Begin typing your search above and press return to search.

కర్ణాటకలో కిస్సా కుర్సీ కా.. అప్పుడే సీఎం కుర్చీపై కన్ను..

అసలే కాంగ్రెస్ పార్టీ.. అనేక వర్గాల సమాహారం. ఇంతలోనే సీఎంపై ఆరోపణలు రావడంతో ఏమైనా జరిగే చాన్సుంది.

By:  Tupaki Desk   |   22 Aug 2024 2:30 PM GMT
కర్ణాటకలో కిస్సా కుర్సీ కా.. అప్పుడే సీఎం కుర్చీపై కన్ను..
X

దక్షిణాదిలో కాస్త బలహీన రాజకీయాలు కర్ణాటకలోనే కనిపిస్తాయి. తమిళనాడులో అయితే డీఎంకే, అన్నాడీఎంకే, తెలంగాణలో బీఆర్ఎస్-కాంగ్రెస్, ఏపీలో వైసీపీ-టీడీపీ, కేరళలో లెఫ్ట్ ఫ్రంట్-కాంగ్రెస్ ఫ్రంట్.. వీటిలో ఒకటి కాకపోతే మరొకటి.. అన్నీ బలమైనమే.. కానీ, కర్ణాటకలో అలా కాదు. బీజేపీ ఎంత పటిష్ఠంగా ఉన్నా.. దాని సీఎంలపై కేసులు, ఆరోపణలు. జేడీఎస్ అటు సొంతంగా గెలవదు.. వేరేవారిని గెలవనివ్వదు.. ఇక కాంగ్రెస్ లోనూ అంతే.. సీఎం పదవి కోసం పోటీ.. దాదాపు ఏడాదిన్నర కింటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందగా.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లు సీఎం కుర్చీ కోసం ప్రధానంగా పోటీ పడ్డారు. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు కావడంతో పోటీ పడలేదేమో? చివరకు సిద్ధు-డీకే మధ్య రెండున్నరేళ్లు చొప్పున ఒప్పందం కుదిర్చారు. కానీ, ఇప్పుడు సీఎం సిద్దుపై గవర్నర్ విచారణకు ఆదేశించడంతో కథ మలుపు తిరిగింది.

మైసూర్ బోండాం దెబ్బకొడుతుందా?

మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా) వ్యవహారంలో సీఎం సిద్దు భార్య అనుచిత లబ్ధి పొందారంటూ వచ్చిన ఆరోపణల్లో సిద్దుపై గవర్నర్ అనూహ్య నిర్ణయం తీసుకోవడం గత వారం రాజకీయాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై కోర్టు సిద్దుకు తాత్కాలిక ఊరట కల్పించింది. అయితే, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్న కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు, ఆశావహులు సీఎం కుర్చీపై కన్నేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా అటు బీజేపీ, ఇటు జేడీఎస్ అనే రెండు పక్కలో బల్లెంలాంటి పార్టీలు పొంచి ఉన్నాయి.

అధిష్ఠానం పరిశీలనకు వ్యవహారాలు

అసలే కాంగ్రెస్ పార్టీ.. అనేక వర్గాల సమాహారం. ఇంతలోనే సీఎంపై ఆరోపణలు రావడంతో ఏమైనా జరిగే చాన్సుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అప్రమత్తమైంది. సిద్దు తరపున వాదనలకు ఆయన వర్గం రంగంలోకి దిగింది. మరోవైపు పార్టీలో ఎలాంటిది జరిగినా.. ఓ మంత్రి ద్వారా అధిష్ఠానానికి తెలిసేలా సిద్దు ఏర్పాట్లు చేశారు. మరోవైపు కోర్టులో సీఎం సిద్దుకు ఎదురుదెబ్బ తగిలి.. కేసు నమోదయ్యే అవకాశం ఉందనే కన్నడ మీడియా వర్గాలు ఓ కాంగ్రెస్ నేతను ఉటంకిస్తూ చెబుతున్నాయి. అందుకే సీఎం కుర్చీ కోసం ఢిల్లీ స్థాయిలో కసరత్తులు ప్రారంభిస్తారని పేర్కొంటున్నాయి.

రాజీనామా చేస్తారా?

మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను వేధిస్తున్నది అనేది కాంగ్రెస్ ఆరోపణ. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైలుకెళ్లినా రాజీనామా చేయలేదు. ఇండియా కూటమిలో ప్రధాన పార్టీ అయిన ఆప్ కు అండగా నిలుస్తోంది. ఇప్పుడు సిద్ధు విషయంలోనూ ఆయనపై కేసు నమోదైనా పెద్దగా భిన్నంగా ఏమీ ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సిద్దుకు అండగా నిలవాలని ఇప్పటికే పార్టీ నాయకులకు సూచించింది. మంత్రి సతీష్ జారకిహోళి ప్రకటన కూడా చేశారు. కర్ణాటకలో సిద్దు ప్రాబల్యం గల నాయకుడు. అహింద పేరుతో పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంకు నెలకొల్పారు. అందులోనూ జన గణన అంటున్న కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడైన సిద్దును తప్పిస్తుందా? తప్పించి అగ్రవర్ణ నాయకుడైన డీకే శివ కుమార్ నో మరొకరినో సీఎం చేస్తుందా? అనేది సందేహమే. అధికార మార్పిడికి పాల్పడడం ప్రతిపక్షాలకు అనవసర ఆరోపణలకు అవకాశం ఇచ్చినట్లు కూడా అవుతుంది.

తెలంగాణనే తర్వాతి టార్గెట్

బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం తెరవెనుక ఉండి గవర్నర్ ద్వారా కర్ణాటకలో రాజకీయం నడిపిస్తోందనేది కాంగ్రెస్ నాయకుల ఆరోపణ. బీజేపీ క్రీడలో చిక్కుకుని ఇప్పుడు సిద్దును మార్చితే.. అనంతరం తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారని కూడా వారు అంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ ఎలాంటి ఒత్తిళ్లకు లొంగదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.