ఆ నగరంలో అనారోగ్యం నిషిద్ధం... ఇది మేయర్ మార్కు వెటకారం!
అయితే... తాజాగా ఓ నగరంలో మాత్రం అనారోగ్యం నిషిద్ధం అంటూ మేయర్ ఉత్తర్వ్యులు జారీ చేశారు.
By: Tupaki Desk | 11 Jan 2025 2:30 PM GMTసాధారణంగా... ఇక్కడ ఇతరులకు ప్రవేశం నిషిద్ధం అని.. ఇది పులులు సంచరించే ప్రాంత, పర్యాటకులు నిషిద్ధం అని.. ఇక్కడ చెత్త వేయొద్దని.. అక్కడ మూత్రం పోయొద్దని.. ఇలా రకరకాల నిషిద్ధాలు నిత్యం ఏదో మూల చూస్తూనే ఉంటాం. అయితే... తాజాగా ఓ నగరంలో మాత్రం అనారోగ్యం నిషిద్ధం అంటూ మేయర్ ఉత్తర్వ్యులు జారీ చేశారు.
అవును... వైద్య సాయం అవసరమయ్యే ఎలాంటి అనారోగ్యానికి లోనవ్వొద్దు.. ముఖ్యంగా అత్యవసర చికిత్స అవసరమయ్యే ఎలాంటి అనారోగ్యం బారినా పడోద్దు.. ఈ పట్టణంలో ప్రజలు అనారోగ్యానికి గురికావడం నిషిద్ధం అంటూ మేయర్ ఆంటోనియో టార్చియా ఉత్తర్వ్యులు జారీ చేశారు. ఇప్పుడు ఈ విషయం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అక్కడితో ఆగని ఆయన.. మరికొన్ని కండిషన్స్ ప్రకటించారు. ఇందులో భాగంగా... ఇల్లు వదిలి బయట ప్రాంతాల్లో ప్రయాణించవద్దని.. ఆటలు నేర్చుకోవద్దని.. గృహ ప్రమాదాల నివారణలో భాగంగా హానికారకమైన ఎలాంటి కార్యక్రమాలూ నిర్వహించొద్దని.. ఎక్కువసేపు కదలకుండా కూర్చోవద్దని చెబుతూ సదరు మేయర్ ఏకంగా ఆర్డినెన్సే జారీ చేశారు.
మరోవైపు ఆ ప్రాంతానికి పర్యాటకులను ఆహ్వానించిన ఆయన... తమ ప్రాంతంలో ఓ వారం పాటు నివసించండి కానీ సురక్షితంగా ఉండండి అని కోరారు. అందుకు గల కారణాన్ని వెల్లడిస్తూ.. ఆరోగ్యం పాడైతే ఎలాంటి వైద్య సేవలు కావాలన్నా సుమారు 45 కిలో మీటర్ల దూరం వెళ్లల్సి ఉంటుందని వారిని హెచ్చరించారు.
ఈ ఘటన దక్షిణ ఇటలీలోని కాలాబ్రియా ప్రాంతంలోని చిన్న టౌన్ అయిన బెల్కాస్ట్రో లో చోటు చేసుకుంది. నగరానికి పెద్ద దిక్కైన మేయరే స్వయంగా ఇలాంటి ఆదేశాలివ్వడం అక్కడి ప్రజలకు షాకింగ్ మారింది. అయితే.. దీని వెనుక ఓ ఆసక్తికర కారణం ఉంది.. తన ఆగ్రహాన్ని ఆయన ఇలా వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి బెల్కాస్ట్రో అనే చిన్న పట్టణంలో మొత్తం జనాహా 1,300 మంది కాగా.. వారికి ఉన్నది ఒకే ఒక్క చిన్న ఆరోగ్య కేంద్రం. పైగా అక్కడ వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండరట. ఇక అత్యవసర పరిస్థితి వస్తే సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాటంజారో నగరానికి వెళ్లలట. ఈ సమయపై ఆయన ఎన్నో సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారంట.
అయినప్పటికి ప్రయోజనం లేకపోయేసరికి ఇలా మేయర్ వ్యంగ్య ప్రకటన చేసినట్లు చెబుతున్నారు. ఇది ఆరోగ్య అధికారులపై మేయర్ కు ఉన్న ఆగ్రహమే అని చెబుతున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంలో స్పందించి.. ఆ బెలాస్ట్రో పరిస్థితి అర్ధం చేసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి!