Begin typing your search above and press return to search.

లక్ష కోట్ల కాళేశ్వరం కుంగి ఏడాది.. బీఆర్ఎస్ సర్కారు పతనానికి పునాది

సరిగ్గా గత ఏడాది ఈ రోజున తెలంగాణలో తీవ్ర స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల సమరం సాగుతోంది.

By:  Tupaki Desk   |   22 Oct 2024 12:30 PM GMT
లక్ష కోట్ల కాళేశ్వరం కుంగి ఏడాది.. బీఆర్ఎస్ సర్కారు పతనానికి పునాది
X

ఎన్నో అంచనాలు.. మరెన్నో ప్రత్యేకతలు.. నదినే దారి మళ్లించారన్న గొప్పలు.. రూ.లక్ష కోట్లు ఖర్చు.. ఓ ఇంజినీరింగ్ అద్భుతం అనే ప్రశంసలు.. రెండోసారి గెలుపునకు అదే పునాది.. కానీ, మూడోసారీ కచ్చితంగా గెలుస్తామన్న ఆశలకు అదే అడ్డుకట్ట.. సమైక్యాంధ్ర పాలకుల చేతిలో సాగు నీటి రంగంలో తీవ్ర అన్యాయానికి గురయ్యామన్న అప్పటి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు చివరకు అంతే స్థాయిలో విమర్శల పాలైంది. నిరుడు అక్టోబరు 21న నిలువునా కుంగింది. నాటి పాలక పార్టీని కుదేలు చేసింది.

నిరుడు ఏం జరిగింది..?

సరిగ్గా గత ఏడాది ఈ రోజున తెలంగాణలో తీవ్ర స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల సమరం సాగుతోంది. అప్పటికి పాలక పార్టీగా ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అత్యంత దూకుడుగా ప్రచారంలో దూసుకెళ్తోంది. నాటి ప్రతిపక్ష కాంగ్రెస్ కచ్చితంగా గెలవాలన్న పట్టుదలతో పోరాడుతోంది. ఇక బీజేపీ సరేసరి.. తెలంగాణలో కాషాయ జెండా ఎగురేస్తాం అంటూ హడావుడి చేస్తోంది. ముక్కోణపు పోరులో ఓటరు ఎవరిని ఆదరిస్తారో తెలియని ఉత్కంఠభరిత పరిస్థితి అది. అదే సమయంలో చోటుచేసుకుంది ఒక్క ఘటన.

ఎన్నికలనే ప్రభావితం చేసేలా..

తెలంగాణ ఎన్నికలను అత్యంత ప్రభావితం చేసిన ఘటన ఏది అంటే.. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ కుంగడమేనని చెప్పాలి. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మానసపుత్రిక అయిన కాళేశ్వరంలో మేడిగడ్డ ప్రధాన బ్యారేజీ. 2023 అక్టోబరు 21వ తేదీ రాత్రి వేళ ఒక్కసారిగా భారీ శబ్దంతో ఈ బ్యారేజీ పైన ఉన్న వంతెన కుంగిపోయింది. పియర్‌ కింద పగుళ్లు వచ్చాయి. కేసీఆర్‌ 2016 మే 2న మేడిగడ్డ వద్దనే కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం గమనార్హం. ఇక రెండోసారి అధికారంలోకి వచ్చాక మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫఢణవీస్, వైఎస్ జగన్ లతో కలిసి దీనిని 2019 జూన్‌ 21న ప్రారంభించారు. అంటే.. మూడేళ్లలోనే మేడిగడ్డ కుగింది. దీంతో ఇంజనీరింగ్‌ అధికారులు, జల వనరుల నిపుణులు, ప్రభుత్వ సూచన మేరకు బ్యారేజీని ఖాళీ చేశారు. ఇక అందరూ ఊహించినట్లే ఎన్నికల ప్రచారాన్ని ఈ ఘటన మలుపు తిప్పింది.

అప్పటివరకు హోరాహోరీ..

కాళేశ్వరం కుంగుబాటుకు ముందు వరకు తెలంగాణ ప్రజల మూడ్ ఏమిటో కానీ.. బ్యారేజీ కుంగిన తర్వాత వారి ఆలోచన మారిందనే చెప్పొచ్చు. అంతకుముందే నిరుద్యోగుల ఆత్మహత్యలు, పోటీ పరీక్షల పేపర్ లీక్ లు, పాలనా పరమైన వైఫల్యాలు, సంక్షేమ పథకాల అమలులో లోపాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒడిదొడుకుల్లో ఉంది. అయినా, ఎన్నికల్లో ఓడిపోతుందని మాత్రం చెప్పలేని పరిస్థితి. ఇక మేడిగడ్డ కుంగుబాటుతో మాత్రం అంతా తలకిందులైంది. కాళేశ్వరం కుంగుబాటు చుట్టూనే ప్రచారం సాగి.. బీఆర్ఎస్ ను ఓడించింది.

నాడు వెళ్లనీయలేదు.. సీఎంగా వెళ్లారు

కాళేశ్వరంపై మొదటి నుంచి విమర్శలున్నా.. దాని సందర్శనకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల సందర్శనకు ఆంక్షలుండేవి. అయితే, ఎన్నికల సమయం కాబట్టి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, టీపీసీసీ అప్పటి చీఫ్ రేవంత్ రెడ్డి బ్యారేజీని సందర్శించగలిగారు. కాగా, ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రేవంత్‌ సీఎం అయ్యారు. ఆయనతో పాటు మంత్రుల బృందం మేడిగడ్డలో పర్యటించింది. ఇక దెబ్బతిన్న బ్యారేజీని జాతీయ, రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ ఇంజనీర్ల బృందం పరిశీలించి సిఫార్సులు చేసింది. వర్షా కాలంలో బ్యారేజీకి ముప్పు కలగకుండా తాత్కాలిక పునరుద్ధరణ చర్యలను సూచించింది. పియర్ల పగుళ్ల పూడ్చివేత, గేట్ల తొలగింపు, దిమ్మెలను సరిదిద్దడం, బ్యారేజీ ఎగువ, దిగువన బుంగలను పూడ్చివేయడం చేపట్టారు. డ్యాం సేఫ్టీ అథారిటీ అయితే పలు పరిశీలనలు, పరీక్షలు చేయాలని పేర్కొంది. వీటిలో కొన్నిటిని చేశారు. మేడిగడ్డ శాశ్వత పునరుద్ధరణ విషయంలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయనుంది.