బాబు ఈజ్ బ్యాక్... చంద్రబాబు ఒక్క ఫోటో, ఎన్నో క్లారిటీలు!
ఈ సందర్భంగా వేదికపై ఉన్న బీజేపీ పెద్దలు అమిత్ షా, వెంకయ్య నాయుడు, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ లను చంద్రబాబు మర్యాదపూర్వకంగా పలకరించారు.
By: Tupaki Desk | 12 Jun 2024 2:27 PM GMTఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా భారీ విక్టరీ సాధించిన కూటమి పార్టీల నుంచి టీడీపీ అధినేత ముఖ్యమంత్రిగా, జనసేన అధినేత మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. వీరితో పాటు మరో 23 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా సభా వేదికపై కనిపించిన దృశ్యానికి సంబంధించిన ఒక ఫోటో వైరల్ గా మారింది.
అవును... ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా వేదికపై ఉన్న బీజేపీ పెద్దలు అమిత్ షా, వెంకయ్య నాయుడు, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ లను చంద్రబాబు మర్యాదపూర్వకంగా పలకరించారు. ఈ సమయంలో ఆ నలుగురు పెద్దలూ లేచి చంద్రబాబుకు నమస్కారం చేయడం కనిపించింది!
దీనికి సంబంధించిన ఫోటోనే ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది. దీంతో... ఏపీకి అన్ని రకాలుగానూ మంచి రోజులు వచ్చాయని ఈ ఫోటో మరింత క్లారిటీ ఇస్తుందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇదే సమయంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో ఇప్పుడు టీడీపీ కీ రోల్ పోషిస్తుండటంతో... ఏపీకి కేంద్రం నుంచి ఫుల్ సపోర్ట్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ రోజు ఏపీలోనే కానీ, కేంద్రంలోనే కానీ ఎన్డీయే అధికారంలోకి రావడానికి 74 ఏళ్ల వయసులో చంద్రబాబు చేసిన కృషి వర్ణనాతీతం అనే చెప్పాలి. 2019లో 23 సీట్లకు పరిమితమైన పార్టీని, ఎన్నికలకు ముందు ఏభైకి పైగా రోజులు జైల్లో గడిపిన పరిస్థితి నుంచి నేడు 175కి 164 సీట్లు కూటమి గెలుచుకునేలా చేయడంలో బాబు పాత్ర, కృషి ఒక చరిత్ర.
గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది అన్నట్లుగా చంద్రబాబు.. వయసు పెరిగే కొద్దీ మరింత యాక్టివ్ అయినట్లుగా... ఎన్నికల ప్రచార సమయంలో హోరెత్తించేశారు. అతి తక్కువ వ్యవధిలో సుమారు 90కి పైగా బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. ఫలితంగా... ఆయన నిలిచారు, పార్టీని నిలిపారు, కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంలోనూ కీ రోల్ పోషించారు.
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బీజేపీ నేతలు... గతంలో కంటే అత్యధికంగా చంద్రబాబుకి గౌరవం ఇస్తున్నారని అంటున్నారు. ఈసారి ఏపీకి విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలుచేయించుకుంటారని ధీమాగా చెబుతున్నారు. ఆ విషయాన్ని ఈ ఫొటో మరింత బలపరుస్తుందని, స్పష్టత ఇస్తుందని అంటున్నారు.
రేపటి లోగా మంత్రులకు శాఖలు కేటాయింపు!:
మరోపక్క మంత్రులుగా ప్రమాణస్వీకారాలు చేసిన వారికి శాఖల కేటాయింపుపైనా చంద్రబాబు దృష్టి పెట్టారని అంటున్నారు. ఇందులో భాగంగా... మంత్రుల అభీష్టాలు, సమర్థత మేరకు శాఖల కేటాయింపు ఉంటుందని.. అది కూడా గురువారంలోపు పూర్తయిపోతుందని చంద్రబాబు వారికి తెలిపారు.
ఈ సందర్భంగా... ఇచ్చిన శాఖలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాల్సిన బాధ్యత మంత్రులదే అని చెప్పిన చంద్రబాబు.. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మేలు చేయాలని సూచించారు. ఇదే సమయంలో శాఖల వారీగా శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజలపై ఉంచుదామని చెబుతూ... పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్ధేశం చేశారు.