సిద్ధ రామయ్యకు క్లీన్ చిట్...పదిలం సీఎం సీటు
అయితే సిద్ధరామయ్య మాత్రం మొదటి నుంచి ఈ ఇష్యూలో తన తప్పు లేదని వాదిస్తూ వచ్చారు. చివరికి అదే నిజం అన్నట్లుగా ఆయనకు ముడా కుంభకోణంలో క్లీన్ చిట్ లభించింది.
By: Tupaki Desk | 20 Feb 2025 3:55 AM GMTకర్నాటక రాజకీయాలలో ఏదో జరిగిపోతుంది అనుకునంది కాస్తా ఏమీ కాకుండా పోయింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ ముడా స్థలాల కేటాయింపు ఇష్యూని తెచ్చి భారీ కుంభకోణం మాదిరిగా చిత్రీకరించి కాంగ్రెస్ సీఎం సిద్ధ రామయ్యను ఇబ్బంది పెట్టాలని ప్రతిపక్ష బీజేపీ చూసింది. సొంత పార్టీలోని ప్రత్యర్థి వర్గం వారు కూడా ఇదే సందు అన్నట్లుగా ఆయన దిగిపోతే బాగుండునని అనుకున్నారు. ఇంకేముందీ రేపో మాపో సిద్ధరామయ్య మాజీ సీఎం అవుతారని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగింది.
అయితే సిద్ధరామయ్య మాత్రం మొదటి నుంచి ఈ ఇష్యూలో తన తప్పు లేదని వాదిస్తూ వచ్చారు. చివరికి అదే నిజం అన్నట్లుగా ఆయనకు ముడా కుంభకోణంలో క్లీన్ చిట్ లభించింది. ముడా స్థలాల కేటాయింపు కేసుకు సంబంధించి సిద్ధరామయ్యకు ఆయన సతీమణికి అలాగే అభియోగాలను మోస్తున్న మరో ఇద్దరికీ సంబంధం ఉన్నట్లుగా ఏ రకమైన ఆధారాలూ లేవంటూ లోకాయుక్త క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో నేరం రుజువు కాలేదని అందువల్ల తుది నివేదికను హైకోర్టుకి సమర్పించామని విచారణ జరిపిన అధికారులు వెల్లడించారు.
ఇక ఈ కేసు విషయానికి వస్తే ముడా స్థలాల కేటాయింపులో సిద్ధరామయ్య ఆశ్రిత పక్ష పాతానికి పాల్పడ్డారని భారత శిక్షాస్మృతి, అవినీతి నిరోధక చట్టం, బినామీ లావాదేవీల చట్టం, కర్ణాటక భూ కబ్జా చట్టంలోని అనేక సెక్షన్ల కింద కేసులను గతంలో నమోదు చేశారు. దీంతో ఇది రాజకీయంగా పెను సంచలనమైంది. పదవిలో ఉన్న ఒక సీఎం మీద ఈ తరహా సెక్షన్ల మీద కేసు ఫైల్ కావడంతో ఆయనకు పదవీ గండం తప్పదని కూడా రాజకీయ పండితులు ఒక దశలో తేల్చేశారు.
అంతే కాదు సిద్ధరామయ్య గద్దె దిగితే ఎక్కేందుకు కాంగ్రెస్ లో సిద్ధంగా ఉన్న వర్గాలు సైతం ఆయన సీఎం పదవికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని కూడా లెక్కలేసుకున్నారు. ఈ వ్యవహారం బయటపడినపుడు సిద్ధరామయ్య వర్గీయులు కూడా కలవరం చెందారు. ఏడున్నర పదులు దాటిన వయసులో పెద్దాయనకు ఈ చిక్కులేంటని కూడా అంతా ఆందోళన చెందారు. ఇక చూస్తే సిద్ధరామయ్య 2013 నుంచి 2018 దాకా మంచి పాలన అందించి సింగిల్ హ్యాండ్ తో అయిదేళ్ళ పాటు కాంగ్రెస్ సీఎం గా మచ్చ లేని నేతగా పేరు తెచ్చుకున్నారు.
అయితే 2023 ఎన్నికల్లో మాత్రం ఆయనకు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ నుంచి పోటీ ఎదురైంది. దీంతో మొదట చాన్స్ సిద్ధరామయ్యకు ఇచ్చి పవర్ షేరింగ్ అన్న ఒప్పందం కుదిర్చారు అని ప్రచారం సాగింది. ఈ లెక్కన సిద్ధరామయ్య పదవీ కాలం ఈ ఏడాది నవంబర్ తో ముగుస్తుంది. మరో రెండున్నరేళ్ల పాటు డీకే శివకుమార్ సీఎం గా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది.
అయితే ఇపుడు క్లీన్ చిట్ తో బయటపడిన సిద్ధరామయ్య తనదైన రాజకీయంతో అయిదేళ్ళూ సీఎం గా ఉండేందుకు పావులు కదుపుతారని అంటున్నారు. సిద్ధరామయ్యనే కొనసాగించాలన్న వర్గాలూ కాంగ్రెస్ లో బలంగానే ఉన్నాయి. ఇక డీకే కి పోటీగా అయిదారుగురు రేసులోకి వస్తున్నారు. సిద్ధరామయ్యను కనుక కదిపితే ఎవరికి పదవి ఇచ్చినా సిద్ధరామయ్యతో పాటు మిగిలిన వారూ వర్గాలుగా మారుతారన్న ఆందోళన కూడా కాంగ్రెస్ లో ఉంది.
అయితే ఇంతకాలం సిద్ధరామయ్య మీద ముడా కుంభకోణం కేసు ఉంది అన్న సాకుతో ఆయనను తప్పించాలన్న డిమాండ్ ఉంది. దానిని ఆసరాగా చేసుకుని ముందుగానే పదవికి ఎసరు పెట్టే యత్నాలూ జోరుగా సగాయి. కానీ ఇపుడు చూస్తే సిద్ధరామయ్య రాజకీయంగా బలంగా మారారని అంటున్నారు. దాంతో ఆయన అయిదేళ్ళ సీఎం అని ఆయన వర్గీయులు అంటున్నారు. మరి డీకేకు పవర్ షేరింగ్ ఉంటుందా లేదా అన్నది నవంబర్ లో కానీ తేలదు. ఇక సిద్ధరామయ్య మాత్రం ఇదే ఊపుతో తనదైన వ్యూహంతో ముందుకు దూసుకుని పోతారని అంటున్నారు. సో కర్ణాటక కాంగ్రెస్ రాజకీయం ఇక మీదట కడు రసవత్తరం అని అంటున్నారు.