Begin typing your search above and press return to search.

కర్ణాటకలో ఉన్నోళ్లంతా కన్నడ మాట్లాడాలి.. సీఎం కొత్త సూచన

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆ రాష్ట్రంలో నివాసం ఉండేవారికి ప్రత్యేక సూచన చేశారు

By:  Tupaki Desk   |   21 Jun 2024 4:11 AM GMT
కర్ణాటకలో ఉన్నోళ్లంతా కన్నడ మాట్లాడాలి.. సీఎం కొత్త సూచన
X

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆ రాష్ట్రంలో నివాసం ఉండేవారికి ప్రత్యేక సూచన చేశారు. కర్ణాటకలో నివాసం ఉండే వారంతా తప్పనిసరిగా కన్నడలో మాట్లాడాలని ఆయన కోరుతున్నారు. కన్నడ భాష.. ప్రాంతం.. నీటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి కన్నడ వాసికి ఉందన్న ఆయన.. రాష్ట్రంలో కన్నడ సంస్ర్కతి ప్రతిబింబించేలా ప్రయత్నం చేయాలని కోరుతున్నారు. కర్ణాటకలో నివసించే వారంతా కన్నడ భాషను నేర్చుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. కన్నడిగులు ఉదారంగా ఉంటారని.. కన్నడ రాకున్నా.. ఇతర భాషలు మాట్లాడేవారు కూడా స్వేచ్ఛగా కర్ణాటకలో నివసించే వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు. కన్నడ మీద ప్రేమ పెంచుకోవాలని.. ఇతర రాష్ట్రాల్లో మాదిరి మతోన్మాదులుగా మారకూడదన్నారు. ‘‘రాష్ట్రంలో కన్నడ కల్చర్ ప్రతిబింబించేలా కృషి చేయటం ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకు రాష్ట్రంలో ఉండే వారంతా కన్నడ నేర్చుకోవాలి. కన్నడ తప్ప మేరే భాష మాట్లాడకూడదని ప్రతిజ్ఞ చేయాలి’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యలు కొత్త అలజడికి కారణంగా మారతాయన్న మాట వినిపిస్తోంది. దీనికి కారణం.. తమిళులు.. కేరళీయుల మాదిరే కన్నడిగులు సైతం తమ ప్రాంతం మీద విపరీతమైన ప్రేమిభిమానాలు కలిగి ఉంటారు. సాత్వికంగా ఉంటారు కానీ.. తేడా వస్తే వారెలా మారతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అలాంటి వేళ.. కర్ణాటకలో ఉన్న వారంతా కన్నడంలో మాట్లాడాలన్న మాటను సున్నితంగా చెబుతున్నట్లు చెబుతూనే.. ‘‘రాష్ట్రంలో నివసించే వారంతా కన్నడ నేర్చుకోవాలి. కన్నడ తప్ప మరే భాష మాట్లాడకూడదని ప్రతిజ్ఞ చేయాలి’’ అనటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్న.

తమిళనాడు.. ఆంధ్రప్రదేశ్.. కేరళ రాష్ట్రాల్లోని వారంతా వారి మాతృభాషలోనే మాట్లాడతారని.. కర్ణాటకలో అలాంటి పరిస్థితి లేదంటూ చేసిన సీఎం సిద్ధూ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా చెప్పాలి. ఏపీ వరకు చూస్తే.. విశాఖపట్నంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు చాలా మంది నివసిస్తుంటారు. ఆ పట్టణంతో పాటు తిరుపతి ఒక్క పట్టణానికే వివిధ రాష్ట్రాలకు చెందిన యాత్రికులు వస్తారు. కొందరు ఉంటారు. అలాంటి వారందరికి వీలుగా తమిళం.. కన్నడం.. తెలుగు.. ఇంగ్లిషు.. హిందీ భాషల్ని మాట్లాడటం తెలిసిందే. అందుకు భిన్నంగా అనవసర భావోద్వేగాల్ని ఎగదోసే సిద్దూ మాటలు ఉన్నాయని చెప్పాలి.

దేశీయ ఐటీ రంగానికి బెంగళూరు ఒక ల్యాండ్ మార్కు. ఈ కారణంగానే బెంగళూరు మహానగరానికి దేశంలోని వివిధ రాష్ట్రాల వారు వచ్చి నివసిస్తూ ఉంటారు. అలాంటి లక్షలాది మందికి సీఎం సిద్దూ మాటలు ఇబ్బందికరంగా మారతాయని చెప్పాలి. కన్నడ లోనే మాట్లాడాలి.. కన్నడ తప్పనిసరిగా నేర్చుకోవాలన్న ఆయన వ్యాఖ్యలు బెంగళూరు ఇమేజ్ ను డ్యామేజ్ చేసే వీలుందని చెప్పాలి. ఇంతకూ సీఎం సిద్దరామయ్య ఈ వ్యాఖ్యలన్ని ఏ సందర్భంలో? ఎక్కడ మాట్లాడారు? అన్న విషయానికి వస్తే.. విధానసౌధలో ఏర్పాటు చేయనున్న నాదాదేవీ భువనేశ్వరి మాత విగ్రహ నిర్మాణానికి భూమిపూజ చేసిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దీని ప్రభావం రానున్న రోజుల్లో తప్పక ఉంటుందని చెప్పక తప్పదు.