రి దిగ్విజయ్‌ నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ కి అధ్యక్షులు.

ప్రజా సేవ పైనా గురి

శ్రేయసి.. షూటింగ్‌ ను కెరియర్ గా ఎంచుకున్నా.. ఎమ్మెల్యేగా ప్రజలకూ సమయం కేటాయిస్తున్నారు. అయితే, బిహార్ లోని తన నియోజకవర్గంలో షాట్‌ గన్‌ రేంజ్‌ లేకపోవడంతో ఢిల్లీ వెళ్లి ప్రాక్టీస్ చేసేశారు. దీనికోసం తరచూ రైలు ప్రయాణం చేసేవారు. అయితే, తన నియోజకవర్గంలో అభివృద్ధిని మాత్రం విస్మరించలేదు.