ఉత్తరాన చెల్లెలు.. దక్షిణాదిన అన్న.. అగ్ర నేతల బాధ్యతలు
ఇలాంటి సమయంలో కాంగ్రెస్ గనుక వచ్చే ఎన్నికల్లో విజయం సాధించకుంటే మరో ఐదేళ్లు ఆ పార్టీని మిత్రపక్షాలు కూడా పెద్దగా పట్టించుకోవు.
By: Tupaki Desk | 7 April 2024 12:30 PM GMTవచ్చే లోక్ సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చావోరేవో. ఈసారి గనుక పరాజయం పాలైతే ఆ పార్టీకి ఇక మరింత కష్ట కాలం తప్పదు. ఓ వైపు ప్రధాని మోదీ హ్యాట్రిక్ అంటూ కలవరిస్తున్నారు. గతంలో ఎప్పుడో విడిపోయిన మిత్రపక్షాలను కలుపుకొంటున్నారు. ప్రత్యర్థులను బలహీనం చేస్తున్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రత్యర్థులను శత్రువుల్లా చూస్తూ జైళ్లలో పెడుతున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ గనుక వచ్చే ఎన్నికల్లో విజయం సాధించకుంటే మరో ఐదేళ్లు ఆ పార్టీని మిత్రపక్షాలు కూడా పెద్దగా పట్టించుకోవు.
అక్కడ ఆమె..
కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఎన్నికల్లో సోనియా గాంధీ పూర్తి స్థాయి ప్రచారం చేసే పరిస్థితి లేదు. అనారోగ్యం, వయోభారం ఆమెను ఇబ్బందిపెడుతున్నాయి. దీంతో బాధ్యతంతా కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా మీదనే ఉందనడంలో సందేహం లేదు. వీరిద్దరూ ఎన్నికల కురక్షేత్రాన్ని తొలిసారిగా తల్లి పాత్ర పూర్తిస్థాయిలో లేకుండా ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సందర్భంలో బాధ్యతలను కూడా పంచుకున్నట్లు స్పష్టమవుతోంది. ప్రియాంక పూర్తిగా ఉత్తరాదిన ఎన్నికలను చూస్తున్నారు. ఆమె తమ కుటుంబ నియోజకవర్గం అయిన రాయ్ బరేలీ నుంచి పోటీ చేసే అవకాశం కూడా ఉంది. తల్లి సోనియా 20 ఏళ్లకు పైగా ఇక్కడినుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కూడా అమేఠీ నుంచి పోటీ చేస్తానని సంకేతాలిచ్చారు. ఈ స్థానంలో రాహుల్ 2004 నుంచి 2014 వరకు గెలుపొందారు. 2019లో అమేఠీలో ఓడినా వాయనాడ్ నుంచి నెగ్గారు. ఈ నేపథ్యంలోనే ప్రియాంక కీలకమైన ఉత్తరాది బెల్ట్ లో కాంగ్రెస్ ప్రచారం, ఎన్నికల సరళిని పర్యవేక్షించే చాన్సుంది.
ఇక్కడ ఈయన..
రాహుల్ గాంధీ.. వచ్చే ఎన్నికల్లోనూ కేరళలోని వాయనాడ్ నుంచి బరిలో దిగుతున్నారు. మరోచోట నుంచి పోటీ చేసేదీ లేనిదీ తెలియరాలేదు. అయితే, అమేఠీ బరిలో ఉంటారని భావించినా.. పూర్తిస్థాయి ఫోకస్ మాత్రం దక్షిణాదిపై ఉంచారని స్పష్టం అవుతోంది. ఇక రాహుల్ ఇప్పటికే తెలంగాణలో పలుసార్లు పర్యటించారు. ఇక్కడివారికి బాగా దగ్గరయ్యారు. ఏపీలోనూ ఆయన పార్టీని పునరుజ్జీవింపజేసే పనిలో ఉన్నారు. తమిళనాడు ఎలాగూ డీఎంకే వంటి గట్టి పార్టీ ఉంది. కేరళలో స్వయంగా బరిలో దిగారు. ఇక కర్ణాటక గురించి చెప్పాల్సిన పనిలేదు. అక్కడ ఆ పార్టీనే అధికారంలో ఉంది.
కొసమెరుపు: అన్నాచెల్లెళ్లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల్లో రాహుల్ పరిస్థితే కొంచెం బెటర్. ఎందుకంటే.. దక్షిణాదిన బీజేపీ కర్ణాటకలో తప్ప ఎక్కడా బలంగా లేదు. దీంతో ఇక్కడినుంచి ఇండియా కూటమి అధిక సీట్లు సాధించడం ఖాయం.