ఆసుపత్రిలో చేరిన కర్ణాటక సీఎం.. అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు!
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన మణిపాల్ ఆసుపత్రిలో చేరారు.
By: Tupaki Desk | 3 Feb 2025 4:30 AM GMTకర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. దీంతో.. ఆయన అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు అయ్యాయి. ఇంతకూ సిద్దరామయ్య ఆరోగ్యానికి వచ్చిన సమస్యేంటి? ఆసుపత్రిలో ఎందుకు చేరారు? అన్న ప్రశ్నలకు సమాధానాల్ని చూస్తే.. గతంలో ఆయన ఎడమ మోకాలికి సర్జరీ జరిగింది. ఇప్పుడది తిరగబెట్టింది. దీంతో.. ఆయన ఇంట్లోనే వైద్య పరీక్షల్ని నిర్వహించారు.
కొద్ది రోజులుగా ఎడమ కాలు నొప్పి పెడుతుండగా.. తాజాగా అది తీవ్రంగా కావటంతో వైద్యుల సూచన మేరకు సిద్ధరామయ్య బెంగళూరులోని మణిపూర్ ఆసుపత్రిలో చేరారు. ఆయన్ను రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచన చేశారు. దీంతో.. ఆదివారం నాడు తన అధికారిక కార్యక్రమాలన్నింటిని రద్దు చేసుకున్నారు. ఈ విషయాల్ని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక అధికారిక ప్రకటనలో తెలియజేసింది.
మోకాలికి వైద్యులు స్కానింగ్ చేసినట్లుగా పేర్కొంటూ.. 'లిగ్మెంట్ సర్జరీ మీద ఒత్తిడి కారణంగా తీవ్రమైన నొప్పి పెడుతోంది. ఇతర ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది' అంటూ వైద్యులు సూచన చేశారని.. దీంతో.. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా పేర్కొన్నారు. సిద్దరామయ్య త్వరగా కోలుకొని.. ఎప్పటిలానే తన కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆశిద్దాం.