ప్రపంచానికి కొత్త సమస్య... ఏమిటీ సిల్వర్ సునామీ?
ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు అధిక జనాభా పెద్ద సమస్యగా ఉండేది.
By: Tupaki Desk | 28 Sep 2024 5:57 AM GMTఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు అధిక జనాభా పెద్ద సమస్యగా ఉండేది. ఆ సమయంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ప్రభుత్వాలు బలంగా ప్రోత్సహించేవి. అధికంగా పెరుగుతున్న జనాభా వల్ల పేదరికం విస్తరిస్తుందనే కామెంట్లు అప్పట్లో ఎక్కువగా వినిపించేవి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రపంచానికి సిల్వర్ సునామీ సమస్య ఎదురవుతుంది.
అవును... ప్రపంచ వ్యాప్తంగా జనాభా వృద్ధిరేటు నెమ్మదిస్తుంది. పలు దేశాల్లో యువత పెళ్లిల్లు చెసుకోవడానికి, పిల్లలను కనడానికి పూర్తిగా వెనకాడుతుందని అంటున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఈ విధంగా... యువతరం సంఖ్య తగ్గి, వయోధికుల సంఖ్య పెరుగుతున్న ఈ పరిణామానికి "సిల్వర్ సునామీ"గా నామకరణం చేశారు ఆర్థిక శాస్త్రవేత్తలు.
ప్రస్తుతం ప్రపంచదేశాలకు ఈ సిల్వర్ సునామీ సమస్య పెద్దగా మారబోతోంది. కారణం... ప్రపంచ వ్యాప్తంగా వయోధికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంటున్నారు. 2022 ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం... ప్రపంచంలో సుమారు 77.1 కోట్ల మంది 65 ఏళ్లు పైబడినవారే ఉన్నారు. అంటే ప్రపంచంలోని మొత్తం జనాభాలో వీరి వాటా సుమారు 10% అన్నమాట!
అయితే... ఈ సంఖ్య రానున్న రోజుల్లో మరింతగా పెరగబోతోందని.. ఈ పెరుగుదల 2050 నాటికి 16 శాతంగా 2100 నాటికి 24 శాతంగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే ఇటలీ, జపాన్, ఫిన్లాండ్ వంటి దేశాల్లో 65 ఏళ్లు పైబడివారి సంఖ్య భారీగా ఉంది. ఇందులో భాగంగా... జపాన్ లో వీరి సంఖ్య అత్యధికంగా సుమారు 30శాతం ఉందని చెబుతున్నారు.
ఇదే సమయంలో ఇటలీలో 24 శాతం, ఫిన్లాండ్ లో 23 శాతంగా 65 ఏళ్లు పైబడినవారి సంఖ్య ఉందని అంటున్నారు. ప్రస్తుతానికి ఆసియా, ఆఫ్రికా దేశాల్లో మాత్రం వీరి సంఖ్య 2% కంటే తక్కువే నమోదవుతోందని చెబుతున్నారు. అయితే ముందు ముందు మాత్రం కచ్చితంగా పెరుగుతుందని అంచనావేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే వచ్చె 30 ఏళ్లలోనే ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాల్లో ప్రతీ నలుగురిలో ఒకరు 65 ఏళ్లు పైబడినవారే ఉంటారని చెబుతున్నారు.
భారత్ లో పరిస్థితి..?:
ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఉన్న భారత్ లో.. అత్యధిక యువశక్తి ఉన్నారు. దీంతో... ఇప్పటికిప్పుడు భారత్ కు ఈ సిల్వర్ సునామీ సమస్య లేదనే చెప్పాలి. అయితే... జనాభా పెరుగుదల రేటు తగ్గుదల నేపథ్యంలో 2050 నాటికి ఇప్పటికే జపాన్, ఐరోపాలు ఎదుర్కొంటున్న ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తునారు.
భారత్ లో ప్రస్తుతం 60 ఏళ్లు పైబడినవారి సంఖ్య సుమారు 10 కోట్ల వరకూ ఉందని.. ఈ సంఖ్య 2050 నాటికి 24 కోట్లకు చేరుకుంటుందని.. ఈ క్రమంలో 2100కల్లా ఆ సంఖ్య మూడింతలు అవుతుందని అంచనావేస్తున్నారు.