ప్రమాణ స్వీకారం మరుసటి రోజే ఎమ్మెల్యే పదవికి .. !
సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ సతీమణి కృష్ణకుమారి రాయ్ గురువారం తన ఎమ్మెల్యే పదవికి హఠాత్తుగా రాజీనామా చేశారు.
By: Tupaki Desk | 14 Jun 2024 9:29 AM GMTసిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ సతీమణి కృష్ణకుమారి రాయ్ గురువారం తన ఎమ్మెల్యే పదవికి హఠాత్తుగా రాజీనామా చేశారు. ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే ఆమె ఎందుకు రాజీనామా చేశారో కారణాలు వెల్లడి కాలేదు. ఆమె రాజీనామాను స్పీకర్ ఎంఎన్ షెర్పా ఆమోదించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె నంచిసింగితాంగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు.
ముఖ్యమంత్రిగా పెమా ఖండూ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు అరుణాచల్ ప్రదేశ్‌కు వెళ్లిన సీఎం ప్రేమ్‌సింగ్ తన భార్య రాజీనామాపై ఫేస్‌బుక్‌లో స్పందించారు. పార్టీ సంక్షేమం, లక్ష్యాలకు ప్రాధాన్యం ఇస్తూ పార్టీ ఏకగ్రీవ నిర్ణయంతో కృష్ణకుమారి రాయ్ తన స్థానాన్ని ఖాళీ చేశారని ఆయన తెలిపారు. తనతో పాటు మేడం కృష్ణరాయ్ సైతం ప్రజాసేవలో పూర్తిగా అంకితమవుతారని, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని, అక్కడ ఎన్నికైన కొత్త అభ్యర్థికి పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీనిచ్చారు.
సిక్కిం క్రాంతికారి మోర్చా నుండి నచిసింగితాంగ్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన కృష్ణకుమారి రాయ్ సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి బిమల్ రాయ్ పై 5302 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. కృష్ణకుమారి 7907 ఓట్లు సాధించగా, బిమల్ రాయ్ 2605 ఓట్లు సాధించాడు.