ఈ కీలక నేత ఎంట్రీకి చంద్రబాబు ఓకే చెప్పేనా?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఆ పార్టీ నేతలు పక్క చూపులు చూస్తున్నారు.
By: Tupaki Desk | 29 July 2024 10:00 AM GMTఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఆ పార్టీ నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా మాజీ మంత్రి, ప్రకాశం జిల్లాలో కీలకమైన ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన శిద్ధా రాఘవరావు టీడీపీలోకి రావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారని అంటున్నారు. ఇప్పటికే ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కూడా పార్టీ అధినేత వైఎస్ జగన్ కు పంపారు.
గతంలో టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా, 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోడ్లు, భవనాలు, రవాణా శాఖ మంత్రిగా శిద్ధా రాఘవరావు పనిచేశారు. 2019 వరకు ఆయన మంత్రిగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన ఒంగోలు నుంచి టీడీపీ తరఫున లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు.
2019 ఎన్నికల్లో ఓడిపోయాక శిద్ధా రాఘవరావు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన కుమారుడు సుధీర్ కు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడిగా అవకాశం కూడా దక్కింది. అయితే 2024 ఎన్నికల్లో శిద్ధా రాఘవరావు ప్రకాశం జిల్లా దర్శి నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ ఆయనకు టికెట్ దక్కలేదు. 2014లో దర్శి నుంచే శిద్ధా టీడీపీ తరఫున విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఎన్నికల్లో దర్శి టికెట్ ను ఆశించారు. అయితే జగన్ ఆయనకు సీటును ఇవ్వలేదు.
ఎన్నికలలో వైసీపీ పరాజయం పాలు కావడంతో టీడీపీలోకి రావడానికి శిద్ధా రాఘవరావు ఏర్పాట్లు చేసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ లను కలవడానికి ప్రయత్నించినా అపాయింట్మెంట్ దొరకలేదని సమాచారం. దీంతో ప్రకాశం జిల్లాకే చెందిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ద్వారా టీడీపీలోకి రావడానికి శిద్ధా రాఘవరావు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. చంద్రబాబుతో మాట్లాడి టీడీపీ చేరికకు మార్గం సుగమం చేయాలని గొట్టిపాటిని కోరినట్టు తెలుస్తోంది.
అయితే వైసీపీ నుంచి ఏ నేతనూ టీడీపీలో చేర్చుకునే ఉద్దేశంలో చంద్రబాబు లేరని చెబుతున్నారు. ఎందుకంటే పొత్తుల్లో భాగంగా ఇటీవల ఎన్నికల్లో 31 మంది టీడీపీ నేతలకు అసెంబ్లీ సీట్లు దక్కలేదు. అలాగే 8 పార్లమెంటు స్థానాల్లోనూ టీడీపీ నేతలకు పొత్తు కారణంగా చంద్రబాబు సీట్లు ఇవ్వలేకపోయారు. ఈ సీట్లు దక్కని నేతలకు న్యాయం చేయాల్సి ఉంది. సీట్లు దక్కని సీనియర్ నేతలకు ఎమ్మెల్సీ, రాజ్యసభ, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వాల్సి ఉందని చెబుతున్నారు. వీరు కాకుండా ద్వితీయ శ్రేణి నేతలు ఎలాగూ ఉన్నారు. వీరందరికీ న్యాయం చేయడమే కత్తిమీద సాములా ఉందని అంటున్నారు.
ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చేవారిని కూడా చేర్చుకుంటే వారికి పదవులు ఇవ్వడం కష్టమనే ఉద్దేశంతోనే చేరికలకు చంద్రబాబు సిద్ధంగా లేరని చెబుతున్నారు. ఈ క్రమంలో శిద్ధా రాఘవరావు తనకు పదవి ఇవ్వకపోయినా పర్లేదు అని.. టీడీపీలో ఎలాంటి కండీషన్లు లేకుండా చేరతానని చెప్పినట్టు తెలుస్తోంది. మరి దీనికి చంద్రబాబు ఏమంటారో వేచిచూడాల్సిందే.