Begin typing your search above and press return to search.

సిర్పూర్ పొలిటిక‌ల్ సిత్రం సూడ‌ర‌బాబూ!

కాంగ్రెస్‌పార్టీ కూడా సంస్థాగ తంగా సాంప్రదాయ ఓటు బ్యాంకును కలిగి ఉండడంతో కోన‌ప్ప గెలుపు అంత ఈజీకాద‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

By:  Tupaki Desk   |   2 Nov 2023 9:26 AM GMT
సిర్పూర్ పొలిటిక‌ల్ సిత్రం సూడ‌ర‌బాబూ!
X

కాశీప‌ట్నం చూడ‌ర‌బాబు.. కాల‌జ్ఞానం విన‌రాబాబూ.. అన్న‌ట్టుగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు కూడా చిత్రంగా మారాయి. దీంతో సిర్పూర్ పొలిటిక‌ల్ సిత్రం సూడ‌ర బాబూ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీల‌కు తోడు ఈ సారి బీఎస్పీ కూడా గ‌ట్టిపోటీ ఇస్తోంది. పైగా.. ఇక్క‌డ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ త‌ర్వాత‌.. ఆక‌ర్ష్ ఆప‌రేష‌న్లు ఇంకా కొన‌సాగుతున్నా యి. మీరుమా పార్టీలో చేరితో ప‌ద‌వులు ఇస్తాం అంటూ కీల‌క నాయ‌కుల‌కు గేలం వేస్తున్నారు.

ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేరు కోన‌ప్ప సిర్పూర్‌లో బ‌ల‌మైన అభ్య‌ర్థిగా ఉన్నారు. అదేస‌మ‌యంలో మ‌రో ప‌క్షం బీఎస్పీ ఓటు బ్యాంకు కూడా బ‌లంగానే ఉంది. దీనికి కార‌ణం.. 2014 ఎన్నిక‌ల్లో కోన‌ప్ప‌.. బీఎస్పీ నుంచి ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకున్నారు. దీంతో క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌మైన పార్టీగా బీఎస్పీ ఎదిగింది. ఇక‌, ఆ త‌ర్వాత ఆయ‌న కేసీఆర్ పంచ‌న చేరిపోవ‌డంతో బీఎస్పీ బ‌ల‌హీన ప‌డింద‌నే టాక్ వినిపించినా.. అది నామ‌మాత్రమేన‌ని తేలిపోయింది.

దీంతో బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్‌లు అధికార పార్టీకి సంక‌టంగా మారాయి. కాంగ్రెస్‌పార్టీ కూడా సంస్థాగ తంగా సాంప్రదాయ ఓటు బ్యాంకును కలిగి ఉండడంతో కోన‌ప్ప గెలుపు అంత ఈజీకాద‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, అన్ని పార్టీల అభ్య‌ర్థుల మ‌ధ్య ఎత్తుకు పైఎత్తులతో ప్రత్యర్థి శిబిరాన్ని చిత్తు చేసేందుకు వ్యూహాత్మకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

2014లో జరిగిన ఎన్నికల్లో కోనప్ప బీఎస్పీ నుంచి విజయం సాధించడాన్ని దృష్టిలో పెట్టుకొని స్వయంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఇక్కడ బరిలోకి దిగి గ్రామగ్రామాన క్యాడర్‌, ఓటు బ్యాంకును పెంచుకునేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్‌బాబు గత ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఈసారి సానుభూతి, హిందూత్వ సెంటిమెంటుతో గెలుపు కోసం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీలు, ప్రభుత్వ వ్యతిరేకత, సాంప్రదాయ ఓటు బ్యాంకు, మైనార్టీ ఓటర్లపై ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని ఆలస్యంగా ఖరారు చేసినప్పటికీ ప్రజల్లో కాంగ్రెస్‌ పట్ల ఉన్న ఆదరణ తనకు అనుకూలిస్తుందనే వ్యూహంతో రావి శ్రీనివాస్‌ ప్రణాళిక ప్రకారం ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసిన దరిమిలా నియోజకవర్గంలో బలంగా ఉన్న కోనేరు కోనప్పే ప్రత్యర్థులందరికి ప్రధానలక్ష్యంగా మారారు.

గ‌తంలో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసి కోనప్ప చేతిలో ఓడిపోయిన హరీష్‌బాబు ఈసారి బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. ఇక్కడ బీజేపీకి ప్రజాదరణ పెద్దగా లేకపోయినప్పటికీ గత ఎన్నికల్లో ఓటమి పట్ల ఉన్న సానుభూతి, తమ కుటుంబానికి ఉన్న ఆదరణ విజయానికి బాటలు వేస్తుందనే ధీమాతో ఉన్నారు. అటు కాంగ్రెస్‌ అభ్యర్థి రావి శ్రీనివాస్‌ కూడా సానుభూతి ప్లే చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలోని ఇత‌ర ప్ర‌ధాన నియోజ‌క‌వ‌ర్గాల‌కు దీటుగా సిర్పూరు నియోజ‌క‌వ‌ర్గంలోనూ పోరు ర‌స‌వ‌త్త‌రంగా మారింది.