'పుష్ప 2' తొక్కిసలాట... బాలుడి హెల్త్ బులిటెన్ విడుదల
అప్పుడప్పుడు జ్వరం రావడంతో పాటు, శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నాడు అంటూ వైద్యులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో ప్రకటించడం జరిగింది.
By: Tupaki Desk | 15 Dec 2024 8:24 AM GMTపుష్ప 2 సినిమా సంధ్య థియేటర్ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో వివాహిత రేవతి మృతి చెందిన విషయం తెల్సిందే. ఆమె తనయుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. గత పది రోజులుగా శ్రీతేజ్‌కి ఆసుపత్రి వర్గాలు చికిత్స అందిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు అతడు స్పృహలోకి రాలేదని వైద్యులు ప్రకటించారు. అప్పుడప్పుడు జ్వరం రావడంతో పాటు, శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నాడు అంటూ వైద్యులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో ప్రకటించడం జరిగింది.
గాయాలతో స్పృహ కోల్పోయిన బాలుడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి వైద్యులు చాలా సీరియస్‌గా చికిత్స చేస్తూ బాలుడిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో బాలుడి ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి ఆరోగ్య పరిస్థితి సీరియస్ అయ్యింది అంటూ నిన్న మీడియాలో కథనాలు వచ్చిన విషయం తెల్సిందే. దాంతో వైద్యులు అధికారికంగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం బాలుడు ఇంకా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆయనకు అత్యవసర చికిత్సను అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
వెంటిలేటర్‌పై ఉంచి శ్రీతేజ్‌కి చికిత్స అందిస్తున్నామని, పది రోజుల నుంచి స్పృహలోకి అతడు రాలేదని వైద్యులు తెలియజేశారు. పూర్తి స్థాయిలో అతడు ఆరోగ్యంగా మారేందుకు సమయం పడుతుందని, ఇప్పటికీ అతడి పరిస్థితి సీరియస్‌గానే ఉంది అంటూ వైద్యులు తెలియజేశారు. పది రోజులు దాటినా బాలుడి ఆరోగ్య పరిస్థితిలో మార్పు కనిపించక పోవడం పట్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆసుపత్రి చికిత్సకు ఖర్చు అవుతుందని, దాన్ని మైత్రి మూవీ మేకర్స్, అల్లు అర్జున్‌కి సంబంధించిన వారు భరిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.
సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో నమోదు అయిన కేసులో హీరో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం, రిమాండ్‌కు పంపించడం, బెయిల్‌పై బయటకు రావడం అన్ని చకచక జరిగిన విషయం తెల్సిందే. మరో వైపు పుష్ప 2 సినిమా వసూళ్లు భారీ ఎత్తున నమోదు అవుతున్నాయి. వెయ్యి కోట్ల వసూళ్లు అతి తక్కువ సమయంలోనే నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు రూ.1200 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. లాంగ్ రన్‌లో ఈ సినిమా ఎంత మొత్తం సాధిస్తుంది అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.