Begin typing your search above and press return to search.

సిద్ధం... ప్రజాగళం...వేల కోట్లు ఖర్చునా ?

ఏపీలో ఎన్నికల ప్రచారం పీక్స్ కి చేరుకుంది. ఇక మూడంటే మూడు రోజులలో ప్రచారం ముగియనుంది

By:  Tupaki Desk   |   8 May 2024 11:26 AM GMT
సిద్ధం... ప్రజాగళం...వేల కోట్లు ఖర్చునా ?
X

ఏపీలో ఎన్నికల ప్రచారం పీక్స్ కి చేరుకుంది. ఇక మూడంటే మూడు రోజులలో ప్రచారం ముగియనుంది. ఈ నేపధ్యంలో రాజకీయ పార్టీలు అన్నీ జోరు పెంచాయి. వైసీపీ టీడీపీ కూడా పోటా పోటీగా సభలు పెడుతున్నాయి.

ఇదిలా ఉంటే జగన్ సిద్ధం అంటూ ఈ ఏడాది మొదట్లో భారీ సభలకు శ్రీకారం చుట్టారు. ఆ సభలు రీజియన్ల వారీగా జరిగాయి. ఇవి నాలుగు అతి పెద్ద సభలుగా జరిగాయి. ఆ తరువాత మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తూ రోజుకో సభను ఒక్కో ప్రాంతంలో నిర్వహించారు. అలా మరో ఇరవై సభల దాకా నిర్వహించారు. ఇపుడు ఎన్నికలు ముంగిటకు వచ్చిన వేళ గత నెల 28 నుంచి రోజుకు మూడు సభలు వంతున జగన్ నిర్వహిస్తున్నారు.

ఈ సభలు అన్నీ కలపి అరవై పై దాటి ఉంటాయని ఒక అంచనా మరి ఈ సభలకు జనాలు చూస్తే విరగబడి వస్తున్నట్లుగా టీవీ ఇతర మీడియా చానళ్ళలో ప్రచారం సాగుతోంది. అలా వచ్చిన వారు అంతా స్వచ్చందంగా వస్తున్నారా అంటే అభిమానులు క్యాడర్ వస్తారు కానీ సభలు పూర్తిగా కిటకిట లాడాలంటే జనాల తరలింపు తప్పనిసరి అని అంటున్నారు.

అలా చూస్తే కనుక వైసీపీ సిద్ధం సభలకు ప్రతీ మనిషికీ అయిదు వందల రూపాయలు వంతున చెల్లిస్తూ తీసుకుని వస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. మండుటెండల్లో సాగే ఈ సభలకు జనాలను తరలించడం అంటే ఎవరూ మాత్రం మామూలుగా అయితే రారు. వారికి డబ్బులు ఇస్తేనే వస్తారు అని అంటున్నారు.

అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో సభలను నిర్వహిస్తున్నారు. ఆ సభలకు కూడా జనాలను దగ్గరుండి తరలిస్తున్నారు అని అంటున్నారు. సభలకు ఇలా తీసుకుని రావడానికి తలా అయిదు వందల రూపాయలు అన్నది ఇక్కడ కూడా ఇస్తున్నారు అని అంటున్నారు.

సభలు అంతా కలర్ ఫుల్ గా కనిపించాలి, జనాలతో నిండిపోవాలి సభ సక్సెస్ అంటే ఇక ఆ పార్టీ విజయం సాధిస్తుంది అన్న సంకేతాలు జనంలోకి వెళ్తాయన్న ఉద్దేశ్యంతోనే ఈ జనాల తరలింపు అని అంటున్నారు. ఇలా సభలకు జనాలకు తేవడం అది కూడా పీక్ టైం లో తేవడంతో ఈ తరలింపునకు భారీ ఎత్తున ఖర్చు అవుతుంది అని అంటున్నారు.

