Begin typing your search above and press return to search.

ఉదయనిధి తల తెస్తే రూ.10 కోట్లు ఇస్తా.. స్వామీజీ సంచలనం!

సనాతన ధర్మం కూడా డెంగ్యూ, మలేరియా, కరోనా లాంటిదని.. దాన్ని మనం వ్యతిరేకించకూడదని.. పూర్తిగా నిర్మూలించాలంటూ ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   5 Sep 2023 5:36 AM GMT
ఉదయనిధి తల తెస్తే రూ.10 కోట్లు ఇస్తా.. స్వామీజీ సంచలనం!
X

సనాతన ధర్మం కూడా డెంగ్యూ, మలేరియా, కరోనా లాంటిదని.. దాన్ని మనం వ్యతిరేకించకూడదని.. పూర్తిగా నిర్మూలించాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కుమారుడు క్రీడలు, యువత శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి కారణమైన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై అనేక మంది నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

తాజాగా ఉత్తరప్రదేశ్‌ లోని అయోధ్యకు చెందిన పరంధాస్‌ ఆచార్య అనే స్వామిజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ తల నరికి తనకు తెచ్చి ఇస్తే రూ. 10 కోట్లు ఇస్తానని కలకలం రేపారు. ఈ సందర్భంగా ఒక చేతిలో ఉదయనిధి ఫోటో, మరో చేతిలో అతడి తలను నరుకుతున్న వీడియోను స్వామజీ పరంధాస్‌ ఆచార్య చూపించారు. ఈ పని మీరు త్వరగా చేస్తే రూ. 10 కోట్లు ఇస్తాను అంటూ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఉదయనిధి ఫొటోను తగలబెడుతున్న వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ఓ స్వామీజీ తన తల నరికితే రూ. 10 కోట్లు ఇస్తానని ప్రకటించారన్నారు. ఆయన నిజంగా సాధువా, లేక డూప్లికేట్‌ స్వామీజీనా ? అని ప్రశ్నించారు. ఈ స్వామీజీలకు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన తల తీసే బదులు 10 రూపాయల దువ్వెన ఇస్తే నేను తల చక్కగా దువ్వుకుంటాను కదా అంటూ ఎద్దేవా చేశారు.

ఇంకోవైపు ఇప్పటికే బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు. స్టాలిన్‌ కు చెందిన డీఎంకే పార్టీ.. ఇండియా కూటమిలో ఉండటంతో దాన్ని లక్ష్యంగా చేసుకుని అమిత్‌ షా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి సనాతన ధర్మానికి వ్యతిరేకమని తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు హిందూ సంఘాలు, వివిధ పార్టీల నేతలు కూడా ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఈ స్థాయిలో తనపై ఆగ్రహం వ్యక్తమవుతున్నా తగ్గేదే లే అని ఉదయనిధి స్టాలిన్‌ చెబుతున్నారు. తనపైన కేసులు వేసుకున్నా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోబోనని అంటున్నారు. ఇవేవీ తాను ఇప్పుడు చెప్తున్నవి కాదని అంబేద్కర్, పెరియార్‌ వంటివారు ఎప్పుడో చెప్పారంటూ తన వ్యాఖ్యలను ఉదయనిధి సమర్థించుకుంటుండటం గమనార్హం.

ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యల ప్రభావం వచ్చే లోక్‌ సభ ఎన్నికలపై పడే ప్రభావం ఉండటంతో కాంగ్రెస్‌ పార్టీ నష్ట నివారణ చర్యలకు దిగింది. ఆయన వ్యాఖ్యలు పూర్తిగా అతడి వ్యక్తిగతమని స్పష్టం చేసింది. తమ పార్టీకి ఆయన వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది.

ఇంకోవైపు బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవీయ.. ఉదయనిధి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. సనాతన ధర్మాన్ని తమిళనాడు మంత్రి ఉదయనిధి మలేరియా, డెంగ్యూలతో పోల్చుతున్నారని మండిపడ్డారు. దీనిని వ్యతిరేకించడం కాకుండా సమూలంగా నిర్మూలించాలని ఆయన అంటున్నారని ధ్వజమెత్తారు.

