గిన్నీస్ రికార్డ్... మనోడు “పంచింగ్” ఫలక్ నుమా!
పూమ్సే కేటగిరీలో యుఎస్ ఓపెన్ టైక్వాండో ఛాంపియన్ షిప్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 42 ఏళ్ల సిద్ధూ క్షేత్రి గిన్నీస్ రికార్డ్ సాధించాడు.
By: Tupaki Desk | 11 Jan 2024 4:17 AM GMTపూమ్సే కేటగిరీలో యుఎస్ ఓపెన్ టైక్వాండో ఛాంపియన్ షిప్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 42 ఏళ్ల సిద్ధూ క్షేత్రి గిన్నీస్ రికార్డ్ సాధించాడు. 32 కు పైగా దేశాలు పాల్గొన్న ఈ టోర్నమెంట్ లో సిద్ధూ గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా టోర్నమెంట్ లో సిద్ధూ ఆటతీరు నిష్కళంకమైనది, స్పూర్తివంతమైనది అని భావిస్తూ... టోర్నమెంట్ కమిటీ అతనికి "స్పిరిట్ అవార్డు" ఇచ్చింది.
అవును... యూఎస్ ఓపెన్ టైక్వాండో ఛాపియన్ షిప్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధు క్షేత్రి గిన్నిస్ రికార్డు సాధించారు. మార్షల్ ఆర్టిస్ట్ అయిన సిద్ధు పంచింగ్ బ్యాగ్ పై 55 గంటల 15 నిమిషాల పాటు నాన్ స్టాప్ గా పంచులు వేశారు. నిబంధనల ప్రకారం ప్రతి సెకనుకు కనీసం ఒక పంచ్ వేయాల్సి ఉంటున్న క్రమంలో... ఐదు నిమిషాలు ఎక్కువగా శ్రమించి గతంలో ఉన్న రికార్డును బద్దలు కొట్టారు.
వాస్తవానికి గతంలోనూ సిద్ధు రెండు సార్లు గిన్నిస్ రికార్డు సాధించారు. ఇందులో భాగంగా 2011లో నిమిషంలో 168 కిక్కులిచ్చి రికార్డు సృష్టించిన ఆయన... 2013లో ఒంటి కాలితో మూడు నిమిషాల్లో 620 కిక్కులిచ్చి సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. ఇతడు ప్రస్తుతం టెక్ మహీంద్రాలో టెక్నికల్ డెలివరీ మేనేజర్ గా పని చేస్తున్నారు. ఈ సమయంలో ఇతడి అంతర్జాతీయ ఈవెంట్ లకు టెక్ మహీంద్రా ఎల్లప్పుడూ మద్దతునిస్తూ స్పాన్సర్ చేస్తుంది.
ఈ విషయాలపై స్పందించిన సిద్ధూ... తాను సాధించే రికార్డ్స్ వెనకున్న క్రెడిట్ మొత్తం తన పెద్ద అన్న శంకర్ క్షేత్రికి ఇస్తున్నట్లు చెప్పాడు. అతను ఎల్లప్పుడూ తనకు మద్దతుగా నిలిచాడని, నిత్యం మార్గనిర్దేశం చేస్తుంటాడని తెలిపారు. చిన్నప్పుడు స్కూల్ దశనుంచీ తనకి శంకర్ క్షేత్రీనే తైక్వాండో నేర్పించడం ప్రారంభించాడని చెబుతుంటాడు.
ఇదే సమయంలో... మార్షల్స్ ఆర్ట్స్ పై ఉన్న ఆసక్తితో సుమారు 25 ఏళ్లుగా సాధన చేస్తున్నట్లు తెలిపిన సిద్ధూ... అన్ని గంటల పాటు నిద్రలేకుండా శ్రమించడం చాలా కష్టం అయినప్పటికీ... కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రోత్సాహంతో ఇదంతా సాధ్యమైందని చెబుతున్నాడు. ఈ సందర్భంగా దేశానికి తన వంతు సహకారం అందించాలనుకుని పట్టుదలతో ప్రపంచ రికార్డు కోసం శ్రమించినట్లు తెలిపారు.