Begin typing your search above and press return to search.

తీవ్ర దాహార్తిలో గార్డెన్ సిటీ.. ఎంత కొరతో లెక్క చెప్పి షాకిచ్చిన సీఎం

ఇలాంటి వేళ.. సమస్య తీవ్రతను ప్రస్తావిస్తూ దానికి తాము చేపట్టిన చర్యలను చెబుతూ.. ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది.

By:  Tupaki Desk   |   19 March 2024 6:08 AM GMT
తీవ్ర దాహార్తిలో గార్డెన్ సిటీ.. ఎంత కొరతో లెక్క చెప్పి షాకిచ్చిన సీఎం
X

గడిచిన కొద్ది రోజులుగా గార్డెన్ సిటీ బెంగళూరులో నెలకొన్న నీటి ఎద్దడి తీవ్రత మీద మీడియా.. టీవీ చానళ్లు.. సోషల్ మీడియా.. వాట్సప్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బెంగళూరు మహానగరానికి ఇంత కష్టం ఎందుకు వచ్చిందన్న వార్తలతో పాటు.. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏదైనా సంక్షోభం ఎదురైన వేళ.. దాన్ని అధిగమించే అంశం మీద ఫోకస్ పెట్టాలే కానీ.. సమస్య తీవ్రతను అదే పనిగా చెబుతూ కూర్చోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. గడిచిన నాలుగు దశాబ్దాల్లో ఎప్పుడు లేనటువంటి నీటి సంక్షోభాన్ని బెంగళూరు ఎదుర్కొంటోంది.

ఇలాంటి వేళ.. సమస్య తీవ్రతను ప్రస్తావిస్తూ దానికి తాము చేపట్టిన చర్యలను చెబుతూ.. ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కానీ.. అందుకు భిన్నంగా మిన్నకుండిపోయిన సీఎం సిద్దరామయ్య ఎట్టకేలకు తాజాగా నోరు విప్పారు. బెంగళూరులో నీటి ఎద్దడి ఉందన్న విషయాన్ని ఒప్పుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో రోజుకు నెలకొన్న నీటి కొరత దాదాపు 500 మిలియన్ లీటర్స్ పర్ డే (ఎంఎల్ డీ) గా పేర్కొన్నారు.

రోజువారీగా 2600 ఎంఎల్ డీ అవసరాలు ఉండగా.. 20 శాతం నీటి కొరత ఉందన్న విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు.. తాగునీటి సరఫరాకు నిధుల కొరత లేదన్న ఆయన భవిష్యత్తులో ఈ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లుగా వెల్లడించారు. గడిచిన కొద్ది రోజులుగా తాగు నీటి సమస్య కారణంగా బ్రాండ్ బెంగళూరకు భారీగా డ్యామేజ్ జరిగిన నేపథ్యంలో ఇప్పటికి కళ్లు తెరిచిన సిద్దరామయ్య స్పందించారు. దిద్దుబాటు చర్యల్ని షురూ చేశారు. బెంగళూరు మహానగరంలో వైట్ ఫీల్డ్.. కేఆర్ పురం.. ఎలక్ట్రానిక్స్ సిటీ.. ఆర్ఆర్ నగర్.. కేంగేరీ.. సీవీ రామన్ ప్రాంతాల్లో సమస్య తీవ్రత ఉందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి సిద్దరామయ్య.

బెంగళూరులో మొత్తం 14వేల బోరు బావులు ఉంటే.. అందులో 6900 ఎండిపోయాయని.. కొన్ని జలవనరులు ఆక్రమణలకు గురైనట్లుగా పేర్కొన్నారు. రోజువారీ అవసరాల కోసం 2600 ఎంఎల్ డీ నీళ్లకు గాను.. కావేరి నుంచి 1470 ఎంఎల్ డీ.. మరో 650 ఎంఎల్ డీను బోరు బావుల నుంచి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. జూన్ లో ప్రారంభమయ్యే కావేరీ పైప్ ప్రాజెక్టు ద్వారా నీళ్ల ఇక్కట్లు చాలావరకు తీరతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

నీటి సమస్యను అధిగమించేందుకు వీలుగా 313 చోట్ల కొత్త బోరు బావుల్ని తవ్విస్తామన్న సీఎం సిద్దరామయ్య.. నీళ్ల సరఫరాకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు చెందిన ట్యాంకర్లతో సహా అన్ని ప్రైవేటు ట్యాంకర్లను ఉపయోగించేలా చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. ఇప్పుడు జారీ చేసిన ఆదేశాలేవో.. నెల క్రితమే కళ్లు తెరిచి ఉంటే.. ఇప్పుడు ఎదుర్కొంటున్న విమర్శలు సగానికి పైనే తప్పేవి. అందుకే అంటారు చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవా అని.