Begin typing your search above and press return to search.

మద్యం దుష్ప్రభావాలకు చెక్‌... సగం గుడ్ న్యూస్ చెప్పిన శాస్త్రవేత్తలు!

ఈ నేపథ్యంలో... తాజాగా ఈ సమస్య పరిష్కారం కోసం స్విట్జర్లాండ్ లోని ఈటీహెచ్ జ్యూరిక్ శాస్త్రవేత్తలు ఒక ఆలోచన చేశారు. ఆ ఆలోచన ప్రతి రూపమే తాజాగా కనుగొన్న జెల్.

By:  Tupaki Desk   |   14 Jun 2024 2:30 AM GMT
మద్యం దుష్ప్రభావాలకు చెక్‌... సగం గుడ్  న్యూస్  చెప్పిన శాస్త్రవేత్తలు!
X

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయం తెలిసినప్పటికీ.. ఆ అలవాటు నుంచి, ఆ బలహీనత నుంచి బయటకు రాలేరు చాలా మంది! ఈ గ్యాప్ లో ఆల్కహాల్ వల్ల శరీరంపై పడే దుష్ప్రభావాలకు చెక్ పెట్టే క్రమంలో వినూత్న ఆలోచన చేశారు శాస్త్రవేత్తలు. ఇందులో భాగంగా ఒక ప్రోటీన్ జెల్ ను స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఆ జెల్ ఏమిటి.. ప్రయోగం ఏ దశలో ఉంది.. ఎలా పని చేస్తుంది.. అనేది ఇప్పుడు చూద్దాం...!

అవును... శరీరంలోకి ప్రవేశించిన మద్యం ప్రమాదకరమైన ఎసిటాల్డిహైడ్ గా మారకముందే... దాన్ని అపాయంలేని ఎసిటిక్ యాసిడ్ గా మార్చేసే ఒక జెల్ ను స్విస్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వాస్తవానికి మనిషి తీసుకున్న ఆహారం జీర్ణవాహికలో నిదానంగా జీర్ణమవుతుంది కానీ... మద్యం మాత్రం నెమ్మదిగా కాకుండా.. జీర్ణవాహిక గోడలపై ఉండే పొరల గుండా రక్తంలోని ప్రవేశించి.. ఆ రక్తకణాల ద్వారా శరీరమంతా వేగంగా వ్యాపిస్తుంది.

అలా రక్తంలోకి చేరిన ఆల్కహాల్ ను కాలేయం అసిటాల్డి హైడ్ గా మారుస్తుంది. అది కాసేపటికి ఎలాంటి ప్రమాదం లేని అసిటిక్ యాసిడ్ గా మారుతుంది. అయితే ఈ లోపే అసిటాల్డిహైడ్ మనిషి శరీరానికి తీవ్ర హాని చేస్తుంది. ఈ నేపథ్యంలో... తాజాగా ఈ సమస్య పరిష్కారం కోసం స్విట్జర్లాండ్ లోని ఈటీహెచ్ జ్యూరిక్ శాస్త్రవేత్తలు ఒక ఆలోచన చేశారు. ఆ ఆలోచన ప్రతి రూపమే తాజాగా కనుగొన్న జెల్.

ఇందులో భాగంగా... తీసుకున్న ఆల్కహాల్ శరీరంలోకి ప్రవేశించి, అక్కడ నుంచి రక్తం లోకి ప్రవేశించి, ఆపై అసిటాల్డిహైడ్ గా మారకుండా నేరుగా అసిటిక్ యాసిడ్ గా మారిపోయేలా మద్యం మత్తును, ఇతర దుష్ప్రభావాలను అరికట్టేలా ఒక జెల్ ను రూపోందించారు. ఈ ప్రయోగంలో భాగంగా... ఈ జెల్ ను రెండు గూరుపుల ఎలుకలపై ప్రయోగించారట శాస్త్రవేత్తలు.

వీటిలో ఒక గ్రూపు ఎలుకలకు ఒక్కసారి మాత్రమే మద్యం తాగించి ఉంచారు. మరో గ్రూపులోని ఎలుకలకు పది రోజుల పాటు మద్యం తాగించారు. ఇందులో ఒక్కసారి మద్యం తాగించిన ఎలుకలకు ఈ జెల్ ను ఇచ్చి అరగంట తర్వాత పరీక్ష చేయగా... వాటిలో ఆల్కహాల్ ఎఫెక్ట్ 40% తగ్గిందంట. ఐదు గంటల తర్వాత పరీక్ష చేయగా.. 56% తగ్గినట్లు వెల్లడైందని చెబుతున్నారు.

ఇదే క్రమంలో పదిరోజుల పాటు ఆల్కహాల్ ఇచ్చిన ఎలుకలకు ఈ జెల్ ఇవ్వగా.. అది మద్యం వల్ల కలిగే దుష్ప్రభావాలను బాగా తగ్గించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ జెల్ ప్రభావం మనుషులపై ఎలా ఉంటుందో అనే పరీక్షలు జరపాల్సి ఉందని అంటున్నారు. ఈ జెల్ మానవులకు కూడా సక్సెస్ ఫుల్ గా పనిచేస్తే... మద్యపాన అలవాటు వల్ల సంభవిస్తున్న మరణాలకు చెక్ పెట్టొచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.