సింగపూర్ లో మూత్రం, మురుగు నీటితో బీర్లు... ఏమిటీ ‘నీవాటర్’?
అవును.. సింగపూర్ లో ఓ సరికొత్త బీరు ఇప్పుడు హల్ చల్ చేస్తోందంట.
By: Tupaki Desk | 13 Sep 2024 7:30 AM GMTబీరు ఎలా తయారు చేస్తారంటే చాలా మంది ఠక్కున సమాధానం చెబుతారు.. బ్రాందీ, విస్కీ, వైను ఎలా తయారవుతుంది అని అడిగినా ఆన్సర్ వచ్చేస్తుంది! కానీ... తాజాగా ఓ కంపెనీ తయారు చేస్తున్న బీరు గురించి అడిగితే మాత్రం వస్తోన్న సమాధానం షాకింగ్ గా ఉండగా... ఈ బీర్లకు ఫుల్ డిమాండ్ ఉందని చెబుతుండటం గమనార్హం!
అవును.. సింగపూర్ లో ఓ సరికొత్త బీరు ఇప్పుడు హల్ చల్ చేస్తోందంట. ఇతర బీర్ల లాగానే కనిపిస్తూ, అదే తరహా రుచినే అందిస్తున్నప్పటికీ... "న్యూబ్రూ" అనే కొత్త రకం బీరు మాత్రం స్పెషల్ గా నిలుస్తుంది. అందుకు గల కారణం... ఈ బీర్లను మూత్రం, మురుగు నీటిని శుద్ధిచేయగా వచ్చిన నీటితో తయారు చేస్తున్నారంట.
ఈ "న్యూబ్రూ" బీరును తయారు చేసేందుకు ఇలా మూత్రం, మురుగు నీటిని శుద్ధిచేసిన వాటర్ 95% ఉపయోగిస్తున్నారు. దీనితో పాటు ఈ బీరు తయారీలో జర్మన్ బార్లీ మాల్ట్ లు, సుగంధ సిట్రాతో పాటు ఇతర పదార్థాలను వినియోగిస్తున్నారంట. నీటిని రీసైకిలింగ్ చేసి వినియోగించుకోవడంపై అవగాహన కల్పించేందుకు ఈ ప్రయోగం చేసినట్లు సింగపూర్ ఇంటర్నేషనల్ వాటర్ వీక్ ఎండీ ర్యాన్ యుయెన్ తెలిపారు.
ఈ సింగపూర్ ఇంటర్నేషనల్ వాటర్ వీక్ తో కలిసి నేషనల్ వాటర్ ఏజెన్సీ, లోకల్ క్రాఫ్ట్ బీర్ బ్రూవర్ సంస్థలు ఈ బ్రాండును విడుదల చేశాయి! కాగా... ఇలా మూత్రంతోపాటు మురుగు నుంచి శుద్ధి చేసి తీసిన నీటికి "నీవాటర్" అని పేరు. అంతర్జాతీయ ప్రమాణాలు పాటించి శుద్ధి చేస్తోన్న ఈ నీటిని తాగునీరుగా ఉపయోగించవచ్చు.