అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక కుట్ర: సింగర్ కల్పన
తాజాగా బన్నీ అరెస్టు విషయంపై సింగర్ కల్పన స్పందించారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు.
By: Tupaki Desk | 15 Dec 2024 10:11 AM GMTహైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం జైలుకు వెళ్లిన బన్నీ.. శనివారం ఉదయం బయటకు వచ్చారు. అనంతరం గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లి న్యాయవాదులతో చర్చించి తన నివాసానికి చేరుకున్నారు.
అయితే అల్లు అర్జున్ అరెస్టును అనేక మంది సెలబ్రిటీస్ ఖండించారు. సోషల్ మీడియాలో పలువురు ప్రముఖులు బన్నీకి మద్దతుగా పోస్టులు పెట్టారు. కొందరు మీడియా ముందుకు వచ్చి మద్దతు తెలిపారు. మరికొందరు ఫోన్ లో మాట్లాడారు. ఇంకొందరు నేరుగా శనివారం బన్నీ ఇంటికి వెళ్లి ఆయనను కలిసి పరామర్శించారు.
తాజాగా బన్నీ అరెస్టు విషయంపై సింగర్ కల్పన స్పందించారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం వెనుక కుట్ర కోణం ఉన్నట్లు అనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక ఐకాన్ స్టార్ అని, పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు తెచుకున్నారని అన్నారు.
తన హార్డ్ వర్క్, డెడికేషన్ తో మంచి స్థానానికి బన్నీ చేరుకున్నారని తెలిపారు. అలాంటిది.. ఏదో పెద్ద నేరం చేసినట్లు బెడ్ రూమ్ కు వెళ్లి అరెస్ట్ చేయడం న్యాయం కాదని తెలిపారు. అల్లు అర్జున్ కు చెడ్డ పేరు తీసుకు వచ్చేందుకు అరెస్ట్ చేసినట్లుగా అర్థమవుతోందని అన్నారు. అందులో గూఢాలోచన దాగి ఉందని ఆరోపించారు.
సెక్షన్ 105 కింద అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారని, ఆ సెక్షన్ ప్రకారం ఉద్దేశపూర్వకంగా పాల్పడితే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కానీ అల్లు అర్జున్ కు అలాంటి ఉద్దేశ్యం లేదని, 105 సెక్షన్ పని చేయదని అభిప్రాయపడ్డారు. ఆయన ఎవరినీ కొట్టలేదని, ప్రేరేపించలేదని అందుకే మరో సెక్షన్ కూడా వర్తించదన్నారు.
అసలు ఆయన చేసిన తప్పేంటని ప్రశ్నించారు. మహిళ చనిపోయిన ఘటన 100 శాతం ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పారు. తొక్కిసలాటలు చాలా సార్లు జరిగాయని తెలిపారు. ఇదేం మొదటిసారి కాదని అన్నారు. అలాంటప్పుడు ఎప్పుడూ పెట్టని సెక్షన్లు ఇప్పుడు మాత్రమే ఎందుకు పెట్టారని క్వశ్చన్ చేశారు. ప్రస్తుతం కల్పన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అనేక మంది నెటిజన్లు.. ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు!