సింగరేణి షాకిచ్చింది.. ఏమీ అర్ధం కావడం లేదు.. ఇప్పుడే ఏమీ చెప్పలేం!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా దెబ్బ కొట్టడంతో బీఆర్ ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 4 Dec 2023 4:11 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా దెబ్బ కొట్టడంతో బీఆర్ ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితాలు తమకేమీ అర్ధం కావడం లేదన్నారు. ఓటమిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఓటమి చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని, రాజకీయాలన్న తర్వాత గెలుపు ఓటములు సహజమని పేర్కొన్నారు. పార్టీ కోసం తమ నేతలు ఎంతో కష్టపడ్డారని, గతం కంటే మంచి మెజారిటీ సాధిస్తామని భావించామని వెల్లడించారు.
``ఫలితాలు నిరాశకు గురిచేశాయి. అయినా అసంతృప్తి మాత్రం లేదు. ఎగ్జిట్ పోల్స్ తప్పు అని, మాకు 70 ప్లస్ సీట్లు వస్తాయని మొన్న చెప్పాను. కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. అందుకే నేనేమీ బాధపడడంలేదు`` అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల సరళి చూస్తే ఒక వేవ్ లా అనిపించడంలేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో, మెదక్ జిల్లాలో ఫలితాలు దాదాపు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఏకపక్షంగా ఉన్నాయని, కరీంనగర్ జిల్లాలో 40:60 నిష్పత్తిలో ఫలితాలు వచ్చాయని వివరించారు.
తెలంగాణ ఎన్నికల పరిస్థితి తమకు కూడా అర్థం కాకుండా ఉందన్నారు. ఓటమికి కారణాలు ఇప్పుడే చెప్పలేమని వ్యాఖ్యానించారు. నాయకులందరితో మాట్లాడిన తర్వాత, అభ్యర్థుల అనుభవాలు కూడా తెలుసుకుని ఓటమి కారణాలు ఏవన్నది నిర్ణయిస్తామన్నారు. "పెద్దపల్లి పార్లమెంటు స్థానం పరిధిలోని చెన్నూరు నియోజకవర్గంలో సోదరుడు బాల్క సుమన్ చేసినంత అభివృద్ధి గతంలో మంత్రులుగా పనిచేసినవాళ్లు కూడా చేయలేదు. కానీ సుమన్ ఓడిపోయారు. మందమర్రిలో కూడా ఇలాంటి ప్రతికూల ఫలితమే వచ్చింది`` అని తెలిపారు.
సింగరేణి షాకిచ్చింది!
``సింగరేణికి మేం చేసినంత మేలు మరెవ్వరూ చేయలేదు. సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకున్నాం, సింగరేణి కార్మికులకు 32 శాతం బోనస్ ఇచ్చాం. కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన 10 హామీలు నెరవేర్చాం. వారసత్వ ఉద్యోగాలు వంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించాం. కానీ ఇవాళ అక్కడ కాంగ్రెస్ పార్టీకి అసాధారణమైన మెజారిటీలు వచ్చాయి. నాకు తెలిసి అంత మెజారిటీ వస్తుందని కాంగ్రెస్ వాళ్లు కూడా ఊహించి ఉండరు. ఈ ఫలితం మాకు షాకిచ్చింది. భిన్నమైన అంశాలు మా ఓటమికి దారి తీసి ఉంటాయని భావిస్తున్నాను" అని వివరించారు.