Begin typing your search above and press return to search.

లడ్డూ ప్రసాదం విషయంలో సిట్ ఏమి తేల్చబోతోంది ?

అనుమానాలు అయితే సర్వత్రా వ్యాపించాయి. దాని మీద ఎవరి మటుకు వారు కధనాలు అల్లుతున్నారు. అయితే నిజం బయటకు రావాలి.

By:  Tupaki Desk   |   24 Sep 2024 2:30 PM GMT
లడ్డూ ప్రసాదం విషయంలో సిట్ ఏమి తేల్చబోతోంది ?
X

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీ జరిగిందని ఏకంగా ముఖ్యమంత్రి స్థాయిలోనే తీవ్ర ఆరోపణలు రావడంతో గత వారం రోజులుగా దేశమంతా అట్టుడికిపోతోంది. ఈ నేపథ్యంలో కల్తీ జరిగిందా లేదా అన్నది తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.

అనుమానాలు అయితే సర్వత్రా వ్యాపించాయి. దాని మీద ఎవరి మటుకు వారు కధనాలు అల్లుతున్నారు. అయితే నిజం బయటకు రావాలి. అసలు ఏమి జరిగింది అన్నది లోకానికి తెలియాలి. ఏపీలో నాలుగు నెలలుగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఉంది.చరిత్రలో తొలిసారిగా టీటీడీ ప్రసాదం అపవిత్రం అయింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు.

అయితే ఆరోపణలు వేరు ఆధారసహితంగా నిగ్గు తేల్చడం వేరు. దాని కోసం సమగ్రమైన సంపూర్ణమైన దర్యాప్తు అవసరం. దాని కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే సిట్ ని నియమించింది. సిట్ చీఫ్ గా సర్వశ్రేష్ట త్రిపాఠిని నియమిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

త్రిపాఠి ప్రస్తుతం గుంటూరు రేంజి డీఐజీగా ఉన్నారు. ఆయన నాయకత్వం సిట్ పనిచేస్తుంది. సిట్ తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ అయిందా లేదా అన్నది తేలుస్తుంది అని అంటున్నారు. అయితే ఇక్కడే అనేక డౌట్లు వ్యక్తం అవుతున్నాయి. గత అయిదేళ్లలో శ్రీవారి లడ్డూ తయారీ కోసం వాడిన నెయ్యి అలాగే ఇతర పూజా వ్యవహారాలకి వాడిన నెయ్యిలో కల్తీ చోటు చేసుకుందని ఆరోపణలు ఉన్నాయి.

అంతే కాదు జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసింది అని ఆరోపణలు ఉన్నాయి. ఇవి తీవ్రమైనవి. అయితే గతంలో వాడిన నెయ్యి అయితే ఇపుడు లేదు, ఆ లడ్డూలూ లేవు, మరి ఏ విధంగా అప్పట్లో కల్తీ జరిగింది అన్నది సిట్ నిరూపిస్తుంది అన్నది ఒక చర్చగా ఉంది. అయితే లడ్డూ పోటులో పనిచేసే ఉద్యోగులను అక్కడ ఉన్న సిబ్బందిని ఇతరులను సిట్ పశ్నించే అవకాశం ఉంది.

అంతే కాకుండా అన్నప్రసాదం తో పాటు ఇతర పూజాదికాల కోసం వాడిన నెయ్యి అక్కడ ఉన్న సిబ్బందిని కూడా విచారిస్తుంది. వారు చెప్పే విషయాలను సిట్ నమోదు చేసుకుని ఒక కంక్లూషన్ కి వస్తుంది అని అంటున్నారు. కానీ ఇది సమగ్రమైన దర్యాప్తు అవుతుందా అన్నది కూడా చర్చగా ఉంది

ఎందుకంటే పాత నెయ్యి ఉంటే దానిని సేకరించి ల్యాబ్స్ కి పంపి టెస్ట్ చేయిస్తే అపుడు గతంలో కూడా ఇదే వాడారు అని చెప్పవచ్చు. కానీ నెయ్యి ఉండదు, అలాగే అప్పటి లడ్డూలు ఇపుడు ఉండే చాన్స్ లేదు. అవి పూర్తిగా పాడైపోతాయి కూడా.

మరి విచారణ అంతా పనిచేసే వారు చెప్పే దాని మీదనే ఆధారపడి సాగుతుందా అన్నది కూడా చూడాలి. ఇంకో విషయం ఏమిటి అంటే సిట్ చీఫ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తారు. లడ్డూలో నెయ్యి కల్తీ అయిందని జంతువుల కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు ప్రకటించేశారు. ఆయనను కాదని ఇది తప్పు అని చెప్పే పరిస్థితి సిట్ కి ఉంటుందా అన్నది మరో కీలకమైన పాయింట్.

అందుకే సిట్ విచారణలో ఏమి తేల్చబోతోంది అన్నదే ఇపుడు చర్చగా ఉంది. దానికి బదులుగా సీబీఐ విచారణ జరిపిస్తే ఇంకా లోతుగా మూలాల్లోకి వెళ్ళి వారు దర్యాప్తు చేసే చాన్స్ ఉందని అంటున్నారు. వీటన్నింటి కంటే న్యాయ విచారణలో పూర్తి సమాచారం వస్తుందని అన్న వారూ ఉన్నారు. అపుడే భక్తుల గాయపడిన భక్తుల మనోభావాలకు ఒక సమాధానం లభిస్తుంది.

ఇంకో వైపు చూస్తే తటస్థ సంస్థల నుంచే దర్యాప్తు జరగాలని కూడా అంటున్నారు. ఎందుకంటే తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అన్నది ఆధ్యాత్మిక కోణం నుంచి రాజకీయ కోణం వైపుగా మళ్ళింది. రెండు పార్టీలుగా రాజకీయం విడిపోయింది. దాంతో ప్రభుత్వం ఆధ్వర్యంలో సిట్ ఇచ్చే నివేదికను సహజంగానే వైసీపీ నో చెబుతుంది. అలాగే ఒక సెక్షన్ ఆఫ్ భక్తులలోనూ పూర్తి విశ్వసనీయత ఉండదు. ఇలా రెండు వైపులా కాకుండా మూడో పక్షం చేసే విచారణ ద్వారానే నిజాలు బయటకు వస్తాయని అంటున్నారు. మరి ఆ దిశగా ఏమైనా జరుగుతుందా అన్నదే చూడాల్సి ఉంది.