Begin typing your search above and press return to search.

పాలిటిక్స్..జ్యుడీషియరీ..స్పోర్ట్స్..సింధు మెట్టినిల్లు గట్టిదే!

సింధు వివాహం ఈ నెల 22న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరగనుంది. అయితే, వీరి వివాహ ముహూర్తం నెల రోజుల ముందే నిశ్చయమైంది.

By:  Tupaki Desk   |   4 Dec 2024 2:30 PM GMT
పాలిటిక్స్..జ్యుడీషియరీ..స్పోర్ట్స్..సింధు మెట్టినిల్లు గట్టిదే!
X

భారత బ్యాడ్మింటన్ కు దశాబ్ద కాలంగా కేరాఫ్ అడ్రస్ గా ఉన్న తెలుగమ్మాయి పూసర్ల వెంకట (పీవీ) సింధు త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. రెండుసార్లు భారత దేశానికి ఒలింపిక్ పతకం అందించిన ఘనతను సొంతం చేసుకున్న సింధు.. హైదరాబాద్‌ లో స్థిరపడిన వెంకట దత్త సాయిని వివాహం చేసుకోనుంది. ఇప్పటికే అతడి గురించి కొన్ని వివరాలు తెలిసినా.. వెంకటసాయి కుటుంబ నేపథ్యం ఏమిటా? అని అందరూ ఆసక్తి చూపుతున్నారు. అలా చూస్తే.. సింధు రికార్డులకు తగిన నేపథ్యం ఉన్న కుటుంబంగా తేలింది.

సింధు వివాహం ఈ నెల 22న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరగనుంది. అయితే, వీరి వివాహ ముహూర్తం నెల రోజుల ముందే నిశ్చయమైంది. ఈ నెల 24న హైదరాబాద్ లో రిసెప్షన్ జరగనుంది. ప్రైవసీ కోసం వివాహాన్ని ఇరువైపుల నుంచి అతి కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో జరపుకోనున్నారు. రిసెప్షన్ కు అందరినీ ఆహ్వానించనున్నారు.

వెంకట్.. ఆంత్రప్రెన్యూర్ వెంకట దత్త సాయి బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్, డేటా సైన్స్‌ లో ఉన్నత విద్య చదివారు. ఈయన తండ్రి గౌరెల్లి వెంకటేశ్వరరావు ఆదాయపు పన్ను శాఖ మాజీ అధికారి. ప్రోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ ను ఈయనే నెలకొల్పారు. వెంకట్ దానికి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గా ఉన్నారు. జిందాల్‌ సౌత్‌ వెస్ట్‌ (జేఎస్‌డబ్ల్యూ)తో ప్రొఫెషనల్‌ కెరీర్‌ ప్రారంభించి వెంకట్ ఆ సంస్థ కో ఓనర్ అయిన ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ వ్యవహారాలను పర్యవేక్షించారు.

అయితే, దేశంలోనే అత్యంత ప్రముఖ క్రీడాకారిణిని వివాహం చేసుకోనున్న ఆయన బ్యాడ్మింటన్ ఆడకున్నా.. మోటార్‌ స్పోర్ట్స్‌ లో ప్రవేశం ఉంది. డర్ట్‌ బైకింగ్ (మట్టిలో బైక్ పోటీలు), మోటార్‌ ట్రెక్కింగ్‌ లో పాల్గొంటారు. వెంకట్ దగ్గర డజను సూపర్‌ బైక్స్‌, కొన్ని స్పోర్ట్స్‌ కార్లూ ఉన్నాయట.

మామగారు ఐటీ అధికారి..

గౌరెల్లి వెంకటేశ్వరరావు ఐటీ మాజీ అధికారి కాగా, వెంకట దత్త సాయి తల్లి లక్ష్మి తండ్రి భాస్కరరావు హైకోర్టు మాజీ జడ్జి. కాగా, ఈయన అన్న ఉజ్జిని నారాయణరావు సీపీఐ నుంచి నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యేగా పనిచేశారు.

కాగా, పెళ్లయిన వెంటనే సింధు జనవరి నుంచి మొదలయ్యే కొత్త సీజన్‌ కు అందుబాటులో ఉండనుంది. అన్ని ప్రధాన టోర్నీల్లో బరిలో దిగుతానని తెలిపింది. ఇటీవలే ఆమె ప్రతిష్ఠాత్మక సయ్యద్‌ మోదీ సూపర్‌ 300 టైటిల్‌ కొట్టింది. లైన్ దొరకబుచ్చుకున్న సింధు.. ఫిట్‌ గా ఉంటే 2028 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌ లోనూ ఆడతానని చెబుతోంది.

తమ రెండు కుటుంబాలకు ఎప్పట్నుంచో పరిచయం ఉందని.. జూలై-ఆగస్టులో జరిగిన పారిస్‌ ఒలింపిక్స్‌ ముగియగానే పెళ్లి చేసుకుందామని భావించినా వరుస టోర్నీలతో ఆలస్యమైందని చెప్పింది. వెంకట్‌ బ్యాడ్మింటన్‌ ఆడరు కానీ తన మ్యాచ్‌లు చూస్తారని.. బ్యాడ్మింటన్‌ ను ఫాలో అవుతారని.. క్రీడలంటే ఇష్టం ఉన్నా వ్యాపారం వైపు వెళ్లారని సింధు వివరించింది.