అందరూ మర్చిపోయిన శ్రీతేజ్ ఇప్పుడెలా ఉన్నాడు?
శ్రీతేజ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావద్దేశం మొత్తం ఈ పిల్లాడి గురించి..ఇతగాడి ఆరోగ్యం గురించి మాట్లాడుకోవటం తెలిసిందే.
By: Tupaki Desk | 30 Jan 2025 5:30 AM GMTశ్రీతేజ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావద్దేశం మొత్తం ఈ పిల్లాడి గురించి..ఇతగాడి ఆరోగ్యం గురించి మాట్లాడుకోవటం తెలిసిందే. తొమ్మిదేళ్ల ఈ చిన్నారి అల్లు అర్జున్ కు వీరాభిమాని. తన అభిమాన హీరో నటించిన పుష్ప2 మూవీని తొలి షోను చూడాలని తల్లిదండ్రుల్ని పోరు పెట్టి మరీ.. ఖరీదైన బెనిఫిట్ షో టికెట్లు కొనేలా చేశాడు. సినిమా చూసేందుకు వెళ్లి.. అక్కడ జరిగిన తొక్కిసలాటలో తల్లిని కోల్పోయాడు. తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాతేం జరిగిందో అందరికి తెలిసిందే.
అతడికి తీవ్ర గాయాలై ఇప్పటికి 56 రోజులు దాటింది. అతడి గురించి నిత్యం హెల్త్ బులిటెన్లు పబ్లిష్ చేసిన దినపత్రికలు.. ఎప్పటికప్పుడు అతడి ఆరోగ్యం గురించి బ్రేకింగ్ న్యూస్ లు ఇచ్చిన టీవీ చానళ్లు ఇప్పుడు శ్రీతేజ్ ను.. అతడి గురించి మర్చిపోయిన పరిస్థితి. కొత్త విషయాలు రావటం.. వాటి మీద ఫోకస్ పెట్టటం.. శ్రీతేజ్ అంశం పాతది కావటం తెలిసిందే. కట్ చేస్తే.. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? అతడి ఆరోగ్య పరిస్థితి ఏమిటి? ఇన్ని రోజులుగా అతడికి అందించిన వైద్య సేవల అనంతరం అతడిలో వచ్చిన మార్పు ఏమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానాల్ని వెతికితే.. మనసుకు అయ్యో అనిపించే సమాచారం అందుతుంది. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉంది అంటున్నారు
తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ అప్పటి పరిస్థితికి ఇప్పటికి పెద్దగా మార్పు లేదంటున్నారు . గాయపడి 56 రోజులు గడిచినప్పటికి ఇప్పటికి ఆసుపత్రి బెడ్ మీదే ఉన్నాడు. పేరు పెట్టి పిలిచినా కళ్లు తెరిచి చూడలేడు.నోరు విప్పి మాట్లాడలేడు. ఇప్పటివరకు ముక్కు వద్ద అమర్చిన సన్నని గొట్టం ద్వారా లిక్విడ్ ఆహారాన్ని అందిస్తున్నారు. నిత్యం ఫిజియోథెరపీ చేస్తున్నారు. అయినా ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. ఎప్పుడు కోలుకుంటాడో వైద్యులు సైతం చెప్పలేని పరిస్థితి.
పైకి చూసినప్పుడు గాయాల తీవ్రత తగ్గినట్లుగా కనిపించినా.. అంతర్గతంగా తగిలిన గాయాల నుంచి ఇప్పటికి కోలుకున్నది లేదు. అతడి నుంచి స్థిరమైన ప్రతిస్పందనలు ఉండటం లేదని కిమ్స్ వైద్యులు చెబుతున్నారు. తొక్కిసలాట సందర్భంగా.. కిందపడిపోయిన అతడిని జనం తొక్కుకుంటూ పోవటంతో కాసేపు ఊపిరి ఆగింది. సీపీఆర్ తో తిరిగి శ్వాస అందుకున్నాడు. అతడ్ని ఆదుకునేందుకు.. అతడికి అవసరమైన వైద్య సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం.. సినీ ప్రముఖులు ముందుకు వచ్చినా.. ఎప్పుడు కోలుకుంటాడో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అతడి కోసం అతడి తండ్రి.. చెల్లెలు రోజులు లెక్కపెట్టుకుంటూ అతడితో మాట్లాడేందుకు తహతహలాడుతున్నారు. అదెప్పటికి జరుగుతుందో చూడాలి.