Begin typing your search above and press return to search.

సైలంట్ కిల్లర్... ఐదుగురికి విషం పెట్టి చంపిన ఇంటి కోడలు!

మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందిన సంఘమిత్ర అనే మహిళకు తన భర్త, అత్తమామల తీరు నచ్చలేదు.

By:  Tupaki Desk   |   19 Oct 2023 8:41 AM GMT
సైలంట్  కిల్లర్... ఐదుగురికి విషం పెట్టి చంపిన ఇంటి కోడలు!
X

సినిమాల్లో కూడా ఎప్పుడూ కనిపించలేదు అనే స్థాయి ఘటన ఒకటి తాజాగా ముంబయిలో జరిగింది. ఒక కుటుంబంపై కక్ష గట్టిన ఇద్దరు మహిళలు ఆ కుటుంబం మొత్తాన్ని అంతమొందించాలని ప్లాన్ చేశారు. అనుకున్నట్లుగానే 20 రోజుల్లో ఆ కుటుంబంలో ఐదుగురిని అంతమొందించారు. స్థానికంగా అత్యంత హాట్ టాపిక్ గా మారిన ఈ సీరియల్ కిల్లింగ్ వ్యవహారం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందిన సంఘమిత్ర అనే మహిళకు తన భర్త, అత్తమామల తీరు నచ్చలేదు. ఇదే సమయంలో రోసా అనే మరో మహిళకు ఆ కుటుంబంతో ఆస్తి తగాదాలు ఉన్నాయి. దీంతో... ఇద్దరూ చేతులు కలిపారు. అనంతరం ఆ కుటుంబాన్ని అంతమొందించాలని ఫిక్సయ్యారు. దీనికోసం రుచి, వాసన లేని ఓ నాటుమందును సేకరించారు.

ఈ క్రమంలో సెప్టెంబరు 20న ఈ మేరకు పని ప్రారంభించారు. ఇందులో భాగంగా... శంకర్‌ కుంభారే, అతని భార్య విజయ తినే ఆహారంలో ఆ మందును కలిపారు. అది తిన్న కాసేపటికి వారికి తీవ్రమైన ఒళ్లునొప్పులు వచ్చాయి. ఆపైన గుండెనొప్పి కూడా వచ్చింది. దీంతో వారిని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఈ క్రమంలో... సెప్టెంబరు 26న శంకర్‌ మరణించారు. ఆ మరుసటిరోజే అతని భార్య విజయ కూడా చనిపోయింది.

అలా ఇద్దరి ప్రాణాలు తీసుకున్నారు ఆ జంట మహిళలు. అనంతరం శంకర్‌ దంపతుల కుమార్తెలు కోమల్‌, ఆనంద.. కుమారుడు రోషన్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారి బంధువులు వీరిని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో అక్టోబరు 8న కోమల్‌ చనిపోగా.. 14న ఆనంద చనిపోయారు. అనంతరం మరుసటిరోజు అక్టోబర్ 15న రోషన్‌ కన్నుమూశాడు. ఇలా సుమారు 20 రోజుల వ్యవదిలో ఆ ఇంట్లోని ఐగురు మృతి చెందారు.

అయితే... ఈ ఐదుగురి మరణాల్లోనూ... అవయవాల జలదరింపు, తలపోటు, తీవ్రమైన వెన్నునొప్పి, పెదవులు నల్లగా మారడం, నాలుక మొద్దుబారడం వంటి లక్షణాలను వైద్యులు గుర్తించారట. దీంతో... వీరంతా విషప్రభావానికి గురై ఉంటారని గ్రహించారు. ఇదే విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.

దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా మృతుడు రోషన్‌ భార్య అయిన సంఘమిత్రపై నిఘా ఉంచారు. అనంతరం అసలు విషయాలు రాబట్టారని తెలుస్తుంది. చనిపోయిన విజయకు మరదలి వరస అయ్యే రోసా... వీరి ఇంటికి సమీపంలోనే ఉంటుందట. రోసా భర్త పూర్వీకుల ఆస్తిని విజయ, ఆమె సోదరీమణులతో పంచుకోవడంపై ఆమెకు విభేదాలున్నాయట.

దీంతో ఈమె సంఘమిత్రతో చేతులు కలిపింది. ఈ సమయంలో ఆ కుటుంబాన్ని ఎలాగైనా అంతమొందించాలని ప్లాన్ చేశారంట. దీంతో ఆన్‌ లైన్‌ లో ఏదైనా విషం దొరుకుతుందేమోనని సెర్చ్ చేశారంట. ఆ తరవాత రోసా ఓ ప్రాంతానికి వెళ్లి అక్కడనుంచి అంతుచిక్కని మిశ్రమాన్ని సేకరించి తీసుకొచ్చిందట. ఇది ఎలాంటి రుచి, ఏ విధమైన వాసన లేనిది కావడం గమనార్హం. దీన్ని ఆ కుటుంబ సభ్యులు తినే ఆహారంలో కలిపి ఇచ్చారట! దీంతో... సంఘమిత్ర, రోసాలను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.