దాంతో ఒక్కో సాభకే భారీ బడ్జెట్ సినిమా మాదిరిగా ఖర్చు పెడుతున్నారు అని అంటున్నారు. ఎన్నికల ప్రచారం కోసం పెట్టే ఖర్చు ఈసారి పీక్స్ కి వెళ్ళిపోయింది అని అంటున్నారు. మామూలుగా అయితే సభలకు జనాలను తేవడం అన్నది మామూలే అయినా అది ఒకటో రెండో సభలకు మాత్రమే అన్నట్లుగా ఉండేది.ఇపుడు అలా కాదు వరస సభలు పైగా పోటా పోటీ దాంతో జనాలు ఎంత డిమాండ్ చేసినా వారిని తీసుకుని వస్తున్నారు.

ఇక అలా మండుటెండలో వచ్చిన వారికి భోజనాలు మంచి నీరు, మగవారికి అయితే మందు వంటివి కూడా ఇస్తూ ఖుషామత్ చేస్తున్నారు అని అంటున్నారు. దాంతో ఈ నెల రోజుల పాటూ ఎన్నికల ప్రచారానికి వస్తున్న వారు బాగానే సంపాదిస్తున్నారు అని అంటున్నారు. ఉదయం ఒక పార్టీ మీటింగులో సాయంత్రం మరో పార్టీ మీటింగులో కూడా వారే కనిపిస్తున్నారు అంటేనే అర్ధం చేసుకోవాలి ఎన్నికల సభలకు వచ్చే జనాల వెనక ఉన్న డొల్లతనం అని అంటున్నారు.

ఇటీవల దీని మీద వీడియోలు కూడా వచ్చాయి. అవి సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. ఒక పార్టీ టోపీలు పెట్టుకుని జెండాలు పట్టుకుని హాజరయ్యే ఈ జెండా కూలీలు మరో పార్టీకి వెళ్ళినపుడు అదే జెండా తీసేసి టోపి మార్చేసి కనిపిస్తున్నారు. ఇక ఒక ఆటో డ్రైవర్ అయితే ఒక పార్టీ జెండాను పెట్టుకుని వెళ్తూ మరో పార్టీ పాటను తన ఆటోలో వినిపిస్తున్నాడు.

ఇలా ఈసారి ఎన్నికల చిత్రాలు చాలానే కనిపిస్తున్నాయి. నిజానికి చూస్తే ఈసారి ఎన్నికలు చాలా ఖరీదుగా మారిపోయాయని అంటున్నారు. అధికార వైసీపీకి అలాగే విపక్ష తెలుగుదేశానికి కూడా ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య కావడంతో ప్రజలకు తమ పార్టీయే గెలుపు గుర్రం అని చాటి చెప్పేందుకు ఇలా మీటింగుల మీద మీటింగులు పెడుతూ అందులో జనాలను పెద్ద ఎత్తున చూపిస్తూ వాటిని డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరిస్తూ తన అనుకూల మీడియాలలో పదే పదే చూపిస్తూ ఎంత చేయాలో అంతా చేస్తున్నారు అని అంటున్నారు.

మామూలుగా అయితే ఒక పార్టీ ఎన్నికల ప్రచారం ఖర్చు గడచిన ఎన్నికల దాకా మొత్తం ఖర్చులో ఏ ముప్పయి శాతమో నలభై శాతమో ఉండేది. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం ఏకంగా ఎనభై శాతానికి పై దాటిపోతోంది అని అంటున్నారు. ఈ ఖర్చులు అన్నీ ఆయా పార్టీల తరఫున పోతీచేసే అభయ్ర్ధులే పెట్టుకుంటున్నారు.

దాంతో వారి ఖర్చులూ అమాంతం పెరిగిపోతుండటంతో ఎన్నిక ఎన్నికకూ కోట్లను ఎక్కడ నుంచి తేవాలన్న చర్చ కూడా సాగుతోంది. ఈసారి ఎన్నికల్లో మాత్రం ఎమ్మెల్యే అభ్యర్ధి పెట్టే ఖర్చు యాభై నుంచి అరవై కోట్ల దాకా ఉంటోంది అంటే కనుక ఇంతటి ఖరీదు అయిన ఎన్నికల్లో సామాన్యుడు పోటీ చేయడం సాధ్యమేనా అన్నదే మేధావులను దొలిచేస్తున్న ప్రశ్నగా ఉంది.