Begin typing your search above and press return to search.

సిద్దిపేట జిల్లాలో షాకింగ్: బాలికపై రే*ప్.. ఇంటిని తగలబెట్టేసిన గ్రామస్తులు

షాకింగ్ పరిణామం ఒకటి సిద్దిపేట జిల్లా చేర్యాల పోలీస్ సర్కిల్ లో చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   30 Sep 2024 4:27 AM GMT
సిద్దిపేట జిల్లాలో షాకింగ్: బాలికపై రే*ప్.. ఇంటిని తగలబెట్టేసిన గ్రామస్తులు
X

షాకింగ్ పరిణామం ఒకటి సిద్దిపేట జిల్లా చేర్యాల పోలీస్ సర్కిల్ లో చోటు చేసుకుంది. ఐదో తరగతి చదివే బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటం చూసిన పక్కింటి కుర్రాడు.. ఇంట్లోకి వెళ్లి బాలికను రేప్ చేశాడు. ఈ వ్యవహారంకాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. జరిగిన దారుణంపై సదరు గ్రామం మొత్తం సీరియస్ కావటమేకాదు.. సదరు ఇంటికి నిప్పు పెట్టిన వైనం సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే..

సిద్దిపేట జిల్లా చేర్యాల పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిదిలోని పదకొండేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. కొమురవెల్లి మండలంలోని ఒక గ్రామానికి చెందిన బాలిక ఇప్పుడు ఐదో తరగతి చదువుతోంది. రాత్రి వేళలో ఆమె ఒక్కతే ఇంట్లో ఒంటరిగా ఉందన్న విషయాన్ని గుర్తించి.. పక్కింటి యువకుడు 21 ఏళ్ల షరీవుద్దీన్ ఇంట్లోకి వెళ్లాడు.

బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనపై జరిగిన లైంగిక దాడి గురించి ఇంట్లోని వారికి చెప్పింది. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఆ రాత్రే పోలీసుల వద్దకు వెళ్లి.. జరిగిన దారఉనం గురించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. దీంతో.. స్పందించిన పోలీసులు వెంటనే ఫోక్సో కేసు నమోదు చేసి.. అర్థరాత్రి సమయంలోనే నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. జరిగిన ఉదంతం గురించి తెలుసుకున్న నిందితుడి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి.. ఉరు వదిలి పారిపోయారు.

ఈ వ్యవహారం ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో.. బాధితురాలి కుటుంబానికి గ్రామం మొత్తంఅండగా నిలిచింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. బాధితురాలికి జరిగిన అన్యాయంపై గ్రామస్తుల్ని తీవ్రంగా కలిచివేసింది అందరూ కలిసి నిందితుడి ఇంటి వద్దకువెళ్లారు. అప్పటికే అక్కడ పోలీసులు మోహరింపు ఉన్నప్పటికి గ్రామస్థులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. నిందితుడి ఇంటికి నిప్పు పెట్టటమేకాదు.. బయట నిలిపిన కారును ధ్వంసం చేశారు. మంటల ధాటికి ఇంటి ముందు కట్టిన పరదాలు దగ్ధమయ్యాయి. గ్రామస్తుల్ని శాంతింపచేసే విషయంలో పోలీసులు నానా పాట్లు పడ్డారు.

జరిగిన ఘటన గురించి సమాచారం అందుకున్న హుస్నాబాద్ ఏసీపీ సతీష్ తో బలగాలతో ఘటనా స్థలానికి వెళ్లి.. మంటల్లో దగ్ధమవుతున్న ఇంటి మంటల్ని ఆర్పేశారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో గ్రామస్థులు శాంతించారు. బాలికపై అత్యాచార ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ఒక యువకుడిపై కేసు.. రౌడీషీట్ ఓపెన్ చేశారు. మరో తొమ్మిది మందిపై శాంతిభద్రతలకు విఘాతం కలిగించారంటూ కేసులు నమోదు చేశారు. ఈ మొత్తం వ్యవహారం సిద్ధిపేట జిల్లాలో పెను సంచలనంగా మారింది.