Begin typing your search above and press return to search.

బెయిల్ హక్కు.. జైలు మినహాయింపు.. సిసోదియా కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు

జైలులో మనీశ్ సిసోదియా కూడా వ్యథను అనుభవించారనే కథనాలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   9 Aug 2024 9:58 AM GMT
బెయిల్ హక్కు.. జైలు మినహాయింపు.. సిసోదియా కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
X

ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియాకు ఎట్టకేలకు ఊరట లభించింది. మద్యం కుంభకోణం కేసులో గత ఏడాది ఫిబ్రవరిలో అరెస్టయి 500 పైగా రోజులు జైలులో ఉన్న ఆయన త్వరలో బయటి ప్రపంచాన్ని చూడనున్నారు. భార్యకు తీవ్ర అనారోగ్యం ఉన్న పరిస్థితుల్లో జైలులో తీవ్ర వ్యథ అనుభవించిన సిసోదియా.. ఏడాదిన్నరగా ఎన్నో కష్టాలు భరించారు. ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మధ్యలో భార్య ఆరోగ్యం కూడా క్షీణించింది. జైలులో మనీశ్ సిసోదియా కూడా వ్యథను అనుభవించారనే కథనాలు వచ్చాయి. ఇప్పుడు ఎట్టకేలకు ఆయన బయటకు వస్తున్నారు.

ఢిల్లీ స్కూళ్ల రాతను మార్చి..

దేశ రాజధాని అయిన ఢిల్లీలో విద్యా శాఖ మంత్రిగా ప్రభుత్వ పాఠశాలల రాతను మార్చిన నాయకుడిగా సిసోదియాకు పేరుంది. సీఎం కేజ్రీవాల్ కుడి భుజమైన ఆయన మద్యం కుంభకోణం కేసులో ఇరుక్కున్నారు. స్కూళ్ల విషయంలో వచ్చిన పేరు మద్యం స్కాంతో పోయింది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనను నిరుడు ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేసింది. ఈడీ కూడా కస్టడీలోకి తీసుకుంది. అరెస్టు తర్వాత రెండు రోజులకు మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచి జైల్లోనే ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్లపై జస్టిస్‌ బి.ఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కె.వి. విశ్వనాథన్‌ లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపి తీర్పు ఇచ్చింది.

ఆ వ్యాఖ్యలు అత్యత కీలకం..

మనీశ్ సిసోదియాకు బెయిల్ మంజూరు సమయంలో సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఈ కేసులో కీలకంగా మారాయి. నిందితుడిని కాల పరిమితి లేకుండా జైలులో ఉంచలేరని.. కేసు విచారణలో పురోగతి లేకపోయినా ఒక పరిమితి దాటాక వారిని జైలులో ఉంచడం సరికాదని పేర్కొంది. ఒకవేళ అలా చేస్తే అది వ్యక్తి హక్కులను హరించడమేనని తెలిపింది. బెయిల్ కు దరఖాస్తు చేసుకోవడ , ఉపశమనం పొందడం హక్కు అని.. ‘బెయిల్ అనేది నియమం.. జైలు మినహాయింపు’ అనే సంగతిని కింది కోర్టులు గుర్తించాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించింది. కాగా, ఢిల్లీ మద్యం కేసులో సీఎం కేజ్రీవాల్ జైలులో ఉన్నారు. కానీ, ఆయన రాజీనామా చేయలేదు. ఇదే కేసులో అరెస్టయి జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కూడా బెయిల్ రావాల్సి ఉంది. ఆమె బెయిల్ పిటిషన్ ను వెనక్కు తీసుకున్న సంగతి తెలిసిందే.