ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మోదీ మార్క్ నేత
ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడిగానూ ఎవరి అంచనాల్లోనూ నేతకు అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ హైకమాండ్ డిసైడ్ అయిందని తెలుస్తోంది.
By: Tupaki Desk | 26 Jan 2025 2:39 PM GMTఅనూహ్య ఎంపికలకు బీజేపీ ఓ చిరునామా. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎవరూ ఊహించని నేతలకు కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రులుగా ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది కమలం పార్టీ. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడిగానూ ఎవరి అంచనాల్లోనూ నేతకు అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ హైకమాండ్ డిసైడ్ అయిందని తెలుస్తోంది. ఇక ఈ నియామకానికి ప్రధాని మోదీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా రాయలసీమకు చెందిన ఓ సాధారణ కార్యకర్తకు అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం. తొలి నుంచి సంఘ్ నేపథ్యంతో పాటు, ప్రజా ఉద్యమాల్లో పాలుపంచుకున్న అనుభవం ఉండటంతో మిగిలినే నేతలను కాదని ఆయనకు అవకాశం ఇవ్వాలని కమలం పెద్దలు డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత అధ్యక్షురాలు పురందేశ్వరి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని బీజేపీ పెద్దలు చాలా కాలంగా చూస్తున్నారు. ఇందుకోసం పలువురు నేతలను పరిశీలిస్తున్నారు.
కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరితోపాటు ఎమ్మెల్యే పార్థసారథి, పార్టీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ తదితరుల పేర్లు పరిశీలిస్తున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్ర మంత్రి పదవి ఆశించిన సుజానాకు రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టి ఆయనను సంతృప్తి పరచాలని కాషాయ నేతలు ఆలోచనగా ఉన్నట్లు చెప్పుకున్నారు. కానీ, ఇప్పుడు వీరెవరూ కాకుండా తొలి నుంచి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న నేతకు అవకాశం ఇవ్వాలని, ఎలాంటి ఆరోపణలు పక్షపాతం లేదని క్లీన్ ఇమేజ్ ఉన్న నేతనే అధ్యక్షుడిగా చేయాలని బీజేపీ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం.
ప్రస్తుతం బీజేపీ హైకమాండ్ వర్గాల సమాచారం ప్రకారం రాయలసీమలోని రెడ్డి సామాజికవర్గానికి చెందిన కడప బీజేపీ అధ్యక్షుడు సింగారెడ్డి రామచంద్రారెడ్డిని ఏపీ బీజేపీ సారథిగా నియమించాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. ఈయన పేరును ప్రధాని మోదీ కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి పనిచేసిన రామచంద్రారెడ్డి వంటివారికి అవకాశమిస్తే పార్టీ బలోపేతమవుతోందని బీజేపీ పెద్దలు ఆలోచనగా చెబుతున్నారు.
కడప జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల. మాజీ ముఖ్యమంత్రి జగన్ కుటుంబాన్ని ఎదిరించి రాజకీయాలు చేయడంతో సింగారెడ్డి రామచంద్రారెడ్డికి కలిసి వచ్చిందని చెబుతున్నారు. 1978 నుంచి ఆయన ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తున్నారు. 2017లో ఏపీ బీజేపీ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2019లో కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. రైతు సేవా సమితి ఏర్పాటు చేసి సాగునీటి సమస్యలపై పోరాడారు. కడప రిమ్స్ ఆస్పత్రిలో ఉచిత మంచినీటి సరఫరా చేసి తన దయాగుణం చాటుకున్నారు. పలు రైతు సమస్యలపై పోరాడి కీలక నేతగా ఎదిగారు. దీంతో ఆయనను బీజేపీ అధ్యక్షుడిగా ఎంపిక చేసి పార్టీలో సాధారణ కార్యకర్తలకే ఎక్కువ అవకాశాలిస్తామనే విషయాన్ని చాటాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మను ఎంపిక చేసిన విధంగానే సింగారెడ్డి రామచంద్రారెడ్డికి అవకాశమిచ్చి తమ పార్టీ ప్రత్యేకత చాటుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.