పలాస పాలిటిక్స్ : సీదరి ఏదరికి ...?
శ్రీకాకుళం జిల్లాలో ఇపుడు ఒక అసెంబ్లీ సెగ్మెంట్ హాట్ హాట్ పాలిటిక్స్ తో అట్టుడుకుతోంది.
By: Tupaki Desk | 6 Aug 2024 3:58 AM GMTశ్రీకాకుళం జిల్లాలో ఇపుడు ఒక అసెంబ్లీ సెగ్మెంట్ హాట్ హాట్ పాలిటిక్స్ తో అట్టుడుకుతోంది. ఒక ఘనమైన రాజకీయ కుటుంబం వర్సెస్ రాజకీయంగా కొత్తగా వచ్చి మంత్రిగా చేసి తాజాగా మాజీ అయిన మంత్రి గారికి మధ్య రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. సీదరి అప్పలరాజు వర్సెస్ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషగా పాలిటిక్స్ దూకుడు మీద కొనసాగుతోంది.
గత అయిదేళ్ళలో టీడీపీని ముప్పతిప్పలు సీదరి పెట్టారని దానికి ఇపుడు ఇదిగో చూస్కో అంటూ శిరీష మొదలెట్టిన రివెంజ్ పాలిటిక్స్ తో సీదరికి ఏదీ దరి అన్న చర్చ సాగుతోంది. రాజకీయంగా బ్యాక్ గ్రౌండ్ ఏదీ లేని ఒక సాధారణ డాక్టరు 2017లో జగన్ పాదయాత్ర సమయంలో వెంట నడచి టికెట్ సాధించారు. ఆ తరువాత ఏడాది వ్యవధిలో మంత్రి కూడా అయిపోయారు.
అసలే యువకుడు దానికి తోడు దూకుడు జతకలిసి గౌతు ఫ్యామిలీ ని కట్టడి చేసే ప్రయత్నాలు ఆయన గట్టిగానే చేశారు. గౌతు లచ్చన్న నుంచి రాజకీయంగా ఉంటూ వస్తున్న ఆ కుటుంబం వైసీపీ ఏలుబడిలో చాలా ఇబ్బందుల్లో పడింది. అయితే 2024 ఎన్నికల్లో శిరీష కూటమి ప్రభంజనంలో మంచి విజయం సాధించారు.
ఆ వెంటనే ఆమె సీదరిని టార్గెట్ చేశారు. ఈ క్రమంలో రెండు నెలల తేడాలో రెండు కేసులు సీదరి మీద పడ్డాయి. ఇపుడు సీదరి అధికారంలో ఉన్నపుడు చేసిన అక్రమాలు అవినీతిని బయటకు తీస్తామని శిరీష వర్గం గట్టిగానే చెబుతోంది. రానున్న రోజులలో ఇక చుక్కలే చూపిస్తామని ఎమ్మెల్యే వర్గీయులు హెచ్చరిస్తున్నారు.
అయితే దీనికి సీదరి ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. చూసుకుందామనే ఆయన ప్రతి సవాల్ చేస్తున్నారు. తాను మంత్రిగా ఉన్నపుడు ఒక్క కేసు కూడా శిరీష మీద పెట్టలేదని ఆయన అంటున్నారు. కానీ రివెంజ్ పాలిటిక్స్ ని నడుపుతున్నారని ఇది ఎంత దాకా సాగినా తాను కూడా రెడీనే అని ఆయన అంటున్నారు.
తాను ఏమీ తప్పు చేయలేదని దేనికి భయమని ఆయన అంటున్నారు. తన మీద ఏదో విధంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని అయినా తాను తగ్గేదేలే అని సీదరి చెబుతున్నారు కేవలం సీదరితో మాత్రమే కాకుండా ఆయన అనుచరుల మీద కూడా కేసులు పెట్టేందుకు టీడీపీ సిద్ధమైపోతోంది.
మందస పలాస వజ్రపు కొత్తూరులలో ఉనన్ మాజీ మంత్రి ప్రధాన అనుచరుల మీద కేసులు పెట్టబోతున్నారు అని అంటున్నారు. అయితే ఏ ఒక్కరూ భయపడనవసరం లేదని విపక్షంలో ఉన్నపుడు త్యాగాలకు సిద్ధపడాల్సిందే అని సీదరి అనుచరులకు చెబుతున్నారుట. అయితే ఎంతమంది కూటమి ప్రభుత్వం ధాటిని తట్టుకుని కేసులు పెట్టించుకుంటారని అంటున్నారు. అలాగే ఎందరు జైలుకు వెళ్ళి త్యాగం చూపిస్తారు అని కూడా సందేహాలు వస్తున్నాయి. ఇది పూర్వకాలం రాజకీయం కాదు, ఓడిన పార్టీలో ఉంటూ పోరాటాలు చేయడానికి.
దాంతో సీదరి మంత్రిగా ఉన్నపుడే పలాసలో వైసీపీ వర్గాలుగా విడిపోయింది. ఇపుడు ఆయన అనుచరులు కూడా కేసులకు జంకి వెనక్కి తగ్గితే సీదరి ఇబ్బందులో పడతారు అని అంటున్నరు. ఇక సిక్కోలులో వైసీపీ జిల్లా నేతలు పార్టీని పెద్దగా పట్టించుకోవడం మానేశారు అన్న ఆరోపణలు ఉన్నాయి. అంతా సైలెంట్ గా ఉన్నారు. దాంతో ఎవరి పాట్లు వారు పడాల్సిందే అని అంటున్నారు. చూడాలి పలాస పాలిటిక్స్ ఏ కంచికి చేరుతుందో.