సనాతన ధర్మాన్ని పాటించేవారు జనాభాలో 80 శాతం మంది ఉన్నారని అమిత్‌ మాలవీయ తెలిపారు. వారిని సామూహికంగా హత్య చేయాలని ఉదయనిధి అభిప్రాయపడుతున్నారని నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష ఇండియా కూటమిలో డీఎంకే ముఖ్యమైన పార్టీగా ఉందన్నారు. కాంగ్రెస్‌ తో ఆ పార్టీకి సుదీర్ఘకాలం నుంచి మైత్రి ఉందని గుర్తు చేశారు. ముంబైలో జరిగిన ఇండియా కూటమి సమావేశాల్లో దీనిపైనే అంగీకారం కుదిరిందా? అని అమిత్‌ మాలవీయ నిలదీశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

ఈ నేపథ్యంలో అమిత్‌ మాలవీయ ట్వీట్‌ ను ఉదయనిధి కోట్‌ చేస్తూ.. తాను సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న వారిని నరమేధం చేయాలని చెప్పడం లేదన్నారు. సనాతన ధర్మం అనేది కులం, మతం పేరుతో ప్రజలను విభజించే సూత్రమని మరోమారు ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించడం ద్వారా మానవత్వాన్ని, మానవ సమానత్వాన్ని నిలబెట్టాలని అన్నారు. తాను మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటానని తెలిపారు.

తాను సనాతన ధర్మం కారణంగా అణగారిన, అట్టడుగున ఉన్న వారి తరపున మాట్లాడానని ఉదయనిధి స్టాలిన్‌ ట్వీట్‌ లో తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. సమాజంపై సనాతన ధర్మం ప్రతికూల ప్రభావం గురించి లోతైన పరిశోధన చేసిన పెరియార్, అంబేడ్కర్‌ రచనలను తాను ఏ వేదికలోనైనా ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

‘‘నా ప్రసంగంలోని వ్యాఖ్యలను పునరుద్ఘాటిస్తున్నాను: దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా, కోవిడ్‌ వంటి వ్యాధులు వ్యాప్తి చెందినట్టే.. అనేక సామాజిక దురాచారాలకు సనాతన ధర్మం కారణమని నేను నమ్ముతున్నాను. న్యాయస్థానం లేదా ప్రజాకోర్టులో ఏవైనా సవాళ్లను ఎదుర్కొనేందుకు నేను సిద్ధం. తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం ఆపండి’’.. అంటూ తనదైన శైలిలో బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవీయకు ఉదయనిధి ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు.

ఇంకోవైపు లీగల్‌ రైట్స్‌ అబ్జర్వేటరీ కూడా ఉదయనిధి వ్యాఖ్యలను ఖండించింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న ఆయనను చట్టపరంగా నిర్మూలించేవరకు ఊరుకోబోమని హెచ్చరించింది.

మరోవైపు తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలై కూడా ఉదయనిధి వ్యాఖ్యలపై మండిపడ్డారు. సనాతన ధర్మం అనేది క్రైస్తవం, ఇస్లాం మతాలు రాకముందు నుంచే ఉన్నాయని స్పష్టం చేశారు. 140 కోట్ల మంది ప్రజలు అతడి వ్యాఖ్యలను ఖండించాలన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించడానికి ఉదయనిధి ఎవరని అన్నామలై ప్రశ్నించారు.

విపక్షాల ఇండియా కూటమిలో డీఎంకే భాగస్వామిగా ఉండటంతో ఇప్పటికే ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పక్షాలు ఒంటికాలిపై విరుచుకుపడుతున్నాయి. కాగా గతంలో డీఎంకే పార్టీ నేతలు.. మాజీ సీఎం కరుణానిధి తదితరులు హిందూ మతాన్ని, శ్రీరాముడిని కించపరుస్తూ ఇలాంటి వ్యాఖ్యలే అనేకసార్లు చేశారు.